Indian Newspaper Society
-
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయామ్స్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: ‘ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ’ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్ కుమార్ (మాతృభూమి) ఎన్నికయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఐఎన్ఎస్ బిల్డింగ్‌లో 85వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో 2024–25 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్ కుమార్‌ను ఎన్నుకోగా.. వివేక్ గుప్తా డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, కరణ్ రాజేంద్ర దర్దా (లోక్మత్) ఉపాధ్యక్షుడిగా, తన్మయ్ మహేశ్వరీ (అమర్ ఉజాలా) కోశాధికారిగా, మేరీపాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ తెలిపింది. కేఆర్పీ రెడ్డి (సాక్షి), వివేక్ గొయెంకా (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్), అతిదేవ్ సర్కార్ (టెలిగ్రాఫ్), మహేంద్ర మోహన్ గుప్తా (దైనిక్ జాగరణ్), ఐ.వెంకట్ (ఈనాడు), జయంత్ మమెన్ మాథ్యూ (మలయాళ మనోరమ)లు ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. -
ఐఎన్ఎస్ అధ్యక్షునిగా రాకేశ్ శర్మ
న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్)కి 2023–24 కాలానికి నూతన అధ్యక్షునిగా రాకేశ్ శర్మ(ఆజ్ సమాజ్) ఎన్నికయ్యారు. వార్తాసంస్థలు, మ్యాగజైన్లు, పీరియాడికల్స్ సంస్థల సంఘమైన ఐఎన్ఎస్ 84వ వార్షిక సాధారణ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఇప్పటిదాకా సంస్థకు కె.రాజ ప్రసాద్ రెడ్డి(సాక్షి) అధ్యక్షునిగా కొనసాగిన విషయం తెల్సిందే. 2023–24 కాలానికిగాను ఐఎన్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా శ్రేయాంస్ కుమార్(మాతృభూమి), వైస్ ప్రెసిడెంట్‌గా వివేక్ గుప్తా(సన్మార్గ్), గౌరవ ట్రెజరర్‌గా తన్మైయ్ మహేశ్వరి(అమర్ ఉజాలా) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కె.రాజ ప్రసాద్ రెడ్డి(సాక్షి), ఐ.వెంకట్(ఈనాడు, అన్నదాత)సహా 41 మంది ఎన్నికయ్యారు. సొసైటీకి సెక్రెటరీ జనరల్‌గా మేరీ పాల్ ఎంపికయ్యారు. మరోవైపు అధ్యక్షునిగా కొనసాగిన కాలంలో తనకు పూర్తి సహాయక సహకారాలు అందించిన ఐఎన్ఎస్ ఉపాధ్యక్ష, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, తదితరులకు మాజీ అధ్యక్షుడు కె.రాజ ప్రసాద్ రెడ్డి(కేఆర్పీ రెడ్డి) కృతజ్ఞతలు తెలిపారు. -
ఐటీ రూల్స్‌లో సవరణలు ఉపసంహరించండి
న్యూఢిల్లీ: ఐటీ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలను ఉపసంహరించుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) అధ్యక్షుడు కేఆర్పీ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్యపక్షాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే సవరణలను ఈ నెల 6న నోటిఫై చేశారని పేర్కొన్నారు. ఏది నిజమో, ఏది నకిలీనో గుర్తించే అధికారాన్ని ఈ సవరణలు ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. ఇప్పటిదాకా ఇలాంటి సంపూర్ణ అధికారం ప్రభుత్వానికి, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీ ఐఎన్ఎస్కు ఉందని గుర్తుచేశారు. మీడియా వృత్తి, విశ్వసనీయతతో ముడిపడి ఉన్న ఏ అంశంపై అయినా నోటిఫికేషన్ జారీ చేసేముందు మీడియా సంస్థలు, విలేకరుల సంఘాలతో విస్తృత, అర్థవంతమైన సంప్రదింపులు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజ నిర్ధారణ కోసం ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు? న్యాయ సహాయం కోరవచ్చా? అప్పీల్ చేసే హక్కు ఉంటుందా? తదితర కీలక అంశాలను నోటిఫైడ్ రూల్స్‌లో ప్రస్తావించలేదని కేఆర్పీ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో బహిర్గతం చేసిన ముసాయిదా సవరణల కంటే ఈ నెల 6న నోటిఫై చేసిన కొత్త ఐటీ రూల్స్ ఏమాత్రం భిన్నంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా ఐటీ రూల్స్‌లో సవరణలు చేయడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని ఐఎన్ఎస్ సెక్రెటరీ జనరల్ మేరీ పాల్ స్పష్టం చేశారు. సవరణలు నోటిఫై చేసే ముందు మీడియా సంస్థలతో చర్చల కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. -
