![Relief Measures for Newspaper Industry asked from the Govt - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/10/PAPER-MILLS1.jpg.webp?itok=5mhu8gC-)
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రింట్ మీడియాను ఆదుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఓవైపు ప్రకటనల ఆదాయాలు కోల్పోయి, మరోవైపు ముడి వస్తువుల వ్యయాలు.. న్యూస్‌ప్రింట్ దిగుమతి సుంకాలు భారీగా పెరిగిపోయి పత్రికా రంగం కుదేలవుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. న్యూస్‌ప్రింట్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని, న్యూస్‌పేపర్ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని ఐఎన్‌ఎస్ కోరింది. అలాగే, బీవోసీ ప్రకటన రేటును 50 శాతం, ప్రింట్ మీడియాకు బడ్జెట్‌ను 100% పెంచాలని విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన బకాయిలన్నీ తక్షణమే సెటిల్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి రవి మిట్టల్‌కు ఐఎన్‌ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ మేరకు లేఖ రాశారు.
‘ముద్రణ వ్యయాలు అధికంగా ఉండే పత్రికలకు ప్రకటనల ఆదాయాలే కీలకం. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో పలు వ్యాపారాలు మూతబడి, ప్రకటనలు లేకపోవడంతో ఆదాయవనరు కోల్పోయినట్లయింది’ అని గుప్తా వివరించారు. చాలా మటుకు చిన్న, మధ్య స్థాయి పత్రికలు ఇప్పటికే ప్రచురణ నిలిపివేశాయని, మిగతావి పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇవి కూడా కుప్పకూలిన పక్షంలో దేశీ న్యూస్‌ప్రింట్ తయారీ పరిశ్రమపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదన్నారు. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే వారితో పాటు డెలివరీ బాయ్స్ దాకా చాలా మంది ఉపాధి కోల్పోయే ముప్పు ఉందని గుప్తా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా కోలుకునేందుకు తక్షణ తోడ్పాటు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment