శ్రీసిటీలో క్యాడ్బరీ ఉత్పత్తి షురూ
♦ తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
♦ 19 కోట్ల డాలర్ల పెట్టుబడి; 60వేల టన్నుల ఉత్పత్తి
♦ 2020 నాటికి 2.5 లక్షల టన్నులకు చేరనున్న ఉత్పత్తి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాకొలెట్ల ఉత్పత్తి ఆరంభమయింది. అమెరికాకు చెందిన మాండలెజ్ ఇంటర్నేషనల్‌లో భాగమైన మాండలెజ్ ఇండియా... శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన తన అతిపెద్ద ప్లాంటులో తొలిదశ ఉత్పత్తిని సోమవారం ఆరంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉత్పత్తిని స్విచ్ ఆన్ చేయటం ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఫుడ్ దిగ్గజాల్లో ఒకటైన మాండలెజ్ సంస్థ... శ్రీ సిటీలో తన ప్లాంటును ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ టెక్నాలజీ, తయారీ సామర్థ్యాన్ని తీసుకు రావటంతో పాటు ఉద్యోగ అవకాశాలనూ కల్పిస్తోందని ప్రశంసించారు.
‘‘క్యాడ్‌బరీ సంస్థ కోకో సాగుకు సం బంధించి రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రైతులతో కలసి పనిచేస్తోంది. స్థానికులకు తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించటం అభినందనీయం. సరైన శిక్షణ పొందితే మన గ్రామీణులు అంతర్జాతీయ స్థాయికి తీసిపోకుండా పనిచేయగలరు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్థానిక పరిశ్రమల ఉద్యోగులంతా అక్కడే ఉండేందుకు వీలుగా ఆరు నెలల్లో 5 వేల గృహాలను నిర్మించాలని శ్రీసిటీ ప్రతినిధులకు సూచించారు. శ్రీ సిటీ ప్రతి నిధులు శ్రీనిరాజు, రవి సన్నారెడ్డిలను ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
2020 నాటికి 1,600 మందికి ఉద్యోగాలు
మాండలెజ్ సంస్థ ఇంటిగ్రేటెడ్ సప్లయ్ చెయిన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డానియల్ మైర్స్ మాట్లాడుతూ ప్రస్తుత, రేపటి వినియోగదారుల అవసరాలను తీర్చగలిగేలా అంతర్జాతీయ స్థాయి తయారీ కేంద్రాన్ని శ్రీ సిటీలో నెలకొల్పుతున్నామన్నారు. తాము ప్రపంచవ్యాప్తంగా అత్యంత సామర్థ్యం ఉన్న తయారీ టెక్నాలజీపై పెట్టుబడి పెడుతున్నట్లు తెలియజేశారు. శ్రీ సిటీ ప్లాంటును తమ పవర్ బ్రాండ్ల వృద్ధికి వీలుగా ఏర్పాటు చేస్తున్న భవిష్యత్ తయారీ కేంద్రంగా అభివర్ణించారు. తొలి దశ ఉత్పత్తిని ఆరంభించిన ఈ ప్లాంటు... 2020 నాటికి 2.5 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని అంచనా. తద్వారా 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ ప్లాంటుపై సంస్థ 19 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది.
ప్రస్తుత సామర్థ్యం 60వేల టన్నులు
మాండలేజ్ ఇండియా ఎండీచంద్రమౌళి వెంకటేశ్ మాట్లాడుతూ... 2015లో సంస్థ నికర ఆదా యం 30 బిలియన్ డాలర్లుగా చెప్పారు. 165 దేశాల్లో వ్యాపారం చేస్తున్నామని, పలు ఉత్పత్తుల్లో అగ్రగాములుగా ఉన్నామని చెప్పారు. తొలిదశలో శ్రీ సిటీ ప్లాంటు ద్వారా ఏటా 60,000 టన్నుల చాకొలెట్లు ఉత్పత్తి చేస్తామని తెలియజేశారు. మాండలేజ్ ప్రతినిధులతో పాటు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎపీఐఐసీ చెర్మైన్ కృష్ణయ్య, పలువురు ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.