తుమ్మిళ్ల పంప్‌హౌస్ పనులు పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే తదితరులు
రాజోళి (మహబూబ్‌నగర్): తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఆర్డీఎస్ రైతులకు వరమని, ప్రాజెక్టులో నిర్మించే రిజర్వాయర్లపై ఎలాంటి అపోహలు వద్దని అలంపూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వి.ఎం.అబ్రహం అన్నారు. శుక్రవారం ఆయన తుమిళ్ల ఎత్తిపోతల పనులను ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారామి రెడ్డితో కలిసి పరిశీలించారు. ముందుగా తనగల సమీపంలోని ఆర్డీఎస్ కెనాల్ డీ.24 వద్ద పనులు పూర్తిచేసుకున్న డెలవరీ సిస్టంను పరిశీలించారు. అక్కడే కెనాల్ కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ కోసం జరుగుతన్న పనులను పరిశీలించారు. అక్కడి నుంచి ప్రెజర్‌మొయిన్స్ పైప్‌లైన్ మీదుగా తుమ్మిళ్లకు చేరుకున్న ఆయన పంప్‌హౌస్, ఫోర్‌భే, అప్రోచ్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు మొదటి విడత పూర్తికావొచ్చాయని, ఆగస్టులో తుమ్మిళ్ల ద్వారా సాగునీరు అందిస్తామని అన్నారు. ఈ పనులు పూర్తయిన నేపథ్యంలో రెండో విడత పనులు జరగవని, రిజర్వాయర్లు నిర్మాణం ఉండదని కొందరు అపోహ చెందుతున్నారని, రిజర్వాయర్లతో సహ ప్రాజెక్టుకు సంబంధించి రూ.783 కోట్లు పరిపాలన అనుమతులు లభించాయని, రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. మొదటి విడత ద్వారా సాగు నీరు అందించిన అనంతరం మల్లమ్మకుంట, జూలకల్, వల్లూర్ రిజర్వాయర్లు నిర్మించడం జరుగుతందన్నారు. సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్ రావ్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని తనకు సూచించారని, ఇకపై పనులను పర్యవేక్షిస్తుంటానని తెలిపారు. మురళీధర్ రెడ్డి, గజేంద్ర, వెంకటయ్య, కిషోర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment