ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. జీవనదుల నుంచి నిత్యం వందలాది వాహనాల్లో తరలివెళ్తోంది. గత రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగడంతో ఆయా వాగుల్లో ఇసుక వచ్చి చేరింది. దీంతో పలు వాగుల నుంచి అక్రమార్కులు ఇసుకను తవ్వి తీసుకెళ్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆదిలాబాద్ మండలంలోని లాండసాంగ్వి, అర్లి (బి), శివారు ప్రాంతాంలోని సాత్నాల వాగు, చాందా (టి), భీంసరితో పాటు జైనథ్ మండలంలోని తరోడ, పూసాయి, బేల మండలంలోని పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలు, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ తదితర మండలాల్లోని వాగుల నుంచి ఇసుక రవాణా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని వాగుల్లో కేవలం వర్షాకాలంలో మాత్రమే వాగు ప్రవహిస్తుంది. దీంతో ఆయా వాగు పరీవాహక ప్రాంతంలో రైతులకు సంబంధించి పంట పొలాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే వాగుల నుంచి ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తుండడంతో క్రమేపీ భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం నెలకొంటోంది.
గత కొన్నేళ్లుగా నాన్‌స్టాఫ్‌గా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి సాగు నీటి వనరులు గణనీయంగా తగ్గిపోతున్నాయని రైతులు మొత్తుకుంటున్నా ప్రయోజనం లేకుండాపోయింది. ప్రవాహిస్తున్న వాగుల నుంచి సైతం ఇసుక తోడేస్తున్నారు. అలాగే దాడుల సమయంలో ఉదాహరణకు పది వాహనాలు పట్టుబడితే వాటిలో కొన్ని వదిలేసి నలుగైదు వాహనాలకే జరిమానాలు విధిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆయా గ్రామాల శివారు ప్రాంతాల్లోని ప్రజలు సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించిన పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇసుక రవాణాను అడ్డుకోవడానికి అధికారులు ఎంత మాత్రం కృషి చేయడం లేదన్న విమర్శలు లేకపోలేదు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక రవాణా సాగుతున్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు.
గుంతలమయంగా మారుతున్న రోడ్లు
ఆయా ప్రాంతాల నుంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుండడంతో ట్రాక్టర్లతో రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్రమంగా ఇసుక రవాణా చేయకూడదని వాగుల సమీపంలోని పొలాలు ఉన్న రైతులు చెబుతున్న వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కొంత మందైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారి నుంచి రాయల్టీ రూపంలో ఒక్కొ ట్రాక్టర్‌కు రూ. 400 నుంచి రూ.500 వరకు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే కొంత మంది ఇసుక వ్యాపారులు లక్షలాది రూపాయలకు టెండర్లను దక్కించుకొని మరో రూపంలో రాయల్టీలు వసూలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
ప్రభుత్వ పనుల పేరుతో..
ప్రభుత్వ పనులు జరుగుతున్నాయని చెప్పి చాలా మంది వ్యాపారులు ప్రైవేట్ వారికి ఇసుకను అమ్ముతున్నారు. ఇదిలా ఉండగా దీంతో వ్యాపారులు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా శాఖల అధికారుల దాడులు సైతం అంతంత మాత్రంగానే ఉం డడంతో వారి వ్యాపారం జోరుగా సాగుతోంది.
నీరుగారుతున్న వాల్టా చట్టం
భూగర్భ జల వనరుల సంరక్షణకు తీసుకువచ్చిన వాల్టా చట్టం అమలు నీరుగారుతోంది. వాల్టా చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం మినహా మరే ఇతర చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. కళ్ల ముందే అక్రమ ఇసుక రవాణా సాగుతున్న పట్టించుకుంటున్న పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మూడు ట్రాక్టర్లు ఆరు వేలు అన్న చందంగా సాగుతోంది.
కేసులు నమోదు చేయాలని ఆదేశించాం
జిల్లాలో ఆయా ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నట్లు తన దృష్టికి వచ్చింది. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని ఆయా మండలాల తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చాం. అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. – సంధ్యారాణి, జాయింట్ కలెక్టర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment