సాక్షి, విజయవాడ: గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. మూడు సంవత్సర కాలంలో రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆత్మీయుడైన పెద్దమనిషిగా గవర్నర్ వ్యహరించారని అన్నారు. గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని సీఎం పేర్కొన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది.
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాల మీద ఈ మధ్య కాలంలోనే చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నాం. కానీ మన రాష్ట్రం మాత్రం అందుకు భిన్నంగా గవర్నర్ ఒక తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని ప్రశంసించారు.
‘గవర్నర్ విద్యావేత్త, న్యాయ నిపుణులు, వీటన్నింటిని మించి ఆయన స్వాతంత్ర్య సమరయోధులు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధిపై 95 వేల మెజార్టీ సాధించి అప్పట్లో ఒక రికార్డు సృష్టించారు ఒడిశా ప్రభుత్వంలో నాలుగుసార్లు మంత్రిగా పనిచేశారు. న్యాయవాదిగా కూడా పనిచేసిన బిశ్వభూషణ్ ఒడిశా హైకోర్టులో బార్ అసోసియేషన్ యాక్షన్ కమిటీ ఛైర్మన్‌గా న్యాయవాదుల సంక్షేమం కోసం, హక్కుల కోసం నిరంతరం పాటుపడ్డారు.
గవర్నర్ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. ప్రజలకు మరింత సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రజలు, ప్రభుత్వం, నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా వెళ్తున్నందుకు అభినందనలు తెలుపుతున్నాను’ అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అనంతరం బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఆత్మీయంగా సత్కరించారు.
చదవండి: నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఏపీ ప్రజలను మరవను: బిశ్వభూషణ్ హరిచందన్
Comments
Please login to add a commentAdd a comment