
వందేళ్లలో ఇలాంటి నీటి కరువు రాలేదు
గడిచిన వందేళ్లలో ఇలాంటి నీటి కరువు రాలేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి అన్నారు.
విజయవాడ సెంట్రల్ : గడిచిన వందేళ్లలో ఇలాంటి నీటి కరువు రాలేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ప్రకాశం బ్యారేజ్, దుర్గాఘాట్, భవానీద్వీపం ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ గతేడాది ఇదే రోజున బ్యారేజ్‌లో 10.7 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. నీటి నిర్వహణపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేకపోవడం వల్లే దుర్భర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు.
సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ తెలంగాణలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల్ని అడ్డుకోవడంలో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సమస్యను ఎపెక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఓటుకు -నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్నారు. ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, పార్టీ నాయకులు ఎల్.ఈశ్వరరావు, ఎం.కోటేశ్వరరావు పాల్గొన్నారు.