MLA abraham
-
ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో?
సాక్షి, జోగుళాంబ గద్వాల: అలంపూర్ రాజకీయ పరిణామాలు ఆసక్తిరేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంకు బీఫామ్ ఇంకా అందలేదు. చల్లా వర్గీయుడు విజేయుడు, ఎమ్మెల్యే అబ్రహం వేర్వేరుగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దీంతో పార్టీ క్యాడర్ గందరగోళంలో పడింది. మరో వైపు,తన తనయుడు శ్రీనాథ్‌కు సీట్ ఇవ్వాలంటూ మంద జగన్నాథ్ పట్టుబడుతున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరపున అటు ఎమ్మెల్యే అబ్రహం, ఇటు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి విజేయుడు శుక్రవారం పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. బీఫాం విషయంలో ఎవరూ అపోహలకు గురి కావద్దని, తనకే వస్తుందని, మహిళలు, వృద్ధులు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, తనను ఆదరించాలని ఎమ్మెల్యే అబ్రహం కోరారు. ఈమేరకు వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో ప్రచారం నిర్వహించారు. మరోవైపు కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి విజేయుడు ఉండవెల్లి మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అయితే, ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రత్యర్థులకు తీసిపోనట్లుగా పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కొంత అయోమయం నెలకొంది. చదవండి: ‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్! -
అబ్రహంకు బీఫామ్ ఇవ్వని కేసీఆర్.. కలవకుండా కారెక్కి వెళ్లిపోయిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిరేపుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సొంతపార్టీలోనే అసమ్మతి తారస్థాయికి చేరుకోవడం.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లు వార్ కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారాయి. అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతోంది. బీఆర్ఎస్ ప్రకటించిన లిస్ట్‌లో అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్రహం పేరు ఉన్నా, ప్రస్తుతం ఆయనకు బీఫామ్ దక్కలేదు. అబ్రహాంకు కాకుండా వేరే అభ్యర్థికి బీఫామ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనుచరుడు విజేయుడుకు బీఫామ్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. మరో వైపు, తెలంగాణ భవన్‌కు వచ్చిన అబ్రహంను కలవకుండా కేటీఆర్ కారెక్కి వెళ్లిపోయారు. వచ్చే ఎసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత అందరికంటే ముందుగా ఆగస్టు 21న అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి పాలమూరులో 14 స్థానాలుండగా.. అంతటా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో అలంపూర్, మక్తల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలంటూ అసమ్మతి పెల్లుబికింది. అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి తొలుత పలు మండలాల్లో చల్లా వర్గీయులుగా ముద్రపడిన అసంతృప్త నాయకులు సమావేశాలు నిర్వహించినా.. ఆ తర్వాత సద్దుమణిగింది. ఇక బీఫాంలు అందజేస్తారు అన్న క్రమంలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమనడం.. పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలవడం.. అభ్యర్థిని మార్చాలంటూ వినతిపత్రం అందజేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీనే ఎన్నికల ఇన్చార్జిగా ప్రకటించిన తర్వాత కూడా పరిస్థితి కుదుటపడకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు ముఖ్య నాయకులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేసినట్లు తెలిసింది. అలంపూర్‌పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఉత్కంఠ నెలకొంది. చదవండి: రాహుల్ బైక్ ర్యాలీలో అపశ్రుతి..కొండా సురేఖకు గాయాలు -
గులాబీలో గలాటా..!
సాక్షి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో రాజకీయ అలజడి రేగింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. దళిత వర్గానికి చెందిన తనపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారంటూ అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. శుక్రవారం హైదరాబాద్ వెళ్లిన అబ్రహం.. నియోజకవర్గంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడ మీడియాకు వివరించారు. రెండురోజుల క్రితం తన నియోజకవర్గ పరిధిలోని అయిజ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలోనూ అబ్రహం.. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా ఇలాకాలో ఇతరుల జోక్యం తగదు. నేనూ ఎమ్మెల్యేనే.. ఆయనా ఎమ్మెల్యేనే.. పక్క నియోజకవర్గానికి చెందిన ఆయన ఇక్కడ నాపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. దీంతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఇరువురు మధ్య విభేదాలు ఎట్టకేలకు బట్టబయలయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో ఏకంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తూ అబ్రహం ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. దళితవర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే తనపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన నియోజవకర్గంలో కాలుపెడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో గద్వాల ఎమ్మెల్యేపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ పరిణామాలు ఎటూ దారి తీస్తాయోననే ఆందోళన ఆ జిల్లాలోని గులాబీ కార్యకర్తల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. చిచ్చుపెట్టిన ‘పుర’ టికెట్లు.. త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికలే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు సృష్టించాయి. అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని అయిజ మున్సిపాలిటీలో ఈ సారి తను సూచించిన అభ్యర్థులకే బీ ఫారాలు ఇవ్వాలని.. లేకపోతే ఆయా స్థానాల్లో రెబెల్స్‌ను బరిలోకి దింపి వారిని గెలిపించుకుని తీరుతానంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఫోన్లో తనను బెదిరించారని ఎమ్మెల్యే అబ్రహం ఆరోపిస్తున్నారు. మంచి తనాన్ని చేతకాని తనంగా భావించిచొద్దని సూచించిన అబ్రహం.. పార్టీకి నష్టం చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటానని ఎవరికీ అన్యాయం జరగనీయబోనని కార్యకర్తల సమావేశంలో తేల్చి చెప్పారు. ఇదీలా ఉంటే.. ఇరువురి ఎమ్మెల్యేల మధ్య చిచ్చుకు అదే పార్టీకి చెందిన మరో నేత కారణమనే చర్చ జరుగుతోంది. