హైదరాబాద్: జడ్పీటీసీ, ఎంపీటీసీ బీఫాంల రగడ కాంగ్రెస్ లో అగ్గి రాజేస్తోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు బీఫాంలు ఇచ్చే బాధ్యతలను ఆయా నియోజకవర్గాల్లో ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాగా, ఆలంపూర్ నియోజకవర్గంలో మాత్రం ఇందుకు భిన్నంగా వేరే నేతకు అప్పచెప్పారు. ఆ బాధ్యతను అక్కడి ఎమ్మెల్యే అబ్రహంకు ఇవ్వకపోవడంతో వివాదం రాజుకుంది. మిగతా నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ బీఫాంలను చూసే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పజెప్పి, మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ నియోజకవర్గంలో మాత్రం తనకు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే అబ్రహం నిరసన కార్యక్రమం చేపట్టారు.
తనకు కాకుండా వేరే నేతకు బీఫాంలు బాధ్యతను ఎందుకు ఇచ్చారని ఆయన కాంగ్రెస్ ను నిలదీశారు. ఈ క్రమంలోనే గాంధీభవన్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. తాను దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేను కాబట్టే పార్టీ పెద్దలు అవమానిస్తున్నారని అబ్రహం ఆరోపిస్తున్నారు.