ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తోన్నజేసీ కృష్ణా రెడ్డి
ఆదిలాబాద్‌అర్బన్: అనునిత్యం సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సత్వర పరిష్కారం చూపుతున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నా రు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలోని సీపీవో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వెళ్లినా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నారని, సమస్య చిన్నదిగా ఉన్నట్లయితే వెంటనే స్పందించి అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నామని అన్నారు. కార్యాలయంలో, గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు.
గ్రీవెన్స్ అర్జీలను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక విభాగం ఉన్నందున ఎక్కడ సమస్య పెండింగ్‌లో ఉంది.. ఎప్పుడు పరిష్కారం అవుతుంది.. అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా అర్జీదారుడి సెల్‌ఫోన్‌కు సందేశం పంపిస్తున్నామని అన్నారు. అనంతరం గ్రీవెన్స్‌కు హాజరైన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఒక్కొక్కరి నుంచి అర్జీ స్వీకరిస్తూ సమస్య పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. కాగా, కలెక్టరేట్ సమావేశ మందిరానికి మరమ్మతులు జరుగుతున్నందున డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం కొనసాగలేదు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి
మేము కొన్నేళ్ల గ్రామంలో నివాసం ఉంటున్నాం. ఇంతవరకు సొంత ఇళ్లు, భూములు లేవు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పించాలి. గుడిసెలు వేసుకొని తడకల మధ్యన జీవనం కొనసాగిస్తున్నాం. అధికారులు స్పందించి రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలి. దళిత బస్తీ కింద భూములు పంపిణీ చేయాలి.
– చప్రాల గ్రామ మహిళలు, మం : బేల
తాగునీటి సౌకర్యం కల్పించాలి
మాది ఆదిలాబాద్ మండలం వాన్వాట్ గ్రామ పంచాయతీ పరిధి మాంగ్లీ గ్రామం. మా గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలి. ఇప్పటికే చెలిమెలు, బావిలోని నీరును తాగుతున్నాం. అవి కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. మళ్లీ తాగునీరు దొరకడం కష్టంగా మారుతుంది. గ్రామంలో మొత్తం 15 కుటుంబాలు నివాసం ఉంటాయి. చెలిమె నీరు తాగడంతో అనారోగ్యానికి గురవుతున్నాం. రోడ్డు, పాఠశాల, అంగన్‌వాడీ సౌకర్యాలు కల్పించాలి.
– మాంగ్లీ గ్రామస్తులు, మం : ఆదిలాబాద్
తాగునీటికి ఇబ్బందులు
మాది మండలంలోని టెంబీ గ్రామ పంచాయతీ పరిధి హర్కాయి, బీమ్లానాయక్ తండా గ్రామాలు. కొన్నేళ్ల నుంచి వేసవి వచ్చిందంటే తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. ఐదు కిలోమీటర్ల నుంచి ఎడ్లబండ్లపై తెచ్చుకుంటున్నాం. గేదెలు, మేకలు, ఆవులు, పశువులు నీటి కోసం అల్లాడుతున్నాయి. పక్కనే ఉన్న అనంతపూర్ గ్రామంలో తాగునీరు ఎక్కువగా ఉంది. పైపుల ద్వారా ఆ గ్రామం నుంచి సరఫరా చేయాలి.
– హర్కాయి, భీమ్లానాయక్‌తండా, మం: బజార్‌హత్నూర్
Comments
Please login to add a commentAdd a comment