సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. సోమవారం విశాఖపట్నం వేదికగా చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’ సభాప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. భారీగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలదోస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టించే వరకూ నిద్రపోనని అన్నారు. దేశంలోని హవాలా, విదేశాల్లోని ఆర్మ్‌డ్ డీలర్స్‌తో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
2014 ఏప్రిల్ 30న తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభకు, ఈ ఏడాది ఏప్రిల్ 30న చేపట్టిన సభ లక్ష్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయని అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్నది ‘ధర్మపోరాటదీక్ష’ కాదని, అదొక అధర్మ సభ అని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై వంచనకు పాల్పడుతున్న చంద్రబాబు ఈ సభను చిత్తశుద్ధితోనే నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు. కొండపైన బీజేపీతో టీడీపీ జట్టు కడుతూ.. కొండ కింద కుస్తీ పడుతోందన్నారు. ఇది ధర్మమా? న్యాయమా? అని మీరే ప్రశ్నించుకోండి.
చంద్రబాబుపై ఢిల్లీలో చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని విజయసాయి చెప్పారు. ప్రతి ఆరోపణకు తన వద్ద రుజువులు ఉన్నాయని తెలిపారు. తాను ప్రధానినని కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారనని అన్నారు. తాను ప్రధానిని కలిసిన మాట వాస్తవమేనని చెప్పారు. ప్రజా సమస్యల గురించి, ప్రత్యేక హోదా గురించి ప్రధానని కలిశాను. అవసరమైతే మరో 10 సార్లు ప్రధానమంత్రిని కలుస్తానని వెల్లడించారు.
చంద్రబాబు అవినీతిపై ప్రధానమంత్రికి ఆధారాలను సమర్పిస్తానని చెప్పారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిన చంద్రబాబును జైల్లో పెట్టించే వరకూ నిద్రపోనని అన్నారు. గత్యంతరం లేని స్థితిలో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందని తెలిపారు. అప్పటినుంచి ప్రతి క్షణం భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ చేసిన అవినీతే ఆ భయానికి కారణమని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment