మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నార మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మాజీ స్పీకర్ మనోహర్
చింతపల్లి: మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నార మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలోనే మన్యం ఖనిజ సంపదపై కన్నేశారన్నారు. విదేశీ కంపెనీలతో తవ్వకాలకు ఒప్పందం కుదుర్చుకుని బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నిచడంతో గిరిజనులు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయని, దీంతో చంద్రబాబు వెనక్కు తగ్గారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారని, అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలకు తెరలేపారని విమర్శించారు.
గిరిజనులు ఆందోళన చేయడంతో పాత జీవోలను రద్దుచేసిన చంద్రబాబు, కొత్త జీవో రద్దు చేయకుండా ఇంతకాలం గిరిజనులను మభ్యపెట్టారని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు ప్రకటనతో అసలు రూపం బయట పడిందని చెప్పారు. గిరినాభివృద్ధికి బాక్సైట్ తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం లేదని, ఎస్‌టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగిస్తే గిరిజన ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు
తాను మచ్చలేని వ్యక్తినని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెపుతుంటారని, విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలు ఎక్కడ నుంచి వస్తున్నాయని మనోహర్ ప్రశ్నించారు.
పక్క రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే సంతల్లో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని నీతులు వల్లించిన చంద్రబాబు, ఇక్కడ ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఉగ్రంగి లక్ష్మణరావు, సర్పంచ్‌లు సాగిన దేవుడమ్మ, అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు.