Tummilla lift irrigation scheme
-
యుద్ధప్రాతిపదికన ‘గట్టు’ ఎత్తిపోతలు
సాక్షి, గద్వాల: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి తుమ్మిళ్ల ప్రాజెక్టులు పనులు పూర్తి చేసినట్లు యుద్ధప్రాతిపదికన నాలుగు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించి 38వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాలలో మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. మళ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఈసారి గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, ఒకే వేళ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగనని అన్నారు. ఇప్పటికే నెట్టెంపాడు లిఫ్ట్ ద్వారా రెండు టీఎంసీలు ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్‌ను 4 టీఎంసీలకు పెంచుకొని నియోజకవర్గంలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు. తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాల ద్వారా నడిగడ్డ సస్యశ్యామలం అవుతుందన్నారు. కృష్ణమోహన్‌రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలి తెలంగాణ రాష్ట్రం రాకపోతే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావడం వల్లే గద్వాల జిల్లా ఏర్పడిందని కేసీఆర్ తెలిపారు. అందుకు గద్వాల నియోజకవర్గ ప్రజలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజారీటీతో గెలిపించి కృతజ్ఞత తెలపాలని పిలుపునిచ్చారు. ఓడిపోయినప్పటికి ప్రజల మద్య ఉంటూ నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తీసుకురావడానికి కృష్ణమోహన్‌రెడ్డి కృషి చేస్తున్నాడని, గట్టు ఎత్తిపోతల పథకం మంజూరు చేయించడంలో కృష్ణమోహన్‌రెడ్డి కృషి ఎంతగానో ఉం దని అన్నారు. ఇక్కడికి వచ్చే ముందు తెప్పించుకున్న సర్వేలో కృష్ణమోహన్‌రెడ్డి గెలుస్తున్నట్లు తేలిందని, ఇక్కడికి వచ్చిన ప్రజలను చూస్తే ని యోజకవర్గంలో కృష్ణమోహన్‌రెడ్డి గెలుపు ఖాయ మని తేలిపోయిందని అన్నారు. దశాబ్ధాల పాటు నియోజకవర్గాన్ని పాలిస్తున్న వారు నియోజకవర్గానికి చేసిందేమి లేదని, ఎన్ని రోజులు ఈ పాత చింతకాయపచ్చడి, కొత్త వారికి, నిత్యం ప్రజల్లో ఉన్న వారికి అవకాశం కల్పించాల్సిన అవసరమున్నందున కృష్ణమోహన్‌రెడ్డిని భారీ మెజారీటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మోదీ అబద్ధాలు... తెలంగాణలో కరెంటు సమస్య ఉందంటూ ప్రధానమంత్రి మోడీ అబద్దాలు మాట్లాడుతున్నారని, దేశ ప్రధానులే అబద్ధాలు మాట్లాడటం దురదుష్టకరమని కేసీఆర్ అన్నారు. దశాబ్ధాలుగా పాలకులుగా ఉండి తెలంగాణను అన్ని రంగాల్లో వెనక్కి నెట్టివేసిన కాంగ్రెస్, టీడీపీలకు తగిన బుద్ది చెప్పాలని కోరారు. అడుగడుగున ప్రాజెక్టులకు అడ్డం పట్ట చంద్రబాబుతో కాంగ్రెస్ జతకట్టడం సిగ్గుచేటని ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. ఇంకా ఈ సభలో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, కార్పొరేషన్ల చైర్మన్లు రాకేష్, గట్టు తిమ్మప్ప, బండ్ల జ్యోతి, బీ.ఎస్.కేశవ్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, పర్మాల నాగరాజు, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, సుభాన్ పాల్గొన్నారు. -
తుమ్మిళ్ల రిజర్వాయర్లపై అపోహలు వద్దు
రాజోళి (మహబూబ్‌నగర్): తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఆర్డీఎస్ రైతులకు వరమని, ప్రాజెక్టులో నిర్మించే రిజర్వాయర్లపై ఎలాంటి అపోహలు వద్దని అలంపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వి.ఎం.అబ్రహం అన్నారు. శుక్రవారం ఆయన తుమిళ్ల ఎత్తిపోతల పనులను ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారామి రెడ్డితో కలిసి పరిశీలించారు. ముందుగా తనగల సమీపంలోని ఆర్డీఎస్ కెనాల్ డీ.24 వద్ద పనులు పూర్తిచేసుకున్న డెలవరీ సిస్టంను పరిశీలించారు. అక్కడే కెనాల్ కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ కోసం జరుగుతన్న పనులను పరిశీలించారు. అక్కడి నుంచి ప్రెజర్మొయిన్స్ పైప్‌లైన్ మీదుగా తుమ్మిళ్లకు చేరుకున్న ఆయన పంప్‌హౌస్, ఫోర్భే, అప్రోచ్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు మొదటి విడత పూర్తికావొచ్చాయని, ఆగస్టులో తుమ్మిళ్ల ద్వారా సాగునీరు అందిస్తామని అన్నారు. ఈ పనులు పూర్తయిన నేపథ్యంలో రెండో విడత పనులు జరగవని, రిజర్వాయర్లు నిర్మాణం ఉండదని కొందరు అపోహ చెందుతున్నారని, రిజర్వాయర్లతో సహ ప్రాజెక్టుకు సంబంధించి రూ.783 కోట్లు పరిపాలన అనుమతులు లభించాయని, రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. మొదటి విడత ద్వారా సాగు నీరు అందించిన అనంతరం మల్లమ్మకుంట, జూలకల్, వల్లూర్ రిజర్వాయర్లు నిర్మించడం జరుగుతందన్నారు. సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్ రావ్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని తనకు సూచించారని, ఇకపై పనులను పర్యవేక్షిస్తుంటానని తెలిపారు. మురళీధర్ రెడ్డి, గజేంద్ర, వెంకటయ్య, కిషోర్ పాల్గొన్నారు. -
ముచ్చటగా నాలుగో సారి..
అలంపూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి ముచ్చటగా నాలుగో సారి రానున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సారధిగా మొట్టమొదటి సారి కేసీఆర్ అలంపూర్ విచ్చేశారు. 2002లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేపట్టిన పాదయాత్రను అలంపూర్ క్షేత్రం నుంచే మొదలు పెట్టారు. రెండో సారి 2014 ఏప్రిల్ 25వ తేదీన పార్టీ సారధిగా ప్రచారంలో భాగంగా అలంపూర్ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అలాగే 2016 ఆగస్టు 11వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అలంపూర్ నియోజకవర్గ కేంద్రానికి వచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ముఖ్యమంత్రి రాత్రి అలంపూర్‌లోనే బస చేసి 12వ తేదీన గుందిమల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌లో కృష్ణా పుష్కరాలను ప్రారంభించారు. ప్రస్తుతం రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద జరుగుతున్న ఎత్తిపోతల పథకం నిర్మాణం పరిశీలన నిమిత్తం ఆయన నాలుగో సారి రానున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
సందిగ్ధంలో ‘తుమ్మిళ్ల’
- రూ.493కోట్లతో ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసిన అధికారులు - రిజర్వాయర్లపై స్పష్టత లేక ముందుకు కదలని పథకం - త్వరలోనే ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగంలో ఏర్పడుతున్న లోటును పూడ్చేందుకు తలపెట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సందిగ్ధంలో పడింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రభుత్వానికి చేరి రెండు నెలలవుతున్నా పురోగతి కనిపించడంలేదు. ప్రాజెక్టుకింద ప్రతిపాదించిన రిజర్వాయర్ల విషయంలో నెలకొన్న అయోమయం ప్రాజెక్టును మూలనపడేలా చేసింది. రిజర్వాయర్ల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే దీనిపై సమీక్షించి తుది నిర్ణయం చేయనున్నారని తెలుస్తోంది. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉన్నా పైనుంచి 4 టీఎంసీలకు మించి నీరు రావడం లేదు. