‘విలీన’ సమస్యల పరిష్కారానికే సీఎం పర్యటన | 'Merge' the chief tour problems | Sakshi
Sakshi News home page

‘విలీన’ సమస్యల పరిష్కారానికే సీఎం పర్యటన

Published Tue, Apr 12 2016 2:30 AM | Last Updated on Thu, Mar 21 2019 8:24 PM

‘విలీన’ సమస్యల పరిష్కారానికే సీఎం పర్యటన - Sakshi

‘విలీన’ సమస్యల పరిష్కారానికే సీఎం పర్యటన

చింతూరు : విలీన మండలాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే ముఖ్యమంత్రి చింతూరు పర్యటన ముఖ్యోద్దేశమని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన చింతూరులో విలేకరులతో మాట్లాడుతూ విలీన మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని, ఉపాధిహామీ పనులపై ఆరాతీస్తారని వివరించారు. ఐటీడీఏ, ట్రెజరీ కార్యాలయాలు ప్రారంభించడంతో పాటు విలీన మండలాల ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. వైద్యం, విద్య వంటి అపరిష్కృత సమస్యలపై ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు.
 
నివేదికలతో సిద్ధం కండి
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులంతా తమ శాఖల అభివృద్ధి నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. చింతూరు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విలీన మండలాల్లో నిర్మాణంలో ఉన్న రహదారులు, కొత్తగా చేపట్టబోయేవి వంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు.

సొంత భవనాలు లేని అంగన్‌వాడీ కేంద్రాలపై నివేదిక తయారు చేయాలని, విలీన మండలాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కారం కాగల సమస్యలపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన రోజున ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం గ్రీవెన్స్‌లో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఐటీడీఏ పీఓ కేవీఎన్ చక్రధరబాబు, సబ్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు.
 
ఏర్పాట్ల పరిశీలన
చింతూరు : చింతూరులో  ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలాన్ని సందర్శించారు. నిమ్మలగూడెంలో ముఖ్యమంత్రి ప్రారంభించే సీసీ రహదారి, పరిశీలించే అంగన్‌వాడీ కేంద్రం, ఉపాధిహామీ ఊటకుంటను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ భవనం, ట్రెజరీ కార్యాలయం, బహిరంగ సభ ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్, రంపచోడవరం ఎస్పీ నయీం అస్మీ ఉన్నారు.
 
హెలిప్యాడ్ స్థలం మార్పు
ముఖ్యమంత్రి రాక సందర్భంగా తొలుత నిర్దేశించిన హెలిప్యాడ్ స్థలాన్ని సోమవారం ఆగమేఘాలపై మరోచోటికి మార్చారు. తొలుత శబరి వంతెన సమీపంలో సంత ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీని సమీపంలో పూరిళ్లు ఉండడంతో, హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అవి ఎగిరిపోతాయని భావించిన అధికారులు.. హుటాహుటిన హెలిప్యాడ్‌ను వీఆర్ పురం రహదారిలోని పొలాల్లోకి మార్చారు. అలాగే నిమ్మలగూడెంలో ముఖ్యమంత్రి పరిశీలించాల్సిన ఊటకుంట ప్రదేశానికి భద్రతా కారణాల రీత్యా పోలీసు శాఖ అభ్యంతరం తెలపడంతో, రహదారి పక్కనే మరో ఊటకుంట నిర్మాణాన్ని చేపట్టారు.
 
 
మూడంచెల భద్రత : జిల్లా ఎస్పీ
చింతూరు : ముఖ్యమంత్రి పర్యటనకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన చింతూరులో విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో, భద్రత కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే 8 కంపెనీల గ్రేహౌండ్స్ బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయని, మరో 10 కంపెనీల స్పెషల్‌పార్టీ పోలీసులు కూడా కూంబింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

30 కంపెనీల రోడ్ ఓపెనింగ్ పార్టీలు, సీఆర్పీఎఫ్, ఆర్‌‌మడ్ స్పెషల్‌ఫోర్స్, క్యాట్ పార్టీలతో పాటు వెయ్యి మంది సాయుధ పోలీసులు నిరంతర పహారా కాస్తున్నట్టు తెలిపారు. భద్రాచలం నుంచి కాకినాడ వరకు రహదారులు, అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, హెలిప్యాడ్ నుంచి మూడు కి.మీ. వరకూ అన్ని ప్రాంతాల్లో ఆర్మ్‌డ్ గార్డ్స్‌ను మోహరించామని, కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

ఇటీవల మావోయిస్టు నాయకుడు అనారోగ్యంతో మరణించిన విషయాన్ని ఇతర మావోయిస్టు నాయకులు గ్రహించి, జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. ఆయుధాలు వీడి సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు నాయకులెవరైనా ఉంటే తమను నేరుగా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ సంప్రదిస్తే.. వారికి వైద్యం చేయిస్తామని చెప్పారు. లొంగిపోయిన అనంతరం కేసులు నమోదు చేయకుండా, ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement