అవి సీఎం చెప్పిన టెండర్లు | They told the chief tenders... | Sakshi
Sakshi News home page

అవి సీఎం చెప్పిన టెండర్లు

Published Fri, Jun 24 2016 2:33 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అవి సీఎం చెప్పిన టెండర్లు - Sakshi

అవి సీఎం చెప్పిన టెండర్లు

* రద్దు చేయడానికి వీల్లేదు  
* ఆ అవినీతి టెండర్లు రద్దు చేయాల్సిందే
* జెన్‌కో బోర్డు భేటీలో అధికారుల వాడివేడి చర్చ

సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టుల టెండర్ల (బీవోసీ)లో భారీ ఎత్తున అవినీతి ఉన్నందువల్ల ఆ కాంట్రాక్టులను రద్దు చేయాలని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ చెప్పినా.. దానిని ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్ వ్యతిరేకించారు. ఈ కాంట్రాక్టుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ఆసక్తి ఉన్నందువల్ల రద్దు చేయడం సరికాదంటూ ఆయన టెండర్ల ప్రక్రియను సమర్థించారు.

అజయ్‌జైన్ నేతృత్వంలో గురువారం జరిగిన ఏపీ జెన్‌కో బోర్డు మీటింగ్‌లో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. విజయానంద్ వాదనతో బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయారు. అవినీతి ఆరోపణలు వచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాల్సిందేనని, టెండర్ అర్హత నిబంధనలను మార్చాలని అజయ్‌జైన్ గట్టిగా అభిప్రాయపడినా..  విజయానంద్ మాత్రం సీఎం అవినీతిని సమర్థించడాన్ని వారు తప్పుపట్టినట్లు తెలిసింది. విజయానంద్ తీరుపై జైన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

టెండర్లలో దాదాపు రూ. 2,860 కోట్లు ఎక్కువ చెల్లింపులు జరుగుతోందన్న విమర్శలొచ్చాయని సమావేశంలో జైన్ ప్రస్తావించారు. ఎల్-1గా నిలిచిన బీజీఆర్, టాటాతో రెండు దఫాలు చర్చలు జరిపామని, వారు కొంతమేర తగ్గించుకునేందుకు ఒప్పుకున్నారని విజయానంద్ సమావేశం దృష్టికి తెచ్చారు. కొద్దిగా తగ్గించుకోవడంపై బోర్డు సభ్యులు ప్రశ్నించడంతో విజయానంద్  మనస్తాపానికి గురైనట్టు సమాచారం.అవినీతి కాంట్రాక్టులైనా సీఎం చెప్పబట్టే ముందుకెళ్లామని, దీన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని సమావేశం తర్వాత ఎండీ.. తన వెంటే ఉన్న ఫైనాన్స్ డెరైక్టర్‌తో చెప్పినట్టు తెలిసింది.

ఏపీ జెన్‌కో కార్యాలయం విజయవాడకు తరలింపుపై  చర్చకు వచ్చింది. టీడీపీకి చెందిన ఓ నేత భవనాన్ని చదరపు అడుగు రూ. 70కి ఇవ్వడానికి ముందుకొచ్చారని, ఆరు నెలల్లో అన్ని వసతులు కల్పించేందుకు హామీ ఇచ్చారని ఎండీ విజయానంద్ అన్నట్టు తెలిసింది. దీనికి బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  
 
వీటికి టెండర్లు..: కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు థర్మల్ ప్రాజెక్టులను నెలకొల్పాలని ఏపీ జెన్‌కో నిర్ణయించింది. దీనికోసం టెండర్లు పిలిచింది. కొన్ని కంపెనీలు మాత్రమే అర్హత పొందేలా నిబంధనలు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు ఇతర రాష్ట్రాల్లో తాము కట్టిన ప్రాజెక్టుల కన్నా రూ. 2,860 కోట్ల మేర ఎక్కువ కోట్ చేశాయి. ఇందులో ప్రభుత్వాధినేతకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే విమర్శలొచ్చాయి. ఈ కుంభకోణాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement