గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం : సీఎం | Works to develop homes for the delete:- cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం : సీఎం

Published Fri, Jun 24 2016 3:21 AM | Last Updated on Tue, May 29 2018 11:50 AM

గొంతెమ్మ కోర్కెలు  తీర్చలేం : సీఎం - Sakshi

గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం : సీఎం

అభివృద్ధి పనుల కోసం ఇళ్లు తొలగిస్తాం
నష్టపోయినవారికి పరిహారమిస్తాం
అవసరమైతే ఇళ్లు తొలగిస్తాం
రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు
దుర్గగుడి అభివృద్ధిలోనూ ఇళ్ల తొలగింపు తప్పనిసరి
పుష్కర ఘాట్ల పరిశీలనలో సీఎం చంద్రబాబు
 

సీఎం చంద్రబాబునాయుడు గురువారం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను, పుష్కర ఘాట్ల నిర్మాణాలను పరిశీలించారు. వీలైతే వారానికోసారి పరిశీలిస్తానని తెలిపారు. సకాలంలో పూర్తికాకుంటే చర్యలు తప్పవని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు.
 
 
విజయవాడ (కృష్ణలంక) :  విజయవాడ రూపురేఖలు మార్చేస్తున్నామని, ఈ నేపథ్యంలో పలుచోట్ల ఇళ్లు తొలగించాల్సి వస్తోందని, ఇళ్లు కోల్పోయినవారు ఇబ్బందిపడకుండా నష్టపరిహారం ఇస్తామే తప్ప వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చలేమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన అనంతరం దుర్గాఘాట్‌లో జరుగుతున్న పనులను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఘాట్‌రోడ్డు అభివృద్ధికి ఇళ్లు తొలగించాల్సి ఉందని, అంతా సహకరించాలని కోరారు. కృష్ణా కెనాల్ చెత్తాచెదారంతో నిండి ఉండటాన్ని గమనించి ఇంజినీర్లను ప్రశ్నించారు.

వన్‌టౌన్‌లోని డ్రెయినేజీ నీరు కాలువలో కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పద్మావతి ఘాట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని కలెక్టర్ బాబు.ఏ, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పద్మావతి ఘాట్‌లో విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. పుష్కరాల పనులు వీలైతే వారానికోసారి పరిశీలిస్తానని సీఎం పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎంపీ కేశినేని నాని, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, అసిస్టెంట్ కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా తదితరులు పాల్గొన్నారు.


ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనుల పరిశీలన
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు గురువారం పరిశీలించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయన షాపింగ్ కాంప్లెక్స్, భవానీ దీక్ష మండపం తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. భవనాలను తొలగించిన చోట ఏం ఏర్పాటు చేస్తారంటూ ఇన్‌చార్జి ఈవో ఆజాద్‌ను అడిగి తెలుసుకున్నారు. కొండపై నుంచి కృత్రిమ జలపాతంతో పాటు కొండ కింద మండపాలను ఏర్పాటుచేసి దుర్గామల్లేశ్వరస్వామికి పూజలు నిర్వహిస్తామన్నారు. భక్తులు తూర్పువైపు నుంచి ఆలయంలోకి ప్రవేశించేలా భవనాన్ని నిర్మించాలని సీఎంగా ఉన్న సమయంలో ఎన్‌టీఆర్ నిర్ణయించారని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోశాల వద్దకు చేరుకుని సీఎం అక్కడి నుంచి నగరాన్ని తిలకించారు. మహామండపం నుంచి నగరాన్ని తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, హిల్‌వ్యూ ప్రాంతం నుంచి ప్రకాశం బ్యారేజీ, అమరావతి ప్రాంతాలను వీక్షించేందుకు వీలుగా పనులు చేపట్టాలన్నారు. మంత్రి నారాయణ, మేయర్  కోనేరు శ్రీధర్,  ఎంపీ నాని, కలెక్టర్ బాబు.ఏ, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్ కలెక్టర సృజన తదితరులు ఉన్నారు.
 
 
దుర్గమ్మను దర్శించుకోకుండానే వెనక్కి..
ఇంద్రకీలాద్రి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించిన సీఎం దుర్గమ్మను దర్శించుకోకుండా వెనుదిరిగారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయన సుమారు పావుగంట సేపు ఆలయ పరిసరాల్లోనే గడిపారు. పనుల పరిశీలన, అధికారులతో మాట్లాడిన తర్వాత నేరుగా కాన్వాయ్‌తో కొండ కిందకు దిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement