సమస్యలుంటే చెప్పండి..
► కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాష్
నార్నూర్(ఆసిఫాబాద్): ‘మీ సమస్యలు ఏవైనా ఉంటే చెప్పండి..’ అంటూ కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాష్ మండలంలోని రాజులగూడ గ్రామంలో గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గురువారం కలెక్టర్ మండలంలోని రాజులగూడ గ్రామంలో డీఆర్డీఏ పీడీ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా.. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారా అని అడిగారు. నిర్మించిన వాటికే నిధులు రాలేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
మన్కాపూర్ చెరువు నుంచి లిప్ట్ ఇరిగేషన్ మంజురు చేయాలని, హస్నాపూర్ నుంచి మండల కేంద్రం వరకు, మండల కేంద్రం నుంచి మలేపూర్ వరకు నిధులు మంజూరైనా రోడ్డు పనులు ప్రారంభించలేదని తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ రోడ్డు పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. గ్రామంలో ఈజీఎస్ ద్వారా వివిధ పనులకు నిధులు మంజూరైనా పనులు ఎందుకు చేయడం లేదని సర్పంచ్ తోడసం నాగోరావును అడిగారు. డబ్బులు లేకపోవడంతో పనులు చేయడం లేదని సర్పంచ్ తెలుపగా.. అడ్వాన్స్ డబ్బులు చెల్లిస్తామని, పనులు చేయాలని సర్పంచ్‌కు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ ముంజం సోము, ఎంపీడీవో శివలాల్‌నాయక్, ఏఈఈ శ్రీనివాస్, గ్రామస్తులు ఉన్నారు.
పీడీ కుటుంబానికి పరామర్శ
డీఆర్‌డీఏ పీడీ రాథోడ్ రాజేశ్వర్ తండ్రి రాథోడ్ నారాయణ్(70) అనారోగ్యంతో వారం రోజుల క్రితం ఆయన స్వగృహంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాష్ గురువారం మండలంలోని రాజులగూడ గ్రామంలో పీడీని పరామర్శించి.. సంప్రదాయ ప్రకారం ఛాయ్(టీ) తాగించారు. తహసీల్దార్ ముంజం సోము, ఎంపీడీవో శివలాల్‌నాయక్, ఈజీఎస్ ఏపీవో రజనీకాంత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనివాస్, గ్రామ పెద్దలు రాథోడ్ నాందేవ్, రాథోడ్ దశరథ్, రాథోడ్ డిగాంబర్, రాథోడ్ శంకర్, జాదవ్ సంజీవ్‌నాయక్ తదితరులు ఉన్నారు.