విశాఖపట్నంలో నైపర్
♦ విజయవాడ సిపెట్ సామర్థ్యం పెంపు
♦ సీఐఐ సదస్సులో కేంద్ర మంత్రి అనంతకుమార్ ప్రకటన
(విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
ఇంజనీరింగ్ విద్యకు ఐఐటీ మాదిరిగా.. ఫార్మా విద్యకు ప్రధాన విద్యాసంస్థగా ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఫార్మా, ఎరువులు-రసాయనాల శాఖ మంత్రి ఎ.అనంతకుమార్ ప్రకటించారు. దీనికోసం రూ. 600 కోట్లు పెట్టుబడి పెడతామని, రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమి కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. మూడురోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశం సందర్భంగా మంగళవారం ఆయన ప్రసంగించారు. తన పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ అని, తానూ సగం ఆంధ్రానే అని చమత్కరించారు.
విజయవాడలోని కేంద్ర ప్లాస్టిక్ ఇన్‌స్టిట్యూట్ (సిపెట్)లో ప్రస్తుతం ఉన్న డిప్లొమా కోర్సులకు అదనంగా బీటెక్, ఎంటెక్ ప్రవే శపెడుతున్నట్లు వెల్లడించారు. సీట్ల సంఖ్యను 200 నుంచి 5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దేశంలో మెడికల్ డివైజ్ తయారీ పార్కుల్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని, తొలి పార్క్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించామని తెలిపారు.
మరో పార్క్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తామన్నారు. పెట్రో కెమికల్, పెట్రోలియం ఇన్వెస్ట్‌మెంట్ కారిడార్‌ను ప్రస్తావించిన మంత్రి... గుజరాత్, తమిళనాడు, ఒడిశాల్లో పెట్రోలియం కాంప్లెక్స్‌లు రాబోతున్నట్లు చెప్పారు. మరో కాంప్లెక్స్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామన్నారు. ‘‘పెట్రోలియం రిఫైనరీ విస్తరణకు కనీసం రూ. 20 వేల కోట్లు కావాలి. అలాగే పెట్రో కాంప్లెక్స్‌కు రూ. 25వేల కోట్లు కావాలి. ఈ రెండూ ఆంధ్రప్రదేశ్‌లో జరగబోతున్నాయి. పెట్రో కాంప్లెక్స్‌ను హెచ్‌పీసీఎల్, గెయిల్ కలిసి ఏర్పాటు చేస్తాయి. కాకపోతే దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. త్వరలో స్పష్టత రావచ్చు’’ అని చెప్పారు. ఇవన్నీ వచ్చే బడ్జెట్లో పెట్టే అవకాశం ఉందన్నారు.
పారిశ్రామిక కారిడార్లో ఇంధన ప్రాజెక్టులు
సోలార్ రంగంలో 5వేల మెగావాట్లు, పవన విద్యుత్ రంగంలో 4వేల మెగావాట్లు సాధించాలని ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనంతకుమార్ చెప్పారు. చెన్నై-విశాఖ పారిశ్రామిక కారిడార్‌లోను, బెంగళూరు-చెన్నై కారిడార్‌లోను ఈ ప్రాజెక్టులు వచ్చే అవకాశముందన్నారు.
ప్రజల సంతోషమే ప్రగతి సూచిక: గవర్నర్
గజిబిజి గణాంకాల ప్రాతిపదికన కాకుండా ప్రజల సుఖసంతోషాల స్థాయిని కొలమానంగా తీసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆహార, ఆరోగ్య, పర్యావరణ సాధించినప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించినట్లు అవుతుందన్నారు. సీఐఐ 22వ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ సామాన్యుడికి అంతిమంగా ప్రయోజనం కలిగించగలిగితేనే ఈ సదస్సులో కుదుర్చుకున్న ఎంవోయూలు ఫలవంతమైనట్టని వ్యాఖ్యానించారు.
స్విస్ చాలెంజ్ విధానంలో
పర్యాటక ప్రాజెక్టులు: స్విస్ చాలెంజ్ విధానం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘టూరిజం ఇన్ ఏపీ - యాన్ ఎకనామిక్ ఏజెంట్’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సీఐఐ సదస్సులో కుదుర్చుకున్న 27 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూల ద్వారా 17,840 మందికి ఉపాధి కల్పించనున్నామన్నారు.