![Andhra Pradesh Won In London Court - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/19/LAW-22.jpg.webp?itok=C-mthMpw)
సాక్షి, అమరావతి: లండన్ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ విజయం లభించింది. విశాఖపట్నం ప్రాంతంలో బాక్సైట్ ఒప్పందానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం, యుఏఈకి చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (రాకియా) మధ్య ఏర్పడిన వివాదంపై లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రాష్ట్రానికి చెందిన అధికారులు, న్యాయ నిపుణులు తమ వాదనలను బలంగా వినిపించారు. భారతదేశం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినిపించిన వాదనలతో ఆర్బిట్రేషన్ కోర్టు ఏకీభవిస్తూ, ఈ కేసు తమ పరిధిలోది కాదని పేర్కొంటూ కొట్టేసింది.
గిరిజనుల డిమాండ్ మేరకు బాక్సైట్ సరఫరా ఒప్పందం రద్దు
2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రాకియాతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం రాకియా తన జాయింట్ వెంచర్ సంస్థ ఎన్‌రాక్‌తో కలిసి ఏర్పాటు చేసే అల్యూమినియం పరిశ్రమకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాక్సైట్ సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది. అయితే, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన సంస్కృతికి విఘాతం ఏర్పడుతుందని ఆందోళనలు జరిగాయి.
ఈ నేపథ్యంలో బాక్సైట్ సరఫరా వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెద్దగా లేదని, గిరిజన ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ఇండియా, యుఏఈల మధ్య ఉన్న బైలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రీటీ (బీఐటీ) ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని రాకియా సంస్థ తమకు బాక్సైట్ సరఫరా చేయకపోవడం వల్ల నష్టపోయామంటూ లండన్ మధ్యవర్తిత్వ కోర్టులో కేసు వేసింది. ఏపీ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం తమకు బాక్సైట్ ఇవ్వకపోవడం వల్ల తాము అల్యూమినియం పరిశ్రమ కోసం పెట్టిన పెట్టుబడిని నష్టపోయామని, ఇందుకు నష్టపరిహారం ఇవ్వాలని వాదించింది. ఈ కేసులో దాదాపు 273 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా..
ఈ అంశంపై రాకియా సంస్థ కోర్టుకు వెళ్లక ముందే చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రభుత్వం తరఫున ప్రతినిధులు పలుసార్లు రాకియాతో సంప్రదింపులు జరిపినా అంగీకరించలేదు. దీంతో సీఎం వైఎస్ జగన్ సూచనలతో అధికారులు పకడ్బందీగా లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం నుంచి గనుల శాఖ ఉన్నతాధికారులు, ఏపీ ఎండీసీ అధికారులు, న్యాయ నిపుణులు లండన్ కోర్టులో బాక్సైట్ ఒప్పందాల రద్దు పర్యవసానాలను బలంగా వినిపించారు.
లండన్ న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వినిపించిన వాదనలతో ఏకీభవిస్తూ.. ఈ కేసు తమ పరిధిలోకి రాదని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఇది అతి పెద్ద విజయమని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ‘సాక్షి’కి తెలిపారు. లండన్‌లో ఉన్న ఆయన తుది విచారణ సందర్భంగా లండన్ కోర్టుకు వెళ్లారు. తీర్పు ఏపీకి అనుకూలంగా రావడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment