సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. పోరుబాటలోకి దిగాక వెన్నుచూపి పారిపోవడం వైఎస్సార్‌సీపీ చరిత్రలో లేదన్నారు. బయటికి పోరాటం అంటూ చీకట్లో కాళ్లబేరాలాడే చరిత్ర చంద్రబాబుదేనని మండిపడ్డారు. నాలుగేళ్లగా బీజేపీ, టీడీపీ కలిసి రాష్ట్రానికి చేసిన నయవంచనను ప్రజలకు తెలియచెప్పడానికే ఈ నెల 30న (సోమవారం) విశాఖలో దీక్ష చేపడుతున్నామని తెలిపారు.
హోదా కోసం పోరాడండి అంటే ప్రజాధనాన్ని ఖర్చు చేసి దొంగదీక్షలు చేసిన చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజు తొందరలోనే ఉందని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. తిరుపతి సభలో ఏపీకి హోదా ఇస్తామని మోదీ, బాబు హామీ ఇచ్చి.. ఇప్పుడు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా చంద్రబాబు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పార్లమెంటులో అవిశ్వాసం చర్చకు రాకుండా అడ్డుకున్న పార్టీల్లో టీడీపీ ఒకటని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాదయాత్రకు సంఘీభావంగా మే 2 నుంచి 12వ తేదీవరకు విశాఖలో పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. వైఎస్ జగన్ పాదయాత్ర 2,000 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పార్టీ అధ్యక్షుడికి సంఘీభావంగా కలెక్టరేట్‌ల వద్ద బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. టీడీపీది ధర్మపోరాటమా, అధర్మ పోరాటమా అని ప్రశ్నించారు. పప్పునాయుడు, నిప్పు నాయుడు మాటలను ప్రజలు నమ్మడం లేదని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment