అప్పుల ఊబి నుంచి రైతుల్ని బయటపడేశాం  | ESL Narasimhan Started Budget session with his speech | Sakshi
Sakshi News home page

అప్పుల ఊబి నుంచి రైతుల్ని బయటపడేశాం 

Published Thu, Jan 31 2019 3:50 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

ESL Narasimhan Started Budget session with his speech - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.24 వేల కోట్ల విలువగల రైతుల రుణాల్ని మాఫీ చేస్తూ తీసుకున్న చరిత్రాత్మక చర్య ద్వారా రైతులను విజయవంతంగా అప్పుల ఊబి నుంచి బయటపడేసినట్లు గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ చెప్పారు. బుధవారం అసెంబ్లీ హాల్లో బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించిన గవర్నర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. గత నాలుగున్నరేళ్లలోరుతుపవనాలు అనుకూలంగా లేనప్పటికీ రాష్ట్రంలో ఒక్క రైతూ ఆత్మహత్యకు పాల్పడలేదని తెలిపారు. రుణమాఫీ తుది వాయిదాను రెండు వారాల్లోగా పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయంలోని కీలకాంశాలపై నిరంతరాయంగా దృష్టి పెట్టడంవల్ల గడచిన నాలుగున్నరేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో స్థూల విలువ జోడింపు దాదాపు(97 శాతం మేరకు జీవీఏ) రెట్టింపు అయ్యిందన్నారు.

రాష్ట్రంలోని 62 శాతం జనాభా ఇంకా ప్రాథమిక రంగంపై ఆధారపడుతున్నారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, అనుబంధ రంగాలకోసం నాలుగేళ్ల బడ్జెట్‌లో రూ.81,554 కోట్లను కేటాయించడమేగాక ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం పెట్టుబడి లేని ప్రకృతిసేద్యాన్ని భారీఎత్తున చేపట్టిందన్నారు. 2016–17లో పెట్టుబడి లేని ప్రకృతి సాగు(జీరో బేస్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌–జెడ్‌బీఎన్‌ఎఫ్‌)ను 40,656 మంది రైతులకు వర్తింపచేసినట్లు తెలిపారు. 2018–19లో ఇది 5.23 లక్షలుగా ఉందన్నారు. ప్రతి కుటుంబం నెల ఒక్కింటికి రూ.పదివేల ఆదాయాన్ని ఆర్జించేలా చేయడానికి పశుగణ రంగం కింద పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో వృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.

కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు...
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న వాగ్దానాలు, కేంద్రం ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్లలో నెరవేర్చలేదని గవర్నర్‌ చెప్పారు. నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ తక్కువ తలసరి ఆదాయంతో ఇబ్బంది పడుతోందన్నారు. భారీ రెవెన్యూలోటును భర్తీ చేయకపోవడం, విభజన అనంతరం రాష్ట్రానికి రావాల్సిన ఆస్తుల్ని సక్రమంగా పంచకపోవడం, జనాభా ప్రాతిపదికన రుణ బాధ్యతలను పంచడం, 58.32 శాతం జనాభా ఉన్న నూతన రాష్ట్రానికి.. అంచనా వేసిన ఉమ్మడి రాష్ట్ర రాబడుల్లో 46 శాతాన్ని మాత్రమే పంచడం వంటివి ఈ కష్టాలను తీవ్రతరం చేశాయని పేర్కొన్నారు. వినియోగ ధ్రువపత్రాల(యూసీలు) సమర్పణను నీతిఆయోగ్‌ ధ్రువీకరించినప్పటికీ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల్లో 2017–18 సంవత్సరానికి అభివృద్ధి పనులకోసం రాష్ట్ర ఖజానాకు జమ చేసిన రూ.350 కోట్ల నిధులను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడం రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియకు ప్రధాన అవరోధంగా నిలిచిందని చెప్పారు. కేంద్రం నుంచి మద్దతు లేనప్పటికీ గత నాలుగున్నరేళ్లల్లో అన్ని రంగాల్లో సాధించిన సాఫల్యతలు, అన్ని ప్రతికూలతలను రాష్ట్రం అధిగమించి మార్గదర్శిగా నిలిచిన తీరు కొనియాడదగినదేగాక.. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం తోడ్పాటు అందించకపోయినప్పటికీ రాష్ట్ర వృద్ధి తీరు సగటున 10.66 శాతంగా ఉందని చెప్పారు.

పరిపాలనలో పారదర్శకత...
అవినీతి రహిత పరిపాలన అందించడానికి, జవాబుదారీతనం, పారదర్శకతగల వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ చెప్పారు. నూతన ప్రభుత్వ ఆకాంక్షల్ని పేర్కొంటూ గుర్తించిన అంశాలపై శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. నానాటికీ ప్రజల్లో పెరుగుతున్న సంతృప్తే పనితీరుకు నిదర్శనమని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం జనవరి నుంచి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ను నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచిందని తెలిపారు. ప్రస్తుతమున్న రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా ఈబీసీ కోటా కింద కాపులకు 5 శాతం రిజర్వేషన్, ఇతరులకు 5 శాతం కేటాయించినట్లు చెప్పారు. వెనుకబడిన వర్గాల సంక్షేమంకోసం సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చేనేతకారుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం రూ.1,004 కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించిందన్నారు.

ప్రతి డ్వాక్రా సభ్యురాలికి రూ.పదివేలు సాయం..
మహిళా సాధికారత విషయంలో అధిక ఆర్జన జీవనోపాధి కార్యక్రమాలను చేపట్టేందుకు స్వయం సహాయకబృంద (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు వీలు కల్పిస్తూ, ప్రతి ఎస్‌హెచ్‌జీ సభ్యురాలికి రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి పసుపు–కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రూ.8,604 కోట్ల వ్యయంతో ఈ పథకం కింద 86,04,304 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. 

గవర్నర్‌ ప్రసంగంలో ఇతర అంశాలివీ..
- ఆంధ్రప్రదేశ్‌ ర్యాంక్, ప్రదర్శనలో గణనీయమైన మెరుగుదలను జాతీయ సాధన సర్వే నమోదు చేసింది. 10వ తరగతి మేథమేటిక్స్‌లో రాష్ట్రం ప్రదర్శన ప్రథమ స్థానంలోనూ, అన్ని సబ్జెక్టులలో మొత్తంగా ప్రదర్శన తీరు ద్వితీయస్థానంలో ఉంది. మనబడి, బడి పిలుస్తోంది వంటి కార్యక్రమాల ద్వారా డ్రాపవుట్‌ రేట్లను తగ్గించాం. 
జలవనరుల రంగంలో ఐదేళ్లలో రూ.64,333.62 కోట్లు ఖర్చు చేశాం. స్థిరీకరణతో కలుపుకుని 32.02 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సాగునీటి సదుపాయాలను కల్పించాం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యమిచ్చి రూ.15,585.17 కోట్లు ఖర్చు చేశాం. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో గ్రావిటీద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించాం. 2019 చివరికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కార్యక్రమాన్ని రూపొందించాం. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి గడిచిన 4 పంట కాలాల్లో 263 టీఎంసీల గోదావరి జలాల్ని మళ్లించి కృష్ణా డెల్టాలోని పంటను రక్షించాం.
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం కేంద్రప్రభుత్వం వాగ్దానాన్ని నెరవేర్చనందువల్ల బాధపడి ప్రభుత్వం సొంతంగా కడపలో ఏకీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని నిర్ణయించి భూమిపూజ పూర్తి చేశాం. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్రోకెమికల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంద్వారా ఐదు లక్షలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం శ్రద్ధతో ఉంది. 
అమరావతిలో మౌలిక సౌకర్యాల నిర్మాణం కోసం మొత్తం రూ.1.09 లక్షల కోట్లు అవసరం. ఇందులో మొదటి దశలో వ్యయం రూ.51,687 కోట్లుగా ఉంటుందని అంచనా వేశాం. రూ.39,875 కోట్ల విలువ చేసే వివిధ పనులు జరుగుతున్నాయి. 

జాతిపితకు నివాళి
గవర్నర్‌ ప్రసంగం అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని ఉభయ సభల సభ్యులంతా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement