Devarajan
-
28న పల్స్ పోలియో
ఆదిలాబాద్‌అర్బన్: ఈ నెల 28న పల్స్ పోలియో నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివ్యదేవరాజన్ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు వేయాలన్నారు. శనివారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 70,895 మంది ఐదేళ్లలోపు చిన్నారులున్నట్లు అంచనా వేశామన్నారు. 80 పట్టణ, 316 గ్రామాల్లో, 443 గిరిజన ప్రాంతాల్లో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. 113 మోబైల్, 17 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా పోలియో చుక్కలు వేస్తామని అన్నారు. 3356 మంది టీం సభ్యులతో, 92 మంది సూపర్వైజర్లతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజీవ్ రాజ్, ఆర్డీవో సూర్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
రిమ్స్‌పై ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్: రిమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సిబ్బంది సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. ‘కలెక్టరమ్మ.. రిమ్స్‌ను చూడమ్మ’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించారు. ఆస్పత్రిలో సమస్యలు, కేసుల రెఫర్, వైద్యుల పోస్టుల ఖాళీ, ప్రైవేటు వైద్యంపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్దాస్పత్రి రిమ్స్‌ను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. మూడు గంటలపాటు ఆస్పత్రిలో పర్యటించి రోగుల బాగోగులు, వైద్య సేవలపై ఆరా తీశారు. పరిశీలన సాగిందిలా.. కలెక్టర్ దివ్యదేవరాజన్ ముందుగా రిమ్స్ వైద్య కళాశాలలో అధికారులతో సమావేశమై గంటపాటు గంటపాటు ఆస్పత్రి పరిస్థితులపై చర్చించారు. పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు, కాంట్రాక్టు టెండర్ల నిర్వహణపై చర్చ సాగింది. అనంతరం రిమ్స్ అత్యవసర విభాగం, రక్త పరీక్షల కేంద్రాలను పరిశీలించారు. రక్త పరీక్షలు యంత్రాల ద్వారా చేస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్లడ్‌బ్యాంకుకు వెళ్లి బ్లడ్స్టోరేజీని పరిశీలించారు. ఐసీయూలో రోగులతో మాట్లాడారు. సరైన వైద్యం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ట్రామాకేర్ యూనిట్‌ని సందర్శించి అక్కడ ఏయే రోగులకు చికిత్స అందిస్తున్నారో తెలుసుకున్నారు. రేడియాలజీ విభాగాన్ని పరిశీలించి డాక్టర్ కళ్యాణ్‌రెడ్డిని స్కానింగ్ పరీక్షల వివరాలు అడిగారు. ఏయే సమయంలో ఎక్స్‌రే, స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారో తెలుసుకున్నారు. మెటర్నిటీ వార్డులో(ప్రసూతివార్డు) బాలింతలతో మాట్లాడారు. అప్పుడే పుట్టిన పసికందులను చూసి వారి తల్లిబిడ్డ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ వార్డు, మేల్మెడికల్ వార్డు, కంటి విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గిరిజనుల రక్తహీనతపై చలించిన కలెక్టర్.. మహిళల వార్డులో పర్యటించిన కలెక్టర్ అక్కడ చికిత్స పొందుతున్న గిరిజన మహిళల రక్తహీనతపై చలించిపోయారు. ఓ మహిళకు 2.5 గ్రామాలు రక్తం ఉందని సిబ్బంది చెప్పడంతో కలెక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సాధారణంగా 7 గ్రాముల రక్తం ఉంటేనే ఆరోగ్యం దెబ్బతింటుంది.. అలాంటిది ఇంత తక్కువ రక్తం ఉండడమేంటని అడిగారు. ఆమెతోపాటు ఆ వార్డులో చికిత్స పొందుతున్న పాఠశాల విద్యార్థిని సైతం రక్తహీనతతో బాధపడుతుండగా ఆమెను కలెక్టర్ పలుకరించారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రక్తహీనతతో వస్తుంటారని రిమ్స్ వైద్యులు కలెక్టర్ తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు రక్తం అందుబాటులో ఉంచాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ రిమ్స్‌లో తనిఖీలు చేస్తుండగా రాంనగర్‌కు చెందిన చంద్రారెడ్డి అనే వృద్ధుడు తనకు పింఛన్ కోసం వైద్యుడి సంతకం కోసం నాలుగు రోజులుగా రిమ్స్‌లో తిరుగుతున్నానంటూ కలెక్టర్‌కు విన్నవించగా, వెంటనే స్పందించిన కలెక్టర్ పింఛన్ కోసం ఎంపీడీవోను కలువాలని తెలిపి, వృద్ధుడి పూర్తి వివరాలు నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు తెలుపాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు. ప్రైవేటు వైద్యంపై విచారణ రిమ్స్ వార్డులో పరిశీలన అనంతరం కలెక్టర్ దివ్యదేవరాజన్ మీడియాతో మాట్లాడారు. రిమ్స్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశ వివరాలు తెలియజేశారు. రిమ్స్‌లో పనిచేస్తున్న అన్ని విభాగాల సిబ్బందితో వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. రిమ్స్‌కు మన జిల్లానే కాకుండా మహారాష్ట్ర నుంచి రోగులు వస్తున్నారని వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లు నడుపుతుండడంపై విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. త్వరలో పారిశుధ్య, సెక్యూరిటీ గార్డులకు సంబంధించి కాంట్రాక్టు కోసం టెండర్లు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలో పారిశుధ్యం, వైద్య పరికరాలు, వైద్యుల పోస్టుల భర్తీ, కార్మికుల సమస్యలపై చర్చించినట్లు వెల్లడించారు. ఔట్‌సోరి్సంగ్ టెండర్ కోసం ఎంపిక కమిటీతో మరోసారి చర్చించి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజీవ్‌రాజ్, రిమ్స్ ఇచార్జి డైరెక్టర్ అశోక్, వైద్యులు ఉన్నారు. -
కలెక్టరమ్మ.. రిమ్స్‌ను చూడమ్మ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వాలు.. ఉన్నతాధికారులు మారినా రిమ్స్‌లో పరిస్థితి మారని దుస్థితి నెలకొంది. వైద్యుల కొరతతో సకాలంలో వైద్యమందక.. కనీస సౌకర్యాలు కరువై రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. తాగునీరు కరువై గొంతెండుతోంది. రిమ్స్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం.. రిమ్స్‌లో అవినీతి జరుగుతోందంటూ రాజకీయ పార్టీలు ఆందోళనలు చేయడం.. దానికి అధికారులు మళ్లీ మళ్లీ కౌంటర్లు ఇస్తూ రాజకీయం చేయడం పరిపాటిగా మారింది. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ దివ్యదేవరాజన్ రిమ్స్‌పై దృష్టి సారిస్తే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆమె వికారాబాద్ జిల్లాలో పనిచేసిన సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడంలో తనదైన ముద్రవేసినట్లు తెలిసింది. భర్తీకి నోచుకోని పోస్టులు రిమ్స్‌ను వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు వైద్యులు, బోధన సిబ్బంది లేకపోవడంతో రోగులు, మెడికోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2008 ఫిబ్రవరి 1న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రిమ్స్‌ను ప్రారంభించారు. 500 పడకల సామర్థ్యం, అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేకు కృషి చేశారు. ఆస్పత్రి ప్రారంభమై తొమ్మిదేళ్లు గడుస్తున్నా అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. రిమ్స్‌లో 151 పోస్టులకు గాను 91 మంది వైద్యులు ఉన్నారు. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్లు 21కి గాను ఐదుగురే పనిచేస్తున్నారు. 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 30కి గాను 20 మంది ఉండగా 10 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 41 మందికి గాను 26 మంది ఉన్నారు. 