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నా 30 వేల ఎకరాలకు కూడా అందడం లేదు. ఈ దష్ట్యానే తుమ్మిళ్ల ఎత్తిపోతల చేపట్టాలని గత ఏడాది సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని సర్వే బాధ్యతలను వ్యాప్కోస్‌కు కట్టబెట్టారు. సర్వే చేసిన వ్యాప్కోస్, తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌ను తుమ్మిళ్ల వద్ద నిర్మించే మల్లమ్మకుంట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి మరో మూడు చిన్న పాటి రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ తుది ఆయకట్టు వరకు నీటిని తరలించేలా సర్వే నిపుణులు ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా మల్లమ్మకుంట వద్ద 0.39 టీఎంసీలు, జల్కల్ వద్ద 0.13 టీఎంసీ, వల్లూర్ వద్ద 0.46 టీఎంసీలతో బ్యారేజీలు నిర్మించి వాటిని ఆర్డీఎస్ కెనాల్‌లతో కలిపి మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలని ప్రణాళిక వేశారు. 90 రోజుల్లో 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ చేసి, ఈ పథకానికి రూ.830 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. అయితే వ్యాప్కోస్ నివేదికను పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు దాన్ని మార్చి, జల్కల్, వల్లూర్ రిజర్వాయర్లు అవసరం లేదని భావించి వాటిని తొలగించారు. కేవలం ఒక్క మల్లమ్మకుంట వద్ద రిజర్వాయర్‌ను మాత్రమే నిర్మించి నీటిని తరలిం చాలని సూచించారు. ఈ విధానం ద్వారా ఎత్తిపోతల పథకం వ్యయం రూ.493కోట్లు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పారు. రూ.493కోట్ల వ్యయానికి అనుమతులివ్వాలంటూ ముఖ్యమంత్రి అనుమతికి పంపారు. అయితే వ్యాప్కోస్ సూచించిన రిజర్వాయర్లు, నీటి పారుదల శాఖ నివేదించిన ప్రతిపాదనల్లో లేకపోవడంతో దీనిపై పూర్తి స్థాయి లో త్వరలోనే చర్చించి నిర్ణయం చేద్దామని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. -
ఈ సారైనా..!?
సీఎం పేషీలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్ రూ.493కోట్లతో మొదటి దశ అంచనా 55,600ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్ మరోసారి సీఎం పేషీకి చేరింది. గతంలో పలుమార్లు వివిధ కారణాలతో వెనక్కి వచ్చిన ఈఫైల్కు ఈసారైనా మోక్షం లభిస్తుందో లేదోనని ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతాం గం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అనుమతి లభిస్తే దశాబ్దాల కల సాకారమై తమ బతుకులు బాగుపడతాయని అభిప్రాయపడుతోంది. జూరాల : ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు శాశ్వతంగా సాగునీరందించాలనే లక్ష్యంతో నిర్మించ తలపెట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్ ఎట్టకేలకు మరోసారి సీఎం చంద్రశేఖర్‌రావు వద్దకు చేరింది. రెండురోజుల క్రితం నీటిపారుదల శాఖ ఈఎన్సీ నుంచి తుమ్మిళ్ల ఫైల్‌ను పంపారు. తుమ్మిళ్లకు అనుమతి లభిస్తే ఆర్డీఎస్ పరిధిలో 30ఏళ్లకు పైగా సాగునీరందని దాదాపు 55,600ఎకరాలకు సాగు, తాగునీరు అందనుంది. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామం వద్ద తుంగభద్ర నదీతీరంలో ఈ పథకంను చేపట్టనున్నారు. రెండు పంపులతో నీటిని ఎత్తిపోసేందుకు రూ.493 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించారు. ఆర్థికశాఖ ఈనెల ఒకటవ తేదిన క్లియరెన్స్ ఇవ్వడంతో అన్ని అ డ్డంకులు తొలగి, పరి పాలన అనుమతి కొరకు సీఎం వద్దక నివేదిక ఫైల్ వెళ్లింది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ పథకం డీపీఆర్‌ను ఈ ఎన్సీకి పంపారు. డీపీఆర్‌లో సూచించిన మూడు రిజర్వాయర్లను రెండు దశలుగా విభజించి మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టేలా తుదినివేదికను తయారుచేశారు. ఇదీ తుమ్మిళ్ల నేపథ్యం తుంగభద్ర నది నీటిని వాడుకునేలా నీటి మళ్లింపు పథకాలను చేపట్టేందుకు 1937లో అప్పటి నిజాం ప్రభుత్వం, మద్రాసు ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ మేరకు నిజాం ప్రభుత్వం ఆర్డీఎస్ను చేపట్టగా, మద్రాసు ప్రభుత్వం కర్నూలు, కడప కాలువను చేపట్టింది. 1951లో ఆర్డీఎస్ నుంచి సాగునీరందడం ప్రారంభమైంది. ఆర్డీఎస్ ద్వారా 15.84టీఎంసీల నీటిని అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం వినియోగించుకునే హక్కు ఉంది. మూడు టీఎంసీలకు మించి సాగునీరందడం లేదు. దీంతో తుమ్మిళ్లను చేపడుతున్నారు. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామం వద్ద తుంగభద్ర నది ఒడ్డున ఎత్తిపోతలను చేపట్టనున్నారు. రెండు పంపులను ఏర్పాటు చేసి 800 క్యూసెక్కులను పంపింగ్ చేసేలా డిజైన్ చేశారు. రెండు పంపులకు 8మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. పంప్‌హౌస్ నుంచి మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేసి ఆర్డీఎస్ ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వాలన్నది లక్ష్యం. మల్లమ్మకుంటను 0.39టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తారు. పంప్‌హౌస్ వద్ద నది పూర్తిస్థాయి నీటిమట్టం 292 అడుగులు కాగా 287అడుగుల వద్ద నుంచి నీటిని తోడేలా డిజైన్ చేశారు. 70రోజుల పాటు నదికి వరద ఉండే సమయంలో 3.63టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని ఎత్తిపోతల లక్ష్యం. ఆర్డీఎస్లో 12వ డిస్ట్రిబ్యూటరీ నుంచి చివరి 40వ డిస్ట్రిబ్యూటరీ వరకు ఈ పథకం ద్వారా సాగునీటిని అందిస్తారు. ఈ విషయమై జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌ను వివరణ కోరగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్ సీఎం వద్దకు వెళ్లిందని తెలిపారు. త్వరలోనే పరిపాలన అనుమతులు రావచ్చని చెప్పారు. -
రెండేళ్లలో తుమ్మిళ్ల ఎత్తిపోతల
► ఆర్డీఎస్ చివరి ఆయకట్టురైతులను ఆదుకుంటాం ► జిల్లాలో వలసలుత గ్గేరోజులు వస్తాయి ► రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించిన జితేందర్‌రెడ్డి బృందం శాంతినగర్: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిర్మాణపనులు రెండేళ్లలో పూర్తిచేసి అలంపూర్ రైతులను ఆదుకుంటామని ఎంపీ ఎపీ జితేందర్‌రెడ్డి ప్రకటించారు. వడ్డేపల్లి మండలంలోని తుమ్మిళ్ల సమీపంలో తుంగభద్ర నదీతీరంలో నిర్మించనున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్, రిజ ర్వాయర్ల స్థలాలను జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. వారికి ఆయకట్టు రైతులు ఘనస్వాగతం పలికారు. తుమ్మిళ్ల రిజర్వాయర్ స్థలాలను ఆర్డీఎస్ ఈఈ రాజేంద్రను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీమేరకు ఆర్డీఎస్ రైతాంగాన్ని ఆదుకునేందుకు రూ.834.60కోట్లు మంజూరుచేసేందుకు అంగీకరించారని తెలిపారు. త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుమ్మిళ్ల ఎత్తిపోతలకు ఆమోదం లభిస్తుందన్నారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) నివేదిక ఆధారంగా తనగల సమీపంలోని మల్లమ్మకుంట, జూలెకల్ శివారులో, వల్లూరు సమీపంలో మూడు రిజర్వాయర్లు నిర్మించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం ఉమ్మడిరాష్ట్రంలో నడిగడ్డ రైతులకు అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందన్నారు. రూ.32వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, 18 ప్యాకేజీల ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని ఎంపీ జితేందర్‌రెడ్డి వివరించారు. దీంతో జిల్లాలో వలసలు తగ్గి రైతులు సంతోషంగా