ముద్రగడ దీక్ష సమంజసం కాదు: సీఎం
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రం కష్టాల్లో ఉంది, అందరూ చేయూతనివ్వాల్సిన తరుణమిది.. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేయడం సమంజసం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సమాజం లో ఇష్టానుసారం ప్రవర్తించకూడదన్నారు. గతంలో ముద్రగడ దీక్ష చేస్తుంటే మరోవైపు రైలు కాల్చారని, రైలేం చేసిందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ సంస్కృతి లేదని, బయటి వ్యక్తులే తగలబెట్టారన్నారు.
కష్టాల్లో ఉన్నాం సమస్యలు సృష్టించడం సరి కాదని ముద్రగడకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. నదుల అనుసంధానంద్వారా మెట్టప్రాంతాలకు సాగునీరివ్వడమే లక్ష్యమని సీఎం చెప్పారు. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు చేర్చి, శ్రీశైలం నీటిని నిల్వచేసి రాయలసీమలోని మెట్టప్రాంతానికి ఉపయోగిస్తామన్నారు.