జిల్లాలో కరువు కన్పించలేదా.. బాబూ!
►నేడు మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రంలలో ధర్నాలు
► ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి
మదనపల్లె సిటీ: జిల్లాలో కరువుతో రైతులు అల్లాడిపోతుంటే వారి కష్టాలు కన్పించడం లేదని, ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నావని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మదనపల్లెలో ఆదివారం వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. రుణమాఫీని పక్కనపెట్టి ప్రజాధనం తో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గులేదా అని తెలిపారు. కరువుతో రైతులు అల్లాడిపోతున్నారని కనీసం పశువుల కోసం గడ్డికేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు.
రాయలసీమ ప్రాజెక్టులనీళ్లు తెలంగాణ దోచుకుంటే చంద్రబాబు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటలకు ధర్నా చేస్తామన్నారు. నిమ్మనపల్లె, రామసముద్రంలలో కూడా ఆందోళన చేస్తామన్నారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు జన్నే రాజేంద్రనాయుడు, మల్లికార్జుననాయుడు, వెంకటరమణ పాల్గొన్నారు.