ఉండేరోజులు వస్తాయన్నారు. అనంతరం మాజీ ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ.. తన 20ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంతత్వరగా రూ.100కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించలేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, విద్యాసాగర్‌రావు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆర్టీసీ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి మాట్లాడుతూ.. గుండ్రేవుల వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఎగువన 25 టీఎంసీల జలాశయం ఉంటుందని, నడిగడ్డ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మందా శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జంబులాచారి, తనగల ఎంపీటీసీ పరిమళ నరేష్, ఆర్డీఎస్ నీటి సంఘం నాయకులు రవిరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, వేణుగోపాల్‌నాయుడు, మురళీధర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రామిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి రెతులు పాల్గొన్నారు. -
ఇక కర్నూలుకు కన్నీళ్లే!
► తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం తెరపైకి ► 3 నెలల్లో సర్వేకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ► గుండ్రేవుల ప్రతిపాదనలు పంపితే... కలిసి ముందుకు వెళ్దామని సూచన ► ఏడాది కాలంగా కనీసం పట్టించుకోని ఏపీ ప్రభుత్వం ► తుమ్మిళ్ల వస్తే... సుంకేసులకు నీరు డౌటే ! ► కేసీ ఆయకట్టుకూ తిప్పలే.. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగరం ఇక నుంచి దాహంతో అలమటించాల్సిందేనా? వర్షాకాలంలో మినహా మిగిలిన సమయంలో కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు చుక్కనీరు లభించే పరిస్థితి లేకుండా పోనుందా? సుంకేసుల ప్రాజెక్టు నీళ్లు లేకుండా నోరెళ్లబెట్టనుందా? గుండ్రేవుల ప్రాజెక్టు కూడా మూలకు పడనుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే సుంకేసులకు ఎగువన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఆదేశాలతో జిల్లాకు కన్నీళ్లే తప్పవనే అభిప్రాయం సాగునీటి నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించేందుకు కలిసి వస్తే ముందుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉంచిన గుండ్రేవుల వెంటనే అనుమతి ఇవ్వాలని కర్నూలుకు సీఎం వస్తున్న సందర్భంగా సాగునీటిరంగ నిపుణులు కోరుతున్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా సీఎంను ఒప్పించాలని వీరు విన్నవిస్తున్నారు. తుమ్మిళ్ల వస్తే తిప్పలే...! సుంకేసుల పైభాగం నుంచి 8 నుంచి 10 టీఎంసీల నీటిని లిఫ్టు ఇరిగేషన్ (ఎత్తిపోతల) ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం తుమ్మిల్ల ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏడాది మొత్తం తాగునీటి అవసరాల పేరుతో నీటిని తీసుకెళ్లేందుకు ఈ పథకాన్ని అక్కడి ప్రభుత్వం చేపట్టింది. కేవలం మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని... ఇందుకోసం రూ.29.50 లక్షలను కూడా విడుదల చేసింది. ఎత్తిపోతల పథకం నిర్మిస్తే సుంకేసుల నీళ్లు లేక నోరెళ్లబెట్టాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ఫలితంగా కర్నూలు నగరానికి చుక్కనీరు కూడా దక్కే అవకాశం లేదు. అంతేకాకుండా కేసీ కెనాల్‌కు కూడా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గుండ్రేవుల నిర్మాణానికి ఇప్పటికే తెలంగాణ సానుకూలంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ముందుకు రావాలని సాగునీటిరంగ నిపుణులు కోరుతున్నారు.