‘మండలం’లోనూ హంగే
‘మండలం’లోనూ హంగే
Published Wed, May 14 2014 2:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
కాంగ్రెస్ - టీఆర్‌ఎస్‌ల మధ్య పోటాపోటీ..
441 స్థానాల్లో 200 చోట్ల ఫలితం తేలే సూచనల్లేవు
ఇతరుల మద్దతు కోసం ఆశావహుల ప్రయత్నాలు..
వేసవి శిబిరాల పేరుతో క్యాంపు రాజకీయాల జోరు
ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..
నేటి ఉదయానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలోని మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వస్తూనే ఉన్నాయి. మొత్తం 441 మండల ప్రజా పరిషత్తులకు గాను 6,497 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో రాత్రి పొద్దుపోయే వరకు ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్‌కు 2,216, టీఆర్‌ఎస్‌కు 1,844, టీడీపీకి 831, బీజేపీకి 230, ఇతరులు 820 స్థానాలను సాధించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం మేరకు 441 ఎంపీపీలకు గాను సుమారు 200 స్థానాల్లో హంగ్ ఫలితాలే దర్శనమిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన వాటిలో కాంగ్రెస్ 58, టీఆర్‌ఎస్ 78, టీడీపీ 10 ఎంపీపీ పీఠాలను దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అధికారులు మాత్రం బుధవారం ఉదయానికల్లా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అర్ధరాత్రి దాటేవరకు కూడా జిల్లా పార్టీ కార్యాలయాల్లో వివిధ రాజకీయ పార్టీలు మకాం వేసి ఏయే మండలంలో ఎన్ని స్థానాలు తమకు వచ్చాయి? ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ఎన్ని సీట్లు కావాలి? ఈ విషయంలో మద్దతిచ్చే వాళ్లెవరున్నారు? అనే విషయాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా ఉన్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు ఇతర పార్టీల ‘మద్దతు’ కోసం ఇప్పటికే ఆయా నేతలతో సంప్రదింపులు జరుపుతుండటం విశేషం.
ఇక్కడా తప్పని క్యాంపు రాజకీయాలు: తెలంగాణలోని మండల పరిషత్‌లలో చాలాచోట్ల హంగ్ ఫలితాలు దర్శనిమిస్తుండటం, స్వతంత్రులు, చిన్నా చితక పార్టీల మద్దతు కీలకం కానున్న నేపథ్యంలో ఇక్కడా క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. మండల, జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఆశిస్తున్న నేతలంతా ఇప్పటికే స్వతంత్ర సభ్యుల మద్దతును కూడగట్టేందుకు బేరసారాలకు దిగుతున్నారు. సమ్మర్ క్యాంప్ పేరుతో ప్రత్యేక శిబిరాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. బుధవారం నుంచి క్యాంపు రాజకీయాలు వేడెక్కడం ఖాయంగా కన్పిస్తోంది.
Advertisement
Advertisement