నరసింహన్ దంపతులకు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి
‘‘మీరు (ముఖ్యమంత్రి జగన్) అభివృద్ధి కోసం, అవినీతి రహిత పాలన కోసం తపన పడుతున్నారు. అలాంటి మీ ప్రభుత్వం కలకాలం వర్థిల్లాలి. మీ ప్రభుత్వం చరిత్ర సృష్టించాలి అని మనసారా ప్రార్థిస్తున్నా. ఈ రాష్ట్రం విజయాన్ని, అభివృద్ధిని నేను కోరుకుంటా. ఈ రాష్ట్రం విజయవంతం అయితే అది నా విజయంగా భావిస్తా, గర్విస్తా. నేను తెలిసో... తెలియకో కొన్ని తప్పులు చేశా. కొన్ని సమయాల్లో తెలిసి చేశా, కొన్నిసార్లు తెలియక చేశా. వాటన్నింటికీ నన్ను క్షమించండి’’
‘‘నరసింహావతారం స్తంభంలో నుంచి బయటకు వచ్చి పని పూర్తి చేసి వెళ్లి పోతుంది. రామావతారంలా సుదీర్ఘకాలం పాటు ఉండి తన భార్యను అడవులకు పంపేది కాదు. కానీ ఈ నరసింహావతారం మాత్రం ఇక్కడ చాలా కాలం పాటు ఉండిపోయింది’’
– వీడ్కోలు కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన ప్రారంభించిన ఈ 54 రోజుల్లోనే అద్భుతాలు చేశారని గవర్నర్ నరసింహన్ అభినందించారు. జగన్ తన పరిపాలనతో ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్ రాష్ట్ర బాధ్యతల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ వైఎస్ జగన్ అసెంబ్లీలో చక్కటి సభా సంప్రదాయాలను పాటిస్తున్నారని కితాబిచ్చారు. పాలన ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఆయన టీ 20 క్రికెట్ తరహాలో ప్రతి బాల్‌ను బౌండరీని దాటించడమే కాకుండా సిక్సర్‌లు కొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ విజయవాడలోనే తన అక్షరాభ్యాసం,ప్రా«థమిక విద్య జరిగిందని నరసింహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఇంకా ఏమన్నారో వివరాలు ఆయన మాటల్లోనే..
‘ఇవి నాకు, నా శ్రీమతి విమలకు ఉద్వేగపూరిత క్షణాలు. మిమ్మల్ని వీడి వెళుతున్నా. మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌తో నాకు విడదీయరాని సంబంధం ఉంది. విజయవాడలోని అట్కిన్సన్ స్కూల్‌లో నా అక్షరాభ్యాసం 1951లో జరిగింది. అప్పట్లో మేం గవర్నర్‌పేటలో నివాసం ఉన్నాం. ఐపీఎస్‌కు ఎంపికయ్యాక ట్రెయినింగ్ అనంతపురంలో కాగా నాకు పునర్జన్మ ఇచ్చింది నంద్యాల. ప్రమోషన్ మీద నియామకం జరిగింది ప్రకాశం జిల్లాలో. నా తల్లిదండ్రులు నాకు అహోబిలం నరసింహుడి పేరు పెట్టారు. అయితే నేను నరసింహుడి పాత్ర వహించానా లేదా? అనేది నాకు అర్థం కాని విషయం.
త్యాగయ్య కీర్తన గుర్తుకొచ్చింది...
ఇక జగన్‌మోహన్‌రెడ్డి విషయానికి వస్తే... ‘జే’ అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల ఏ వ్యక్తి అయినా అందరిలో అత్యంత ప్రియమైనవారుగా, ముచ్చటైన వారుగా ఉంటారు. జగన్‌మోహన్ అంటే జగత్తులో మోహనుడు, విశ్వంలో అందరూ ప్రేమించే వ్యక్తి. జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేటపుడు నాకు త్యాగరాజస్వామి కీర్తన ‘‘నను పాలించగ నడిచీ వచ్చితివా... ఓ రామా...’’ గుర్తుకొచ్చింది. రాష్ట్ర ప్రజలంతా ‘మము పాలించగ నడిచీ వచ్చితివా... ఓ జగన్’ అని భావించారని నాకు అనిపించింది.
కొద్ది రోజుల్లోనే అద్భుతాలు చూశా..
ఒక టీం కెప్టెన్‌గా, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే నేను అద్భుతాలను చూశా. టీ 20 మ్యాచ్‌లో తొలి పది ఓవర్లు బాగా ఆడిన తరువాత మధ్య ఓవర్లకు వచ్చేటప్పటికి పరిస్థితి స్థిమితంగా ఉంటుంది. చివరి ఓవర్లలో వేగంగా ఎక్కువ పరుగులు తీస్తారు. బహుశా మీరు కూడా దీన్నే పాటిస్తున్నారని భావిస్తున్నా. ఇపుడు మీరు పరుగులు హిట్ చేస్తున్నారు. ఆ తరువాత పరిస్థితిని సుస్థిరం చేసుకుంటారు. మీరు సెంచరీ చేస్తూ నాటౌట్‌గా ఉండాలని, మరిన్ని ఎక్కువ సెంచరీలు చేయాలని కోరుకుంటున్నా. ‘భారతి అమ్మ’ అంటే అందరికీ ఓ రకమైన శక్తిని ఇస్తుంది. బహుశా జగన్ తన భార్య భారతి నుంచి అదే శక్తిని పొందుతున్నారని భావిస్తున్నా. ఏమైనా వారిద్దరూ ప్రత్యేక దంపతులు అని చెబుతున్నా.
చర్చలు.. సంప్రదింపులు.. భిన్నాభిప్రాయాలు.. తుది నిర్ణయం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీ చెప్పినట్లుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపులు, భిన్నాభిప్రాయాలు ఆ తరువాత తుది నిర్ణయం ముఖ్యమైన అంశాలు. కొద్ది రోజులుగా ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న కార్యక్రమాల తీరును నేను గమనిస్తున్నా. మీరు (వైఎస్ జగన్) చక్కటి పార్లమెంటరీ సంప్రదాయాలను పాటిస్తున్నట్లు నాకు అర్థం అవుతోంది. చర్చ, సంప్రదింపులు, భిన్నాభిప్రాయాలు, ఆ తరువాత నిర్ణయం అనే విధానాన్ని మీరు అనుసరిస్తున్నారు. మీరు ఇదే తీరును కొనసాగించాలని కోరుకుంటున్నా. మీరు చాలా దూరం రాజకీయ ప్రయాణం చేయాలి. కొత్తగా పరిపాలనలోకి వచ్చారు. పునాదులు బాగా వేస్తే భవిష్యత్తులో అభివృద్ధి గట్టిగా ఉంటుంది. మీకు అద్భుతమైన జట్టు ఉంది. ఈ జట్టుతో ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర సృష్టిస్తారని గట్టిగా విశ్వసిస్తున్నా. ఇక్కడున్న మంత్రులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ఇన్నేళ్లుగా సహకరించిన కేంద్ర, రాష్ట్ర సర్వీసు అధికారులకు ధన్యవాదాలు.
ఈ రాష్ట్రం మంచి కోసమే...
మీకు రాయలసీమను జాగ్రత్తగా చూసుకునేందుకు అహోబిలంలో ఒక నరసింహుడున్నాడు. ఉత్తరాంధ్రను జాగ్రత్తగా చూసుకునేందుకు సింహాచలం నరసింహస్వామి ఉన్నాడు. ఇక్కడ పానకాల నరసింహస్వామి ఉంటాడు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు పుణ్యక్షేత్రాలైన తిరుపతి, కడప దర్గా, ఆ తరువాత చర్చికి వెళ్లారు. ఆ తరువాత తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్దకు వెళ్లారు. ఆ తరువాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వద్దకు వచ్చారు. అయితే మీరు అతి ముఖ్యమైన నరసింహస్వామిని దర్శించుకోలేదని, మీ తీర్థయాత్ర పూర్తి కాలేదని ఆరోజు ఆయనకు చెప్పా. జగన్.. నన్ను మీరు క్షమించాలి. గత 54 రోజుల్లో నేను నా పరిధులు అతిక్రమించి ఏదైనా చెప్పే చనువు తీసుకుని ఉండొచ్చు. మిమ్మల్ని నా కుమారుడిలా భావించి చెప్పా తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఏం చెప్పినా అది ఈ రాష్ట్రం మంచి కోసం మాత్రమే’’
గవర్నర్‌కు ఘన సన్మానం
గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. జగన్ సతీమణి వైఎస్ భారతి గవర్నర్ సతీమణి విమలా నరసింహన్‌కు పుష్పగుచ్ఛం, జ్ఞాపికను బహూకరించి గౌరవించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
దుర్గమ్మ సేవలో నరసింహన్ దంపతులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ), గన్నవరం: అంతకుముందు గవర్నర్ నరసింహన్ దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి గవర్నర్ హోదాలో చివరిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, విజయవాడ సీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
ఎయిర్‌పోర్టులోని అంతర్జాతీయ టెర్మినల్ ఆవరణలో గవర్నర్‌కు ఏపీ పోలీస్ ప్రత్యేక దళాల నేతృత్వంలో గౌరవ వందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయవాడలో పర్యటన ముగిసిన అనంతరం సోమవారం రాత్రి గవర్నర్ నరసింహన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
నాన్న పాత్ర పోషించారు: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
‘నాకు ఓవైపు మనసులో బాధగా ఉంది.. మరోవైపు ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదు, పక్కనే ఉన్నారన్న ఆనందమూ ఉంది. గవర్నర్‌తో నాకు చాలా అనుబంధం, అనుభూతి ఉంది. గత పదేళ్లుగా బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఆయన. ఒక పెద్ద మనిషిగా ఇంచుమించుగా నాన్న పాత్రనే పోషిస్తూ నాకు సలహాలు ఇచ్చేవారు. నేను ముఖ్యమంత్రి అయిన తరువాత నా చేయి పట్టుకుని దగ్గరుండి నడిపించారు. అలాంటి వ్యక్తి దూరమవుతున్నారని మనసులో బాధగా అనిపించినా ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నా. ఆయన ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, మా అందరి తరఫున ఎప్పుడూ గుర్తుంచుకుంటాం. ఆయనతో గడిపే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా’
Comments
Please login to add a commentAdd a comment