సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...తనకు ఆకాశమంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు నేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఇతర పెద్దలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి అందేలా చూస్తామని పేర్కొన్నారు. అవ్వా, తాత, అక్కాచెల్లెళ్ల ఆశీస్సులు కోరుతూ ముఖ్యమంత్రిగా తన తొలి సంతకాన్ని వైఎస్సార్ పెన్షన్ ఫైల్‌పై చేశారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తన ప్రసంగంలో భాగంగా..‘వైఎస్ జగన్ అనే నేను ప్రజల ఇచ్చిన ఈ తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తున్నా. 3648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు, తొమ్మిదేళ్ల కష్టానికి ప్రతిగా ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతీ అక్కా, చెల్లె, అవ్వా తాత, సోదరుడు, స్నేహితుడు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పదేళ్ల నా రాజకీయ జీవితంలో.. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశాను. బాధలు విన్నాను. మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నాను. మీ అందరికీ నేను ఉన్నాను. అందరి ఆశలు, ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తిగా అమలు చేస్తాం. గత ప్రభుత్వం మాదిరి ప్రతీ కులానికి ఓ పేజీ పెట్టి మోసం చేసేందుకు ప్రయత్నించలేదు. అటువంటి మోసాలకు తావు లేకుండా రెండే రెండు పేజీల మేనిఫెస్టో తెచ్చాను. మన సీఎం మన కోసం ఏం చేస్తాడన్న సంగతి ప్రలజందరికి తెలిసి ఉండాలి. దానికి అనుగుణంగా మేనిఫెస్టో తెచ్చి మీ కళ్ల ముందు పెట్టాను. మీ ఆకాంక్షల మేనిఫెస్టోను ఒక ఖురాన్, బైబిల్, భవద్గీతగా.. నా ఊపిరిగా భావిస్తానని సీఎం హోదాలో మాటా ఇస్తున్నాను. నవరత్నాలను అమలు చేస్తాను. అవ్వాతాతల ఆశీస్సుల కోసం ముఖ్యమంత్రిగా మొదటి సంతకం వైఎస్సార్ పెన్షన్ ఫైల్‌పై చేస్తున్నాను. జూన్ నెల నుంచి రూ. 2250 అందిస్తాం. తర్వాత ఏడాది రూ. 2500, మరుసటి ఏడాది రూ. 2750..అనంతరం రూ. 3000 వేలు అందిస్తాం’ అని పేర్కొన్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రెండున్నర నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు..
‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా మన గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతంతో గ్రామ వాలంటీర్లను నియమిస్తాం. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్లుగా పని చేయవచ్చు. ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందకపోయినా.. పొరపాటునైనా లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా, వివక్ష కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. విప్లవాత్మక, పారదర్శక పాలనకు నాంది పలుకుతాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అవినీతికి చోటుండదు
- పెంచిన పెన్షన్లు జూన్ నుంచే అమల్లోకి
- ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు
- గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే
- గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు
- దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అర్హులకు పథకాల వర్తింపు
- సమస్యలు చెప్పుకునేందుకు ఆగస్టు 15 నుంచి కాల్ సెంటర్ సీఎం కార్యాలయంతో అనుసంధానం
- అక్టోబరు 2 కల్లా మరో లక్షా అరవై వేల ఉద్యోగాలు
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- అవినీతికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తాం
- కాంట్రాక్టుల్లో ఎక్కువ మంది టెండర్లలో పాలు పంచుకునేట్లుగా రివర్స్ టెండరింగ్ తెస్తాం
- రివర్స్ టెండరింగ్ ద్వారా చేకూరిన లబ్దిని ప్రజలకు చూపిస్తాం
- సోలార్ పవర్, విండ్ పవర్‌ను గత ప్రభుత్వం అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసింది. వాటన్నింటినీ తగ్గిస్తాం.
- పారదర్శకతకై హైకోర్టు జడ్జి చేత జ్యుడిషియల్ కమిషన్ వేయమని అడుగుతాం
- హైకోర్టు జడ్జి సూచనల మేరకు టెండర్లలో మార్పులు చేసి కాంట్రాక్టర్లను పిలుస్తాం
- 3 దశల్లో మద్య నిషేధం అమలు చేస్తాం
- తప్పుడు కథనాలు రాసినా, ప్రసారం చేసినా ఎల్లోమీడియాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
- పరువు నష్టం దావా వేసి కోర్టును ఆశ్రయిస్తాం
- అవినీతి రహిత పాలన అందించేందుకు ఆర్నెళ్ల నుంచి ఏడాది పాటు మాకు సమయం ఇవ్వండి
Comments
Please login to add a commentAdd a comment