15 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 59కి గాను 40 మంది ఉండగా, 19 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం వైద్యశాఖలో పోస్టులు భర్తీ చేస్తున్నా రిమ్స్‌లో భర్తీ చేయడం లేదు. ఫలితంగా వైద్యుల కొరతతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. మరోవైపు ఉన్న వైద్యులు కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ రిమ్స్‌కు వచ్చే రోగులను పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. తాగునీటికీ ఇబ్బందే.. రిమ్స్ ఆస్పత్రిలో సౌకర్యాలు కరువయ్యాయి. 500 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి నిత్యం 1500 మంది వరకు రోగులు వస్తుంటారు. ప్రతీ రోజు నాలుగు లక్షల లీటర్ల నీరు అవసరం కాగా.. ప్రస్తుతం మూడు బోర్ల ద్వారా ట్యాంకులోకి నీరెక్కిస్తున్నారు. రెండు లక్షల లీటర్లు మాత్రమే అందుతున్నాయి. మున్సిపాల్టీ నుంచి ట్యాంకర్ తెప్పిస్తున్నా సరిపోవడం లేదు. మరుగుదొడ్లకు నీటి సరఫరా లేక అపరిశుభ్రంగా మారడం, లేదంటే తాళాలు వేయడం జరుగుతోంది. ఏ ఒక్క వార్డులో కూడా తాగునీటి కుళాయిలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడంతస్తులో ఉన్న రోగులు నిత్యం నీటి కోసం మెట్లు దిగుతూ.. ఎక్కుతూ రావాల్సిందే. అది కూడా రిమ్స్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన తాగునీరే దిక్కవుతోంది. నీటి సరఫరా లేక కొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు నిలిచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సీజనల్ వ్యాధుల సమయంలో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఒక్కోపడకపై ఇద్దరేసి రోగులకు చికిత్స అందించాల్సి వస్తోంది. రిమ్స్‌తోపాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నీటి కొరత ఏర్పడుతోంది. ఈ రెండింటికి కలిపి సుమారు 10 లక్షల లీటర్ల నీటి అవసరం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిషన్ భగీరథను రిమ్స్‌కు అనుసంధానం చేస్తే బాగుటుందని భావిస్తున్నారు. రెఫర్‌లకే ప్రాధాన్యత.. అత్యవసర సమయంలో వైద్యం అందడం లేదు. మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. గత నాలుగేళ్లలో 3500కు పైగా కేసులను రెఫర్ చేశారు. రిమ్స్‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని పేదలు, గిరిజనులే అధికంగా వస్తారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, స్నేక్‌బైట్, ఆత్మహత్యాయత్నం, తదితర తీవ్రమైన వ్యాధులతో వచ్చే వారికి వైద్యం అందక మత్యువాత పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరికి చికిత్స చేయలేమంటూ చేతులెత్తేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రిమ్స్ అధికారుల పర్యవేక్షణలోపం.. అవసరమైన వైద్య సేవలు అందబాటులో ఉంచడంలో నిర్లక్ష్యం చేయడంతో రిమ్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. చిన్నచిన్న కేసులు సైతం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవర సమయంలో చికిత్స అందించే ట్రామా కేర్ సెంటర్లో ప్రత్యేక వైద్య నిపుణులు, టెక్నీషియన్లు లేకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన వారిని రెఫర్ చేస్తున్నారు. రాజకీయంగా మారుతున్న పరిణామాలు.. ఆస్పత్రిలో రోగులకు వైద్య అందకపోవడం, అవినీతి ఆరోపణలు రావడంతో ఇటీవల రాజకీయ పార్టీలు ఆందోళనలు చేశాయి. దీనికి రిమ్స్ అధికారులు కౌంటర్ ఇస్తుండడంతో రాజకీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారి పోస్టు అనర్హుడికి కట్టబెట్టారంటూ సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కొత్తగా వచ్చిన కలెక్టర్ రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి, వైద్యుల పోస్టుల భర్తీ, కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు దృష్టి సారిస్తే పేదలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుంది. -
'టికెట్ ధరలను నియంత్రించాలి'
సాక్షి, చెన్నై: కొత్త చిత్రాల విడుదల సమయాల్లో థియేటర్ల యాజమాన్యాలు అధిక ధరలకు టిక్కెట్లను విక్రయించడాన్ని నియంత్రించాలని చెంబియత్తు గ్రామానికి చెందిన దేవరాజన్ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రాష్ట్రంలో కొత్త చిత్రాల విడుదల సమయంలో థియేటర్ల యాజమాన్యం తొలి ఐదు రోజులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇది పెద్ద హీరోల చిత్రాలకు మరింత ఎక్కువన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2009లో థియేటర్ల టిక్కెట్ ధరల పట్టికను నిర్ణయించిందని, ఆ ప్రకారం ఏసీ, ఇతర సౌకర్యాలు ఉన్న థియేటర్లలో రూ. 10 నుంచి 120 వరకూ టిక్కెట్ల ధరను, అలాంటి సౌకర్యాలు లేని థియేటర్లలో టికెట్ల ధర రూ.5 నుంచి 50 గా నిర్ణయించిందన్నారు. అయితే ఇందుకు భిన్నంగా కొత్త చిత్రాల విడుదల సమయాల్లో టిక్కెట్ల ధరలు రూ. 200 నుంచి 300 వరకు ఉంటున్నాయని తెలిపారు. ఈ విధానాన్ని అడ్డుకోవాలని గత 17 నుంచి 22 తేదీ వరకూ ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి, ఆదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించ లేదన్నారు. ఇటీవల విడుదలైన వివేకం చిత్రాన్ని చూడడానికి వచ్చే ప్రేక్షకుల నుంచి టిక్కెట్ ధరను అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా వసూలు చేస్తున్న థియేటర్ల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా వాటి నుంచి రోజుకు రూ. లక్ష చొప్పున అపరాధరుసుం వసూలు చేయాలన్నారు. అందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రత్యేక కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిష¯ŒS సోమవారం విచారించిన న్యాయమూర్తి ఎం.దురైస్వామి బదులివ్వాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేశారు. -
సినిమా టికెట్ల ధరలపై విధివిధానాలేమిటి?
ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న తమిళసినిమా: సినిమా టికెట్ల ధర నిర్ణయంలో అమలు పరుస్తున్న విధి విధానాలేమిటన్నది రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. దేవరాజన్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ సినిమా టికెట్ల ధరలను చట్ట ప్రకారం మహానగరాల్లో అత్యధికంగా 50 రూపాయలు, నగర ప్రాంతాల్లో 40 రూపాయలు, గ్రామపంచాయతీల్లో 25 రూపాయలుగా నిర్ణంచబడిందన్నారు. అలాంటిది వాస్తవంగా ఆ ధరలకు రెండింతలకు పైగా థియేటర్లలో టికెట్ల ధరలను వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. సమీపకాలంలో తాను ఒక సినిమాను చూశానని అక్కడ టికెట్ ధరను 120 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు.ఈ విషయమై ఆ థియేటర్ నిర్వాహకులను ప్రశ్నించగా వారు సరైన బదులు ఇవ్వలేదన్నారు.ప్రభుత్వానికి పిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు.కాబట్టి తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.ఆ పిటీషన్ చెన్నై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సంజయ్‌కిషన్ కౌల్, పుష్పా సత్యనారాయణల సమక్షంలో బుధవారం విచారణకు వచ్చింది.సినిమా టికెట్ ధరల పట్టిక విషయమై అవలంబిస్తున్న విధి విధానాలేమిటన్నది రెండు వారాల్లో హైకోర్టుకు వివరించాలని రాష్ట్రప్రభుత్వానికి న్యాయమూర్తులు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.