ఈ సారైనా..!?
ఈ సారైనా..!?
Published Fri, Oct 14 2016 3:30 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
సీఎం పేషీలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్
రూ.493కోట్లతో మొదటి దశ అంచనా
55,600ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్ మరోసారి సీఎం పేషీకి చేరింది. గతంలో పలుమార్లు వివిధ కారణాలతో వెనక్కి వచ్చిన ఈఫైల్‌కు ఈసారైనా మోక్షం లభిస్తుందో లేదోనని ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతాం గం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అనుమతి లభిస్తే దశాబ్దాల కల సాకారమై తమ బతుకులు బాగుపడతాయని అభిప్రాయపడుతోంది.
జూరాల : ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు శాశ్వతంగా సాగునీరందించాలనే లక్ష్యంతో నిర్మించ తలపెట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్ ఎట్టకేలకు మరోసారి సీఎం చంద్రశేఖర్‌రావు వద్దకు చేరింది. రెండురోజుల క్రితం నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ నుంచి తుమ్మిళ్ల ఫైల్‌ను పంపారు. తుమ్మిళ్లకు అనుమతి లభిస్తే ఆర్డీఎస్ పరిధిలో 30ఏళ్లకు పైగా సాగునీరందని దాదాపు 55,600ఎకరాలకు సాగు, తాగునీరు అందనుంది. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామం వద్ద తుంగభద్ర నదీతీరంలో ఈ పథకంను చేపట్టనున్నారు. రెండు పంపులతో నీటిని ఎత్తిపోసేందుకు రూ.493 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించారు. ఆర్థికశాఖ ఈనెల ఒకటవ తేదిన క్లియరెన్స్ ఇవ్వడంతో అన్ని అ డ్డంకులు తొలగి, పరి పాలన అనుమతి కొరకు సీఎం వద్దక నివేదిక ఫైల్ వెళ్లింది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ పథకం డీపీఆర్‌ను ఈ ఎన్‌సీకి పంపారు. డీపీఆర్‌లో సూచించిన మూడు రిజర్వాయర్లను రెండు దశలుగా విభజించి మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టేలా తుదినివేదికను తయారుచేశారు.
ఇదీ తుమ్మిళ్ల నేపథ్యం
తుంగభద్ర నది నీటిని వాడుకునేలా నీటి మళ్లింపు పథకాలను చేపట్టేందుకు 1937లో అప్పటి నిజాం ప్రభుత్వం, మద్రాసు ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ మేరకు నిజాం ప్రభుత్వం ఆర్డీఎస్‌ను చేపట్టగా, మద్రాసు ప్రభుత్వం కర్నూలు, కడప కాలువను చేపట్టింది. 1951లో ఆర్డీఎస్ నుంచి సాగునీరందడం ప్రారంభమైంది. ఆర్డీఎస్ ద్వారా 15.84టీఎంసీల నీటిని అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం వినియోగించుకునే హక్కు ఉంది. మూడు టీఎంసీలకు మించి సాగునీరందడం లేదు. దీంతో తుమ్మిళ్లను చేపడుతున్నారు. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామం వద్ద తుంగభద్ర నది ఒడ్డున ఎత్తిపోతలను చేపట్టనున్నారు. రెండు పంపులను ఏర్పాటు చేసి 800 క్యూసెక్కులను పంపింగ్ చేసేలా డిజైన్ చేశారు. రెండు పంపులకు 8మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. పంప్‌హౌస్ నుంచి మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేసి ఆర్డీఎస్ ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వాలన్నది లక్ష్యం. మల్లమ్మకుంటను 0.39టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తారు. పంప్‌హౌస్ వద్ద నది పూర్తిస్థాయి నీటిమట్టం 292 అడుగులు కాగా 287అడుగుల వద్ద నుంచి నీటిని తోడేలా డిజైన్ చేశారు. 70రోజుల పాటు నదికి వరద ఉండే సమయంలో 3.63టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని ఎత్తిపోతల లక్ష్యం. ఆర్డీఎస్‌లో 12వ డిస్ట్రిబ్యూటరీ నుంచి చివరి 40వ డిస్ట్రిబ్యూటరీ వరకు ఈ పథకం ద్వారా సాగునీటిని అందిస్తారు. ఈ విషయమై జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌ను వివరణ కోరగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఫైల్ సీఎం వద్దకు వెళ్లిందని తెలిపారు. త్వరలోనే పరిపాలన అనుమతులు రావచ్చని చెప్పారు.
Advertisement
Advertisement