BOC
-
న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్ సుంకాన్ని తొలగించండి
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రింట్ మీడియాను ఆదుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఓవైపు ప్రకటనల ఆదాయాలు కోల్పోయి, మరోవైపు ముడి వస్తువుల వ్యయాలు.. న్యూస్‌ప్రింట్ దిగుమతి సుంకాలు భారీగా పెరిగిపోయి పత్రికా రంగం కుదేలవుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. న్యూస్‌ప్రింట్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని, న్యూస్‌పేపర్ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని ఐఎన్ఎస్ కోరింది. అలాగే, బీవోసీ ప్రకటన రేటును 50 శాతం, ప్రింట్ మీడియాకు బడ్జెట్‌ను 100% పెంచాలని విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన బకాయిలన్నీ తక్షణమే సెటిల్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి రవి మిట్టల్‌కు ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ మేరకు లేఖ రాశారు. ‘ముద్రణ వ్యయాలు అధికంగా ఉండే పత్రికలకు ప్రకటనల ఆదాయాలే కీలకం. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో పలు వ్యాపారాలు మూతబడి, ప్రకటనలు లేకపోవడంతో ఆదాయవనరు కోల్పోయినట్లయింది’ అని గుప్తా వివరించారు. చాలా మటుకు చిన్న, మధ్య స్థాయి పత్రికలు ఇప్పటికే ప్రచురణ నిలిపివేశాయని, మిగతావి పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇవి కూడా కుప్పకూలిన పక్షంలో దేశీ న్యూస్‌ప్రింట్ తయారీ పరిశ్రమపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదన్నారు. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే వారితో పాటు డెలివరీ బాయ్స్ దాకా చాలా మంది ఉపాధి కోల్పోయే ముప్పు ఉందని గుప్తా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా కోలుకునేందుకు తక్షణ తోడ్పాటు చర్యలు తీసుకోవాలని కోరారు. -
9 కోట్ల డాలర్లు చెల్లించండి: బ్రిటన్ కోర్టు
లండన్/సింగపూర్: భారత్‌లో బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు మరో సమస్య ఎదురైంది. కింగ్ ఫిషర్ కోసం విమానాలను అద్దెకు తీసుకున్నందుకుగానూ సింగపూర్‌కు చెందిన బీవోసీ ఏవియేషన్ సంస్థకు 9 కోట్ల అమెరికన్ డాలర్లు చెల్లించాల్సిందిగా యూకేలోని ఓ కోర్టు ఆదేశించింది. మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుకు సంబంధించి వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో తుది విచారణ వచ్చే నెల 16న ప్రారంభం కానుంది. మేలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. -
అవి సీఎం చెప్పిన టెండర్లు
* రద్దు చేయడానికి వీల్లేదు * ఆ అవినీతి టెండర్లు రద్దు చేయాల్సిందే * జెన్కో బోర్డు భేటీలో అధికారుల వాడివేడి చర్చ సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టుల టెండర్ల (బీవోసీ)లో భారీ ఎత్తున అవినీతి ఉన్నందువల్ల ఆ కాంట్రాక్టులను రద్దు చేయాలని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ చెప్పినా.. దానిని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ వ్యతిరేకించారు. ఈ కాంట్రాక్టుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ఆసక్తి ఉన్నందువల్ల రద్దు చేయడం సరికాదంటూ ఆయన టెండర్ల ప్రక్రియను సమర్థించారు. అజయ్‌జైన్ నేతృత్వంలో గురువారం జరిగిన ఏపీ జెన్కో బోర్డు మీటింగ్‌లో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. విజయానంద్ వాదనతో బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయారు. అవినీతి ఆరోపణలు వచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాల్సిందేనని, టెండర్ అర్హత నిబంధనలను మార్చాలని అజయ్‌జైన్ గట్టిగా అభిప్రాయపడినా.. విజయానంద్ మాత్రం సీఎం అవినీతిని సమర్థించడాన్ని వారు తప్పుపట్టినట్లు తెలిసింది. విజయానంద్ తీరుపై జైన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. టెండర్లలో దాదాపు రూ. 2,860 కోట్లు ఎక్కువ చెల్లింపులు జరుగుతోందన్న విమర్శలొచ్చాయని సమావేశంలో జైన్ ప్రస్తావించారు. ఎల్-1గా నిలిచిన బీజీఆర్, టాటాతో రెండు దఫాలు చర్చలు జరిపామని, వారు కొంతమేర తగ్గించుకునేందుకు ఒప్పుకున్నారని విజయానంద్ సమావేశం దృష్టికి తెచ్చారు. కొద్దిగా తగ్గించుకోవడంపై బోర్డు సభ్యులు ప్రశ్నించడంతో విజయానంద్ మనస్తాపానికి గురైనట్టు సమాచారం.అవినీతి కాంట్రాక్టులైనా సీఎం చెప్పబట్టే ముందుకెళ్లామని, దీన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని సమావేశం తర్వాత ఎండీ.. తన వెంటే ఉన్న ఫైనాన్స్ డెరైక్టర్‌తో చెప్పినట్టు తెలిసింది. ఏపీ జెన్కో కార్యాలయం విజయవాడకు తరలింపుపై చర్చకు వచ్చింది. టీడీపీకి చెందిన ఓ నేత భవనాన్ని చదరపు అడుగు రూ. 70కి ఇవ్వడానికి ముందుకొచ్చారని, ఆరు నెలల్లో అన్ని వసతులు కల్పించేందుకు హామీ ఇచ్చారని ఎండీ విజయానంద్ అన్నట్టు తెలిసింది. దీనికి బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటికి టెండర్లు..: కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు థర్మల్ ప్రాజెక్టులను నెలకొల్పాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. దీనికోసం టెండర్లు పిలిచింది. కొన్ని కంపెనీలు మాత్రమే అర్హత పొందేలా నిబంధనలు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు ఇతర రాష్ట్రాల్లో తాము కట్టిన ప్రాజెక్టుల కన్నా రూ. 2,860 కోట్ల మేర ఎక్కువ కోట్ చేశాయి. ఇందులో ప్రభుత్వాధినేతకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే విమర్శలొచ్చాయి. ఈ కుంభకోణాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.