ఆల్మట్టిపై మళ్లీ కర్నాటకం
బిరబిరా సాగే కృష్ణమ్మను నిర్బంధించి తెలుగు రాష్ట్రాల నోట్లో మట్టి కొట్టేందుకు రంగం సిద్ధమైంది! అప్పర్ కృష్ణా మూడో దశ పనులను చేపట్టేందుకు అనుమతి కోరుతూ గురువారం అర్ధరాత్రి సీడబ్ల్యూసీ వెబ్సైట్లో ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కర్ణాటక సర్కారు అప్లోడ్ చేసింది. ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచడం వల్ల అదనంగా 130 టీఎంసీలను నిల్వ చేసుకోవడంతోపాటు మొత్తం 174 టీఎంసీలను వినియోగించుకోవడం ద్వారా బాగల్కోట్, బీజాపూర్, గదగ్, కొప్పళ, యాదగిరి, రాయచూర్ జిల్లాల్లో 14.70 లక్షల ఎకరాల (5.94 లక్షల హెక్టార్ల)కు నీళ్లందిస్తామని డీపీఆర్‌లో పేర్కొంది. ఈ పనులకు 2014–15 ధరల ప్రకారం రూ.51,148.94 కోట్లు వ్యయం అవుతుందని తెలిపింది.
ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల 30,579.25 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని, దీంతోపాటు ప్రధాన కాలువలు, పిల్ల కాలువల పనులకు 26,003 హెక్టార్లను సేకరించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ పనులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) తీర్పును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారణ కొనసాగుతుండటంతో ఆ తీర్పును సుప్రీం కోర్టు ఇప్పటిదాకా నోటిఫై చేయలేదు. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆల్మట్టి ఎత్తు పెంచడంలో భాగంగా అప్పర్ కృష్ణా మూడో దశ పనులకు కర్ణాటక శ్రీకారం చుట్టడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాభావంతో నీటి లభ్యత తగ్గిపోయి జూలై ఆఖరుకుగానీ తెలుగు రాష్ట్రాలకు జలాలు చేరడం లేదని, ఆల్మట్టి ఎత్తు పెంచితే సెప్టెంబరు మొదటి వారానికిగానీ కృష్ణా వరద దిగువకు వచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. కృష్ణాలో అక్టోబర్ వరకూ మాత్రమే వరద ఉంటుంది. ఈ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలు కూడా దక్కే అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులు తుంగలోకి..
కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,130 (70 టీఎంసీలు పునరుత్పత్తి) టీఎంసీలు ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తూ 1976లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు గడువు ముగియడంతో కృష్ణా జలాల పునఃపంపిణీకి బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలో కేడబ్ల్యూడీటీ–2ను కేంద్రం ఏర్పాటు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను కొనసాగించిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. నీటి లభ్యత 75 శాతానికి 65 శాతానికి మధ్య ఉన్న 448 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసింది. ఇందులో కర్ణాటకకు 177, ఉమ్మడి ఏపీకి 190, మహారాష్ట్రకు 81 టీఎంసీలను అదనంగా కేటాయించింది. ఈ క్రమంలో ఆల్మట్టి ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచుకోవడానికి కర్ణాటకకు అనుమతి ఇస్తూ 2013 నవంబర్ 29న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిరసిస్తూ సుప్రీం కోర్టులో సవాల్ చేసి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో తెలంగాణ సర్కార్ ఇంప్లీడ్ అయ్యింది. సుప్రీం కోర్టు స్టే విధించిన నేపథ్యంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేయలేదు. అయితే కర్ణాటక సర్కార్ సుప్రీం కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆల్మట్టి ఎత్తు పెంచడానికి సిద్ధమవడం గమనార్హం.
వ్యూహాత్మకంగా అడుగులు..
ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ ఆది నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతేడాది జూలై 7న కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేష్ జార్ఖహోలి ముంబైలో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి జయంత్పాటిల్తో సమావేశమై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేసేలా కేంద్రాన్ని కోరడం, ఆల్మట్టి ఎత్తు పెంచడంపై చర్చించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఇద్దరు మంత్రులు కేంద్రానికి వి/æ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల ముంపునకు గురయ్యే మహారాష్ట్రలోని ప్రాంతాలపై ఆ రాష్ట్రంతో చర్చించిన కర్ణాటక ముంపు భూములను వేగంగా సేకరిస్తోంది. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ముంపునకు గురయ్యే 30,579.25 హెక్టార్ల భూ సేకరణ, 23 ముంపు గ్రామాల ప్రజల పునరావాసానికి రూ.17 వేల కోట్లతో పనులను ప్రారంభించింది. కృష్ణా నదికి వరదలు ప్రారంభమయ్యేలోగా డ్యామ్ ఎత్తు పెంచే పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి శరవేగంగా చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది.
సాగునీటికే కాదు.. తాగునీటికీ కటకటే..
ఆల్మట్టి ప్రస్తుత సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ఎత్తు పెంచితే నిల్వ సామర్థ్యం 259.72 టీఎంసీలకు పెరుగుతుంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ నిల్వ సామర్థ్యం 37.65 టీఎంసీలు. ఈ రెండు జలాశయాలు నిండాలంటే 297.37 టీఎంసీలు అవసరం. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల కాలువలు, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ఎత్తిపోతల మొదటి దశ, రెండో దశల ద్వారా రోజుకు సగటున 2.5 నుంచి మూడు టీఎంసీల వరకూ వినియోగించుకునే సామర్థ్యం తెలంగాణకు ఉంది. బేసిన్లో సాధారణ స్థాయిలో వర్షాలు కురిసినప్పుడు జూలై నాలుగో వారం లేదా ఆగస్టు మొదటి వారానికి జూరాల, శ్రీశైలానికి వరద ప్రవాహం చేరుతోంది. ఆల్మట్టి ఎత్తు పెంచితే సెప్టెంబరుకుగానీ వరద ప్రవాహం చేరే అవకాశం ఉండదని నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వర్షాభావ సమయాల్లో తెలుగు రాష్ట్రాలకు నికర జలాలు కాదు కదా ఎగువ నుంచి చుక్క నీరు కూడా చేరే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు. 2015–16లో శ్రీశైలానికి 55 టీఎంసీలు మాత్రమే రావడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
ఈ పాపం చంద్రబాబుదే..
కర్ణాటక సర్కారు ఆల్మట్టి డ్యామ్ పనులను 1963లో ప్రారంభించగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయడం, న్యాయస్థానాల్లో వివాదాల వల్ల ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. 1996 లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు ఛైర్మన్‌గా ఉన్న సంకీర్ణ కూటమి(యునైటెడ్ ఫ్రంట్) సర్కార్ కేంద్రంలో కొలువుతీరింది. అప్పటి కర్ణాటక సీఎం హెచ్డీ దేవేగౌడ యునైటెడ్ ఫ్రంట్ మద్దతుతో ప్రధానమంత్రి పదవిని చేపట్టి ప్రపంచ బ్యాంకు, ఏఐబీపీ(సత్వర సాగునీటి ప్రయోజన కల్పన పథకం) నిధులతో ఆల్మట్టి డ్యామ్ పనుల్లో వేగం పెంచారు. ఈ వ్యవహారంపై అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు చూసీచూడనట్లు ఉదాశీనంగా వ్యవహరించడంతో ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకు కర్ణాటక పెంచేసింది. 2002 నుంచి ఆల్మట్టిలో 129.72 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు 2002లో కర్ణాటక సర్కార్ ప్రయత్నించినా చంద్రబాబు పట్టించుకోలేదు. చివరకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్లకే పరిమితం చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పానని, దేవేగౌడను ప్రధానిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఈ రోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే అవకాశం కర్ణాటకు ఉండేది కాదని న్యాయ, నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
–రామగోపాలరెడ్డి ,సాక్షి ప్రతినిధి
ఆలమూరు