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యం కోసం తను చెప్పిన వారికి టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేసి విఫలమైన సదరు నాయకుడు తాజాగా ‘పుర’పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో అబ్రహంకు ఫోన్ చేయించినట్లు అధికార పార్టీలోనే చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. ఏదేమైనా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలు.. ప్రస్తుతం గద్వాల జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇద్దరు ఎమ్మెల్యే మధ్య నెలకొన్న విభేదాలపై అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరోవైపు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తనపై చేసిన విమర్శలపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అంతగా స్పందించలేదు. ఆయన వివరణ కోసం సాక్షి ఫోన్లో సంప్రదించగా... ‘అలంపూర్ ఎమ్మెల్యే చేసిన విమర్శలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరి గురించి అన్నారో తెలియదు. ఏమున్నా... పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా’ అని సమాధానం చెప్పారు. -
తుమ్మిళ్ల రిజర్వాయర్లపై అపోహలు వద్దు
రాజోళి (మహబూబ్‌నగర్): తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఆర్డీఎస్ రైతులకు వరమని, ప్రాజెక్టులో నిర్మించే రిజర్వాయర్లపై ఎలాంటి అపోహలు వద్దని అలంపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వి.ఎం.అబ్రహం అన్నారు. శుక్రవారం ఆయన తుమిళ్ల ఎత్తిపోతల పనులను ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారామి రెడ్డితో కలిసి పరిశీలించారు. ముందుగా తనగల సమీపంలోని ఆర్డీఎస్ కెనాల్ డీ.24 వద్ద పనులు పూర్తిచేసుకున్న డెలవరీ సిస్టంను పరిశీలించారు. అక్కడే కెనాల్ కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ కోసం జరుగుతన్న పనులను పరిశీలించారు. అక్కడి నుంచి ప్రెజర్మొయిన్స్ పైప్‌లైన్ మీదుగా తుమ్మిళ్లకు చేరుకున్న ఆయన పంప్‌హౌస్, ఫోర్భే, అప్రోచ్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు మొదటి విడత పూర్తికావొచ్చాయని, ఆగస్టులో తుమ్మిళ్ల ద్వారా సాగునీరు అందిస్తామని అన్నారు. ఈ పనులు పూర్తయిన నేపథ్యంలో రెండో విడత పనులు జరగవని, రిజర్వాయర్లు నిర్మాణం ఉండదని కొందరు అపోహ చెందుతున్నారని, రిజర్వాయర్లతో సహ ప్రాజెక్టుకు సంబంధించి రూ.783 కోట్లు పరిపాలన అనుమతులు లభించాయని, రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. మొదటి విడత ద్వారా సాగు నీరు అందించిన అనంతరం మల్లమ్మకుంట, జూలకల్, వల్లూర్ రిజర్వాయర్లు నిర్మించడం జరుగుతందన్నారు. సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్ రావ్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని తనకు సూచించారని, ఇకపై పనులను పర్యవేక్షిస్తుంటానని తెలిపారు. మురళీధర్ రెడ్డి, గజేంద్ర, వెంకటయ్య, కిషోర్ పాల్గొన్నారు. -
'డీకే అరుణ అన్యాయం చేశారు'
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పెద్దల తీరుపై ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీ-ఫారంల విషయంలో పొన్నాల దామోదర రాజనర్సింహ, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. దళిత ఎమ్మెల్యే అయిన తనకే పార్టీలో న్యాయం జరగటం లేదని అబ్రహాం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పెద్దలు ఇక సామాజిక న్యాయం ఎలా సాధిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. పార్టీలో కొనసాగాలా? వద్దా అనే అంశంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అబ్రహాం తెలిపారు. -
గాంధీ భవన్ లో ఆలంపూర్ ఎమ్మెల్యే నిరసన ప్రదర్శన
హైదరాబాద్: జడ్పీటీసీ, ఎంపీటీసీ బీఫాంల రగడ కాంగ్రెస్ లో అగ్గి రాజేస్తోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు బీఫాంలు ఇచ్చే బాధ్యతలను ఆయా నియోజకవర్గాల్లో ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాగా, ఆలంపూర్ నియోజకవర్గంలో మాత్రం ఇందుకు భిన్నంగా వేరే నేతకు అప్పచెప్పారు. ఆ బాధ్యతను అక్కడి ఎమ్మెల్యే అబ్రహంకు ఇవ్వకపోవడంతో వివాదం రాజుకుంది. మిగతా నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ బీఫాంలను చూసే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పజెప్పి, మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ నియోజకవర్గంలో మాత్రం తనకు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే అబ్రహం నిరసన కార్యక్రమం చేపట్టారు. తనకు కాకుండా వేరే నేతకు బీఫాంలు బాధ్యతను ఎందుకు ఇచ్చారని ఆయన కాంగ్రెస్ ను నిలదీశారు. ఈ క్రమంలోనే గాంధీభవన్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. తాను దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేను కాబట్టే పార్టీ పెద్దలు అవమానిస్తున్నారని అబ్రహం ఆరోపిస్తున్నారు.