ఆదిలాబాద్: రిమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సిబ్బంది సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. ‘కలెక్టరమ్మ.. రిమ్స్‌ను చూడమ్మ’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించారు. ఆస్పత్రిలో సమస్యలు, కేసుల రెఫర్, వైద్యుల పోస్టుల ఖాళీ, ప్రైవేటు వైద్యంపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్దాస్పత్రి రిమ్స్‌ను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. మూడు గంటలపాటు ఆస్పత్రిలో పర్యటించి రోగుల బాగోగులు, వైద్య సేవలపై ఆరా తీశారు.
పరిశీలన సాగిందిలా..
కలెక్టర్ దివ్యదేవరాజన్ ముందుగా రిమ్స్ వైద్య కళాశాలలో అధికారులతో సమావేశమై గంటపాటు గంటపాటు ఆస్పత్రి పరిస్థితులపై చర్చించారు. పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు, కాంట్రాక్టు టెండర్ల నిర్వహణపై చర్చ సాగింది. అనంతరం రిమ్స్ అత్యవసర విభాగం, రక్త పరీక్షల కేంద్రాలను పరిశీలించారు. రక్త పరీక్షలు యంత్రాల ద్వారా చేస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్లడ్‌బ్యాంకుకు వెళ్లి బ్లడ్‌స్టోరేజీని పరిశీలించారు. ఐసీయూలో రోగులతో మాట్లాడారు. సరైన వైద్యం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ట్రామాకేర్ యూనిట్‌ని సందర్శించి అక్కడ ఏయే రోగులకు చికిత్స అందిస్తున్నారో తెలుసుకున్నారు. రేడియాలజీ విభాగాన్ని పరిశీలించి డాక్టర్ కళ్యాణ్‌రెడ్డిని స్కానింగ్ పరీక్షల వివరాలు అడిగారు. ఏయే సమయంలో ఎక్స్‌రే, స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారో తెలుసుకున్నారు. మెటర్నిటీ వార్డులో(ప్రసూతివార్డు) బాలింతలతో మాట్లాడారు. అప్పుడే పుట్టిన పసికందులను చూసి వారి తల్లిబిడ్డ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ వార్డు, మేల్‌మెడికల్ వార్డు, కంటి విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
గిరిజనుల రక్తహీనతపై చలించిన కలెక్టర్..
మహిళల వార్డులో పర్యటించిన కలెక్టర్ అక్కడ చికిత్స పొందుతున్న గిరిజన మహిళల రక్తహీనతపై చలించిపోయారు. ఓ మహిళకు 2.5 గ్రామాలు రక్తం ఉందని సిబ్బంది చెప్పడంతో కలెక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సాధారణంగా 7 గ్రాముల రక్తం ఉంటేనే ఆరోగ్యం దెబ్బతింటుంది.. అలాంటిది ఇంత తక్కువ రక్తం ఉండడమేంటని అడిగారు. ఆమెతోపాటు ఆ వార్డులో చికిత్స పొందుతున్న పాఠశాల విద్యార్థిని సైతం రక్తహీనతతో బాధపడుతుండగా ఆమెను కలెక్టర్ పలుకరించారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రక్తహీనతతో వస్తుంటారని రిమ్స్ వైద్యులు కలెక్టర్ తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు రక్తం అందుబాటులో ఉంచాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ రిమ్స్‌లో తనిఖీలు చేస్తుండగా రాంనగర్‌కు చెందిన చంద్రారెడ్డి అనే వృద్ధుడు తనకు పింఛన్ కోసం వైద్యుడి సంతకం కోసం నాలుగు రోజులుగా రిమ్స్‌లో తిరుగుతున్నానంటూ కలెక్టర్‌కు విన్నవించగా, వెంటనే స్పందించిన కలెక్టర్ పింఛన్ కోసం ఎంపీడీవోను కలువాలని తెలిపి, వృద్ధుడి పూర్తి వివరాలు నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు తెలుపాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు.
ప్రైవేటు వైద్యంపై విచారణ
రిమ్స్ వార్డులో పరిశీలన అనంతరం కలెక్టర్ దివ్యదేవరాజన్ మీడియాతో మాట్లాడారు. రిమ్స్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశ వివరాలు తెలియజేశారు. రిమ్స్‌లో పనిచేస్తున్న అన్ని విభాగాల సిబ్బందితో వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. రిమ్స్‌కు మన జిల్లానే కాకుండా మహారాష్ట్ర నుంచి రోగులు వస్తున్నారని వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లు నడుపుతుండడంపై విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. త్వరలో పారిశుధ్య, సెక్యూరిటీ గార్డులకు సంబంధించి కాంట్రాక్టు కోసం టెండర్‌లు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలో పారిశుధ్యం, వైద్య పరికరాలు, వైద్యుల పోస్టుల భర్తీ, కార్మికుల సమస్యలపై చర్చించినట్లు వెల్లడించారు. ఔట్‌సోరి్సంగ్ టెండర్ కోసం ఎంపిక కమిటీతో మరోసారి చర్చించి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజీవ్‌రాజ్, రిమ్స్ ఇచార్జి డైరెక్టర్ అశోక్, వైద్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment