ఇక కర్నూలుకు కన్నీళ్లే!
► తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం తెరపైకి
► 3 నెలల్లో సర్వేకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
► గుండ్రేవుల ప్రతిపాదనలు పంపితే... కలిసి ముందుకు వెళ్దామని సూచన
► ఏడాది కాలంగా కనీసం పట్టించుకోని ఏపీ ప్రభుత్వం
► తుమ్మిళ్ల వస్తే... సుంకేసులకు నీరు డౌటే !
► కేసీ ఆయకట్టుకూ తిప్పలే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగరం ఇక నుంచి దాహంతో అలమటించాల్సిందేనా? వర్షాకాలంలో మినహా మిగిలిన సమయంలో కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు చుక్కనీరు లభించే పరిస్థితి లేకుండా పోనుందా? సుంకేసుల ప్రాజెక్టు నీళ్లు లేకుండా నోరెళ్లబెట్టనుందా? గుండ్రేవుల ప్రాజెక్టు కూడా మూలకు పడనుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే సుంకేసులకు ఎగువన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఆదేశాలతో జిల్లాకు కన్నీళ్లే తప్పవనే అభిప్రాయం సాగునీటి నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికైనా గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించేందుకు కలిసి వస్తే ముందుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉంచిన గుండ్రేవుల వెంటనే అనుమతి ఇవ్వాలని కర్నూలుకు సీఎం వస్తున్న సందర్భంగా సాగునీటిరంగ నిపుణులు కోరుతున్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా సీఎంను ఒప్పించాలని వీరు విన్నవిస్తున్నారు.
తుమ్మిళ్ల వస్తే తిప్పలే...!
సుంకేసుల పైభాగం నుంచి 8 నుంచి 10 టీఎంసీల నీటిని లిఫ్టు ఇరిగేషన్ (ఎత్తిపోతల) ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం తుమ్మిల్ల ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏడాది మొత్తం తాగునీటి అవసరాల పేరుతో నీటిని తీసుకెళ్లేందుకు ఈ పథకాన్ని అక్కడి ప్రభుత్వం చేపట్టింది. కేవలం మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని... ఇందుకోసం రూ.29.50 లక్షలను కూడా విడుదల చేసింది. ఎత్తిపోతల పథకం నిర్మిస్తే సుంకేసుల నీళ్లు లేక నోరెళ్లబెట్టాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ఫలితంగా కర్నూలు నగరానికి చుక్కనీరు కూడా దక్కే అవకాశం లేదు. అంతేకాకుండా కేసీ కెనాల్‌కు కూడా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గుండ్రేవుల నిర్మాణానికి ఇప్పటికే తెలంగాణ సానుకూలంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ముందుకు రావాలని సాగునీటిరంగ నిపుణులు కోరుతున్నారు.