
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరికొంత కాలం గవర్నర్‌గా నరసింహన్ కొనసాగిఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ గవర్నర్‌కు వీడ్కోలు పలకడం ఓవైపు బాధగా ఉన్నా, మరోవైపు ఆయన మనతోనే ఉంటారన్న నమ్మకం ఉంది. నాన్నగారిలా నాకు అనేక సలహాలు ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక కూడా నన్ను ముందుండి నడిపించారు. మరికొంతకాలం ఆయన కొనసాగితే బాగుండేది. పెద్దాయన స్థానంలో ఆయన్ని ఎప్పుడూ మా మనసులోనే ఉంచుకుంటాం.’ అని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులు కావడంతో నరసింహన్ ఇక మీదట తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగనున్నారు.
చదవండి: వైఎస్ జగన్ పాలనలో మరిన్ని సెంచరీలు చేయాలి: నరసింహన్
అంతకు ముందు గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ... తొమ్మిదిన్నరేళ్లపాటు రాష్ట్ర ప్రజలు తన మీద, తన భార్య విమల మీద చూపిన ప్రేమను మర్చిపోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పాలనాపరంగా కొన్నిసార్లు తెలిసి తప్పులు చేశానని, కొన్నిసార్లు తెలియక తప్పులు చేశానని.... తన కారణంగా నొచ్చుకుంటే వారందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధిపథంలోకి దూసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి, సీఎస్, డీజీపీ, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)