రెండేళ్లలో తుమ్మిళ్ల ఎత్తిపోతల
► ఆర్డీఎస్ చివరి ఆయకట్టురైతులను ఆదుకుంటాం
► జిల్లాలో వలసలుత గ్గేరోజులు వస్తాయి
► రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించిన జితేందర్‌రెడ్డి బృందం
శాంతినగర్: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిర్మాణపనులు రెండేళ్లలో పూర్తిచేసి అలంపూర్ రైతులను ఆదుకుంటామని ఎంపీ ఎపీ జితేందర్‌రెడ్డి ప్రకటించారు. వడ్డేపల్లి మండలంలోని తుమ్మిళ్ల సమీపంలో తుంగభద్ర నదీతీరంలో నిర్మించనున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్, రిజ ర్వాయర్ల స్థలాలను జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. వారికి ఆయకట్టు రైతులు ఘనస్వాగతం పలికారు. తుమ్మిళ్ల రిజర్వాయర్ స్థలాలను ఆర్డీఎస్ ఈఈ రాజేంద్రను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీమేరకు ఆర్డీఎస్ రైతాంగాన్ని ఆదుకునేందుకు రూ.834.60కోట్లు మంజూరుచేసేందుకు అంగీకరించారని తెలిపారు. త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుమ్మిళ్ల ఎత్తిపోతలకు ఆమోదం లభిస్తుందన్నారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) నివేదిక ఆధారంగా తనగల సమీపంలోని మల్లమ్మకుంట, జూలెకల్ శివారులో, వల్లూరు సమీపంలో మూడు రిజర్వాయర్లు నిర్మించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం
ఉమ్మడిరాష్ట్రంలో నడిగడ్డ రైతులకు అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందన్నారు. రూ.32వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, 18 ప్యాకేజీల ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని ఎంపీ జితేందర్‌రెడ్డి వివరించారు. దీంతో జిల్లాలో వలసలు తగ్గి రైతులు సంతోషంగా ఉండేరోజులు వస్తాయన్నారు. అనంతరం మాజీ ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ.. తన 20ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంతత్వరగా రూ.100కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించలేదన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, విద్యాసాగర్‌రావు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆర్టీసీ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి మాట్లాడుతూ.. గుండ్రేవుల వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఎగువన 25 టీఎంసీల జలాశయం ఉంటుందని, నడిగడ్డ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మందా శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జంబులాచారి, తనగల ఎంపీటీసీ పరిమళ నరేష్, ఆర్డీఎస్ నీటి సంఘం నాయకులు రవిరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, వేణుగోపాల్‌నాయుడు, మురళీధర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రామిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి రెతులు పాల్గొన్నారు.