ఆదిలాబాద్: జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వాలు.. ఉన్నతాధికారులు మారినా రిమ్స్‌లో పరిస్థితి మారని దుస్థితి నెలకొంది. వైద్యుల కొరతతో సకాలంలో వైద్యమందక.. కనీస సౌకర్యాలు కరువై రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. తాగునీరు కరువై గొంతెండుతోంది. రిమ్స్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం.. రిమ్స్‌లో అవినీతి జరుగుతోందంటూ రాజకీయ పార్టీలు ఆందోళనలు చేయడం.. దానికి అధికారులు మళ్లీ మళ్లీ కౌంటర్‌లు ఇస్తూ రాజకీయం చేయడం పరిపాటిగా మారింది. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ దివ్యదేవరాజన్ రిమ్స్‌పై దృష్టి సారిస్తే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆమె వికారాబాద్ జిల్లాలో పనిచేసిన సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడంలో తనదైన ముద్రవేసినట్లు తెలిసింది.
భర్తీకి నోచుకోని పోస్టులు
రిమ్స్‌ను వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు వైద్యులు, బోధన సిబ్బంది లేకపోవడంతో రోగులు, మెడికోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2008 ఫిబ్రవరి 1న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రిమ్స్‌ను ప్రారంభించారు. 500 పడకల సామర్థ్యం, అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేకు కృషి చేశారు. ఆస్పత్రి ప్రారంభమై తొమ్మిదేళ్లు గడుస్తున్నా అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. రిమ్స్‌లో 151 పోస్టులకు గాను 91 మంది వైద్యులు ఉన్నారు. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్‌లు 21కి గాను ఐదుగురే పనిచేస్తున్నారు. 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 30కి గాను 20 మంది ఉండగా 10 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 41 మందికి గాను 26 మంది ఉన్నారు. 15 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 59కి గాను 40 మంది ఉండగా, 19 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం వైద్యశాఖలో పోస్టులు భర్తీ చేస్తున్నా రిమ్స్‌లో భర్తీ చేయడం లేదు. ఫలితంగా వైద్యుల కొరతతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. మరోవైపు ఉన్న వైద్యులు కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ రిమ్స్‌కు వచ్చే రోగులను పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.
తాగునీటికీ ఇబ్బందే..
రిమ్స్ ఆస్పత్రిలో సౌకర్యాలు కరువయ్యాయి. 500 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి నిత్యం 1500 మంది వరకు రోగులు వస్తుంటారు. ప్రతీ రోజు నాలుగు లక్షల లీటర్ల నీరు అవసరం కాగా.. ప్రస్తుతం మూడు బోర్ల ద్వారా ట్యాంకులోకి నీరెక్కిస్తున్నారు. రెండు లక్షల లీటర్లు మాత్రమే అందుతున్నాయి. మున్సిపాల్టీ నుంచి ట్యాంకర్ తెప్పిస్తున్నా సరిపోవడం లేదు. మరుగుదొడ్లకు నీటి సరఫరా లేక అపరిశుభ్రంగా మారడం, లేదంటే తాళాలు వేయడం జరుగుతోంది. ఏ ఒక్క వార్డులో కూడా తాగునీటి కుళాయిలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడంతస్తులో ఉన్న రోగులు నిత్యం నీటి కోసం మెట్లు దిగుతూ.. ఎక్కుతూ రావాల్సిందే. అది కూడా రిమ్స్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన తాగునీరే దిక్కవుతోంది. నీటి సరఫరా లేక కొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు నిలిచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సీజనల్ వ్యాధుల సమయంలో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఒక్కోపడకపై ఇద్దరేసి రోగులకు చికిత్స అందించాల్సి వస్తోంది. రిమ్స్‌తోపాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నీటి కొరత ఏర్పడుతోంది. ఈ రెండింటికి కలిపి సుమారు 10 లక్షల లీటర్ల నీటి అవసరం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిషన్ భగీరథను రిమ్స్‌కు అనుసంధానం చేస్తే బాగుటుందని భావిస్తున్నారు.
రెఫర్‌లకే ప్రాధాన్యత..
అత్యవసర సమయంలో వైద్యం అందడం లేదు. మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. గత నాలుగేళ్లలో 3500కు పైగా కేసులను రెఫర్ చేశారు. రిమ్స్‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని పేదలు, గిరిజనులే అధికంగా వస్తారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, స్నేక్‌బైట్, ఆత్మహత్యాయత్నం, తదితర తీవ్రమైన వ్యాధులతో వచ్చే వారికి వైద్యం అందక మత్యువాత పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరికి చికిత్స చేయలేమంటూ చేతులెత్తేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రిమ్స్ అధికారుల పర్యవేక్షణలోపం.. అవసరమైన వైద్య సేవలు అందబాటులో ఉంచడంలో నిర్లక్ష్యం చేయడంతో రిమ్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. చిన్నచిన్న కేసులు సైతం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవర సమయంలో చికిత్స అందించే ట్రామా కేర్ సెంటర్‌లో ప్రత్యేక వైద్య నిపుణులు, టెక్నీషియన్‌లు లేకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన వారిని రెఫర్ చేస్తున్నారు.
రాజకీయంగా మారుతున్న పరిణామాలు..
ఆస్పత్రిలో రోగులకు వైద్య అందకపోవడం, అవినీతి ఆరోపణలు రావడంతో ఇటీవల రాజకీయ పార్టీలు ఆందోళనలు చేశాయి. దీనికి రిమ్స్ అధికారులు కౌంటర్ ఇస్తుండడంతో రాజకీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారి పోస్టు అనర్హుడికి కట్టబెట్టారంటూ సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కొత్తగా వచ్చిన కలెక్టర్ రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి, వైద్యుల పోస్టుల భర్తీ, కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు దృష్టి సారిస్తే పేదలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment