సాక్షి, హైదరాబాద్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిరేపుతున్నాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సొంతపార్టీలోనే అసమ్మతి తారస్థాయికి చేరుకోవడం.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లు వార్ కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారాయి.
అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ ప్రకటించిన లిస్ట్‌లో అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్రహం పేరు ఉన్నా, ప్రస్తుతం ఆయనకు బీఫామ్ దక్కలేదు. అబ్రహాంకు కాకుండా వేరే అభ్యర్థికి బీఫామ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనుచరుడు విజేయుడుకు బీఫామ్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. మరో వైపు, తెలంగాణ భవన్‌కు వచ్చిన అబ్రహంను కలవకుండా కేటీఆర్ కారెక్కి వెళ్లిపోయారు.
వచ్చే ఎసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అధినేత అందరికంటే ముందుగా ఆగస్టు 21న అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి పాలమూరులో 14 స్థానాలుండగా.. అంతటా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో అలంపూర్, మక్తల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలంటూ అసమ్మతి పెల్లుబికింది.
అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి తొలుత పలు మండలాల్లో చల్లా వర్గీయులుగా ముద్రపడిన అసంతృప్త నాయకులు సమావేశాలు నిర్వహించినా.. ఆ తర్వాత సద్దుమణిగింది. ఇక బీఫాంలు అందజేస్తారు అన్న క్రమంలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమనడం.. పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలవడం.. అభ్యర్థిని మార్చాలంటూ వినతిపత్రం అందజేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఎమ్మెల్సీనే ఎన్నికల ఇన్‌చార్జిగా ప్రకటించిన తర్వాత కూడా పరిస్థితి కుదుటపడకపోవడంతో బీఆర్‌ఎస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు ముఖ్య నాయకులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేసినట్లు తెలిసింది. అలంపూర్‌పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఉత్కంఠ నెలకొంది.
చదవండి: రాహుల్ బైక్ ర్యాలీలో అపశ్రుతి..కొండా సురేఖకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment