గులాబీలో గలాటా..!  | Internal Disputes In TRS Party Regarding Muncipal Elections | Sakshi
Sakshi News home page

గులాబీలో గలాటా..! 

Published Sat, Nov 16 2019 8:20 AM | Last Updated on Sat, Nov 16 2019 8:20 AM

Internal Disputes In TRS Party Regarding Muncipal Elections - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: జోగుళాంబ గద్వాల జిల్లాలో రాజకీయ అలజడి రేగింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. దళిత వర్గానికి చెందిన తనపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారంటూ అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. శుక్రవారం హైదరాబాద్‌ వెళ్లిన అబ్రహం.. నియోజకవర్గంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడ మీడియాకు వివరించారు.

రెండురోజుల క్రితం తన నియోజకవర్గ పరిధిలోని అయిజ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలోనూ అబ్రహం.. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా ఇలాకాలో ఇతరుల జోక్యం తగదు. నేనూ ఎమ్మెల్యేనే.. ఆయనా ఎమ్మెల్యేనే.. పక్క నియోజకవర్గానికి చెందిన ఆయన ఇక్కడ నాపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై పరోక్షంగా ఫైర్‌ అయ్యారు. దీంతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఇరువురు మధ్య విభేదాలు ఎట్టకేలకు బట్టబయలయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో ఏకంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తూ అబ్రహం ఆరోపణలు చేశారు.

తన నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. దళితవర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే తనపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన నియోజవకర్గంలో కాలుపెడితే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో గద్వాల ఎమ్మెల్యేపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ పరిణామాలు ఎటూ దారి తీస్తాయోననే ఆందోళన ఆ జిల్లాలోని గులాబీ కార్యకర్తల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.  

చిచ్చుపెట్టిన ‘పుర’ టికెట్లు.. 
త్వరలోనే జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు సృష్టించాయి. అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలోని అయిజ మున్సిపాలిటీలో ఈ సారి తను సూచించిన అభ్యర్థులకే బీ ఫారాలు ఇవ్వాలని.. లేకపోతే ఆయా స్థానాల్లో రెబెల్స్‌ను బరిలోకి దింపి వారిని గెలిపించుకుని తీరుతానంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఫోన్లో తనను బెదిరించారని ఎమ్మెల్యే అబ్రహం ఆరోపిస్తున్నారు. మంచి తనాన్ని చేతకాని తనంగా భావించిచొద్దని సూచించిన అబ్రహం.. పార్టీకి నష్టం చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటానని ఎవరికీ అన్యాయం జరగనీయబోనని కార్యకర్తల సమావేశంలో తేల్చి చెప్పారు.

ఇదీలా ఉంటే.. ఇరువురి ఎమ్మెల్యేల మధ్య చిచ్చుకు అదే పార్టీకి చెందిన మరో నేత కారణమనే చర్చ జరుగుతోంది. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యం కోసం తను చెప్పిన వారికి టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేసి విఫలమైన సదరు నాయకుడు తాజాగా ‘పుర’పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో అబ్రహంకు ఫోన్‌ చేయించినట్లు అధికార పార్టీలోనే చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. ఏదేమైనా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలు.. ప్రస్తుతం గద్వాల జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

పరిస్థితి ఇలానే ఉంటే త్వరలోనే జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇద్దరు ఎమ్మెల్యే మధ్య నెలకొన్న విభేదాలపై అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరోవైపు అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం తనపై చేసిన విమర్శలపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అంతగా స్పందించలేదు. ఆయన వివరణ కోసం సాక్షి ఫోన్‌లో సంప్రదించగా... ‘అలంపూర్‌ ఎమ్మెల్యే చేసిన విమర్శలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరి గురించి అన్నారో తెలియదు. ఏమున్నా... పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా’ అని సమాధానం చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement