సందిగ్ధంలో ‘తుమ్మిళ్ల’
- రూ.493కోట్లతో ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసిన అధికారులు
- రిజర్వాయర్లపై స్పష్టత లేక ముందుకు కదలని పథకం
- త్వరలోనే ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగంలో ఏర్పడుతున్న లోటును పూడ్చేందుకు తలపెట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సందిగ్ధంలో పడింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రభుత్వానికి చేరి రెండు నెలలవుతున్నా పురోగతి కనిపించడంలేదు. ప్రాజెక్టుకింద ప్రతిపాదించిన రిజర్వాయర్ల విషయంలో నెలకొన్న అయోమయం ప్రాజెక్టును మూలనపడేలా చేసింది. రిజర్వాయర్ల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే దీనిపై సమీక్షించి తుది నిర్ణయం చేయనున్నారని తెలుస్తోంది.
ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉన్నా పైనుంచి 4 టీఎంసీలకు మించి నీరు రావడం లేదు. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నా 30 వేల ఎకరాలకు కూడా అందడం లేదు. ఈ దష్ట్యానే తుమ్మిళ్ల ఎత్తిపోతల చేపట్టాలని గత ఏడాది సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని సర్వే బాధ్యతలను వ్యాప్కోస్‌కు కట్టబెట్టారు. సర్వే చేసిన వ్యాప్కోస్, తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌ను తుమ్మిళ్ల వద్ద నిర్మించే మల్లమ్మకుంట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి మరో మూడు చిన్న పాటి రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ తుది ఆయకట్టు వరకు నీటిని తరలించేలా సర్వే నిపుణులు ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా మల్లమ్మకుంట వద్ద 0.39 టీఎంసీలు, జల్‌కల్ వద్ద 0.13 టీఎంసీ, వల్లూర్ వద్ద 0.46 టీఎంసీలతో బ్యారేజీలు నిర్మించి వాటిని ఆర్డీఎస్ కెనాల్‌లతో కలిపి మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలని ప్రణాళిక వేశారు.
90 రోజుల్లో 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ చేసి, ఈ పథకానికి రూ.830 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. అయితే వ్యాప్కోస్ నివేదికను పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు దాన్ని మార్చి, జల్‌కల్, వల్లూర్ రిజర్వాయర్‌లు అవసరం లేదని భావించి వాటిని తొలగించారు. కేవలం ఒక్క మల్లమ్మకుంట వద్ద రిజర్వాయర్‌ను మాత్రమే నిర్మించి నీటిని తరలిం చాలని సూచించారు. ఈ విధానం ద్వారా ఎత్తిపోతల పథకం వ్యయం రూ.493కోట్లు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పారు. రూ.493కోట్ల వ్యయానికి అనుమతులివ్వాలంటూ ముఖ్యమంత్రి అనుమతికి పంపారు. అయితే వ్యాప్కోస్ సూచించిన రిజర్వాయర్లు, నీటి పారుదల శాఖ నివేదించిన ప్రతిపాదనల్లో లేకపోవడంతో దీనిపై పూర్తి స్థాయి లో త్వరలోనే చర్చించి నిర్ణయం చేద్దామని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది.