హోదా తేకుంటే బాబుకు గుండు కొట్టిస్తారు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య
సాక్షి, అమరావతి: ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో తిరిగి వస్తే సన్మానం చేస్తామని, ఖాళీ చేతులతో వస్తే గుండు కొట్టించి ఊరేగించడానికి కూడా జనం వెనుకాడరని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలసి విజయవాడలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
రెండేళ్లు గడిచినా విభజన హామీల్లో ఒక్కటీ అమలు చేయని బీజేపీ, హోదా సాధించలేని టీడీపీ ప్రస్తుతం ప్యాకేజీ అంటూ నాటకాలు ఆడుతున్నాయన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు బాబు, కేసీఆర్ తరచూ ఢిల్లీ వెళ్లి మోదీ చెవుల్లో గుసగుసలు చెప్పివస్తున్నారని, వీళ్లు వెళ్లినప్పుడు ప్రధాని చెవుల్లో దూది పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.