ప్రాజెక్టులను అడ్డుకుంటే ఊర్కోం
► భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
► తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అవుతోంది
► తెలంగాణను సస్యశ్యామలం చేసి చూపిస్తాం
► చర్చలంటే ఆంధ్రా మంత్రి ముఖం చాటేస్తున్నారు
► తెలంగాణ టీడీపీ నేతలారా.. ఇప్పటికైనా తేల్చుకోండి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘ఎవరెన్ని అడ్డంకులు కల్పించాలని చూసినా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం ఆగదు.. మన తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అవుతుంది.. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. జగన్, బాబు ఎన్ని దీక్షలు చేసినా ఆపలేరు..’’ అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ‘‘మన సీఎం కేసీఆర్ మాత్రం మహా మొండిఘటం. తెలంగాణ తెస్తానన్నాడు.. తెచ్చిండు. కచ్చితంగా కాళేశ్వరం పూర్తి చేస్తాం... నిజాంసాగర్‌కు నీళ్లు తెచ్చి తీరుతాం.. ప్రాజెక్టులతో తెలంగాణను సస్యశ్యామలం చేసి తీరుతాం.. ఇందులో ఎవరికీ అనుమానాలు అవసరం లేదని’’ మంత్రి పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీర్కూరు, బాన్సువాడలలో హరీశ్ మాట్లాడారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం గోదావరిలో మన నీటి వాటా 954 టీఎంసీలనీ, అయితే మనం 200 టీఎంసీలు కూడా వాడుకుంటలేమన్నారు. హక్కు ప్రకా రం సముద్రంలో కలసిపోతున్న 700 టీఎం సీల నీళ్లను ప్రాజెక్టులు కట్టుకుని రైతులను బతికించు కుంటామంటే ఆంధ్రబాబు ఓరుస్తలేడన్నారు. తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులకు అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమకు పలుమార్లు ఫోన్‌చేసి మాట్లాడు కుందామంటే రానేరావడం లేదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత చేవెళ్ల, దిండి ప్రాజెక్టులకోసం జీవోలు విడుదలయ్యాయని, ఎవరెన్ని అడ్డంకులు కల్పించాలని చూసినా.. ప్రాజెక్టులు కట్టితీరుతామని హరీశ్‌రావు స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఉన్న పైప్ ఇరిగేషన్ పద్ధతి మనరాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు.
జగన్ దీక్ష నుంచి దృష్టి మరల్చేందుకే బాబు నాటకం
ఆంధ్రప్రదేశ్‌లో దినదినానికి దిగజారి పోతున్న టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టను కాపాడుకోవడానికి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపడుతున్న దీక్ష నుంచి ఆ ప్రాంత ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశాడని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘ఏపీ క్యాబినెట్‌లో తీర్మానం చేసి.. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని ఢిల్లీకి ఉత్తరం రాసిండు, రేపు సుప్రీంకోర్టుకు పోతడంటా.. మా బతుకును మేం బతకనీయకుండా నోటికాడి బువ్వను లాగేయాలని చూస్తున్న చంద్రబాబును ఇంకా ఈప్రాంత టీడీపీ నాయకులు అనుసరిస్తుండటం బాధాకరం.
తెలంగాణ తెలుగుదేశం నాయకులారా... మీరు తెలంగాణ ద్రోహి చంద్రబాబు పక్షమా..? తెలంగాణ ప్రజల పక్షమా.. నిండిన కడు పులున్న ఆంధ్రా పక్షమా...? కాలిన కడుపులతో నీళ్లకోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల పక్షం ఉంటారో తేల్చుకోండి’’ అని టీడీపీ నేతలనుద్దేశించి అన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు చంద్రబాబు పక్షమే ఉంటామంటే.. ఈప్రాంత ప్రజలు మిమ్మల్ని అదే చంద్రబాబు ఉండే విజయవాడ వరకు తరిమి కొడతారని హరీశ్ హెచ్చరించారు.