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ డైరెక్టర్ కె.ఆర్.పి.రెడ్డి ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ‘సాక్షి’ డైరెక్టర్ కె.రాజప్రసాద్‌రెడ్డి (కె.ఆర్.పి.రెడ్డి) ఎన్నికయ్యారు. ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. డిప్యూటీ ప్రెసిడెంట్‌గా రాకేష్ శర్మ, వైస్ ప్రెసిడెంట్‌గా శ్రేయస్ కుమార్, కోశాధికారిగా తన్మయి మహేశ్వరి ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్లో సుమారు 800కి పైగా పబ్లికేషన్లు ఉన్నాయి. పత్రికా రంగం అభివృద్ధికి ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ కృషి చేస్తోంది. చదవండి: అవ్వా, తాతలకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. కీలక ప్రకటన -
ఐఎన్ఎస్ ప్రెసిడెంట్‌గా మోహిత్ జైన్
సాక్షి, న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ప్రెసిడెంట్‌గా ఎకనమిక్ టైమ్స్‌కు చెందిన మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ‘సాక్షి’ దినపత్రిక అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కె.రాజప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం వర్చువల్ విధానంలో జరిగిన సొసైటీ 82వ వార్షిక సాధారణ సమావేశంలో 2021–22 సంవత్సరానికి ఐఎన్ఎస్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగిన ‘హెల్త్ అండ్ యాంటిసెప్టిక్’కు చెందిన ఎల్.ఆదిమూలం నుంచి మోహిత్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. రాకేష్ శర్మ (ఆజ్ సమాజ్)ను వైస్ ప్రెసిడెంట్‌గా, తన్మయ్ మహేశ్వరి (అమర్ ఉజాలా)ని గౌరవ కోశాధికారిగా ఎన్నుకున్నట్లు సొసైటీ సెక్రటరీ జనరల్ మేరీ పాల్ తెలిపారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఎన్నికైన 41 మందిలో ‘అన్నదాత’.. ఐ. వెంకట్ ఉన్నారు. -
పత్రికారంగానికి ఉద్దీపన ప్యాకేజీనివ్వండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న న్యూస్‌పేపర్ పరిశ్రమను ఆదుకునేందుకు .. చాన్నాళ్లుగా కోరుతున్న ఉద్దీపన ప్యాకేజీని సత్వరం ప్రకటించాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో అనేక సంస్థలు మూతబడి, లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా దెబ్బతో అటు అడ్వర్టైజింగ్, ఇటు సర్క్యులేషన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావంతో ఆదాయాలు పడిపోయి న్యూస్‌పేపర్ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుందని ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ ఎల్ ఆదిమూలం పేర్కొన్నారు. దీనితో ఇప్పటికే పలు వార్తా సంస్థలు మూతబడటమో లేదా ఎడిషన్లను నిరవధికంగా మూసివేయడమో జరిగిందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్‌లో మరిన్ని సంస్థలు కూడా మూతబడే ప్రమాదముందన్నారు. గత 8 నెలలుగా పరిశ్రమ రూ. 12,500 కోట్ల మేర నష్టపోయిందని.. ఏడాది మొత్తం మీద నష్టం దాదాపు రూ. 16,000 కోట్ల దాకా ఉంటుందని పేర్కొన్నారు. లక్షల మంది ఉపాధికి ముప్పు..: ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభం వంటి పత్రికా రంగం దెబ్బతింటే జర్నలిస్టులు, ప్రింటర్లు మొదలుకుని డెలివరీ బాయ్స్ దాకా దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 30 లక్షల మంది ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆదిమూలం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సామాజికంగా, రాజకీయంగా తీవ్ర దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న పరిశ్రమకు.. ప్రభుత్వం కూడా తోడ్పాటు కల్పించాలని ఆదిమూలం కోరారు. న్యూస్‌ప్రింట్, జీఎన్‌పీ, ఎల్‌డబ్ల్యూసీ పేపర్‌పై ఇంకా విధిస్తున్న 5% కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయాలని, 2 ఏళ్ల ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని, ప్రభుత్వ ప్రకటనల రేట్లను 50% పెంచాలని, ప్రింట్ మీడియాపై ప్రభు త్వ వ్యయాలను 200% పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకటనలకు సంబంధించిన బకాయిల సత్వర విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
మీడియాకు భారీగా ప్రభుత్వ బకాయిలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రకటనల విభాగం, పలు రాష్ట్రాల ప్రకటనల విభాగాలు మీడియా సంస్థలకు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉన్నాయని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ బకాయిలు వారు ఇప్పట్లో చెల్లించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఒక అఫిడవిట్లో ఐఎన్ఎస్ సుప్రీంకోర్టు ముందు ఉంచింది. ‘మీడియా ఇండస్ట్రీ అంచనాల ప్రకారం..వివిధ మీడియా సంస్థలకు డీఏవీపీ(డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ విజువల్ పబ్లిసిటీ) సుమారు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉంది. ఇందులో రూ. 800 కోట్ల నుంచి రూ. 900 కోట్ల వరకు ప్రింట్ మీడియా వాటా’ అని వివరించింది. -
ఉద్దీపన ప్యాకేజీతో ఆదుకోండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆదాయం పడిపోయి వార్తాపత్రికల సంస్థలు కుదేలవుతున్నాయని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రకటనల ఆదాయం, సర్క్యులేషన్ తగ్గిపోవడంతో న్యూస్‌పేపర్ పరిశ్రమ ఇప్పటికే రూ. 4,000–4,500 కోట్ల దాకా నష్టపోయిందని పేర్కొంది. ప్రభుత్వం తక్షణం ఉద్దీపన ప్యాకేజీలాంటిదేదైనా ఇవ్వకపోతే వచ్చే ఆరు.. ఏడు నెలల్లో దాదాపు రూ. 15,000 కోట్ల దాకా నష్టపోయే ముప్పు ఉందని తెలిపింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ అంశాలు పేర్కొన్నారు. వార్తాపత్రిక పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 లక్షల మంది పైచిలుకు జర్నలిస్టులు, ప్రింటర్లు, డెలివరీ వెండార్లు వంటి వారు పనిచేస్తున్నారని, నష్టాల కారణంగా వీరందరిమీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో న్యూస్‌ప్రింట్‌పై అయిదు శాతం కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయాలని, రెండేళ్ల పాటు న్యూస్‌పేపర్ సంస్థలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, ప్రింట్ మీడియా బడ్జెట్‌ను 100 శాతం పెంచాలని ఐఎన్ఎస్ విజ్ఞప్తి చేసింది. పెండింగ్ అడ్వర్టైజింగ్ బిల్లులను తక్షణం సెటిల్ చేయాలని కోరింది. తక్షణమే ప్యాకేజీ ప్రకటించాలి: కార్పొరేట్ ఇండియా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు పరిశ్రమలకు వెంటనే ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించాలని దేశీయ పరిశ్రమలు (కార్పొరేట్ ఇండియా) కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. లాక్డౌన్ తీవ్రమైన ఆర్థిక విఘాతానికి దారితీసినట్టు కార్పొరేట్ ఇండియా వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్‌ను మే 4 నుంచి మరో రెండు వారాల పాటు కొనసాగిస్తూ, అదే సమయంలో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఎన్నో వెసులుబాట్లు ఇవ్వడాన్ని స్వాగతించింది. నియంత్రణలతో కూడిన ఆర్థిక కార్యకపాల నేపథ్యంలో సత్వరమే, ప్రభావవంతమైన సహాయక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. -
న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్ సుంకాన్ని తొలగించండి
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రింట్ మీడియాను ఆదుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఓవైపు ప్రకటనల ఆదాయాలు కోల్పోయి, మరోవైపు ముడి వస్తువుల వ్యయాలు.. న్యూస్‌ప్రింట్ దిగుమతి సుంకాలు భారీగా పెరిగిపోయి పత్రికా రంగం కుదేలవుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. న్యూస్‌ప్రింట్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని, న్యూస్‌పేపర్ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని ఐఎన్ఎస్ కోరింది. అలాగే, బీవోసీ ప్రకటన రేటును 50 శాతం, ప్రింట్ మీడియాకు బడ్జెట్‌ను 100% పెంచాలని విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన బకాయిలన్నీ తక్షణమే సెటిల్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి రవి మిట్టల్‌కు ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ మేరకు లేఖ రాశారు. ‘ముద్రణ వ్యయాలు అధికంగా ఉండే పత్రికలకు ప్రకటనల ఆదాయాలే కీలకం. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో పలు వ్యాపారాలు మూతబడి, ప్రకటనలు లేకపోవడంతో ఆదాయవనరు కోల్పోయినట్లయింది’ అని గుప్తా వివరించారు. చాలా మటుకు చిన్న, మధ్య స్థాయి పత్రికలు ఇప్పటికే ప్రచురణ నిలిపివేశాయని, మిగతావి పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇవి కూడా కుప్పకూలిన పక్షంలో దేశీ న్యూస్‌ప్రింట్ తయారీ పరిశ్రమపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదన్నారు. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే వారితో పాటు డెలివరీ బాయ్స్ దాకా చాలా మంది ఉపాధి కోల్పోయే ముప్పు ఉందని గుప్తా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా కోలుకునేందుకు తక్షణ తోడ్పాటు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శైలేష్ గుప్తా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా మిడ్–డే వార్తాసంస్థకు చెందిన శైలేశ్ గుప్తా ఎన్నికయ్యారు. 2019–20 సంవత్సరానికిగాను అధ్యక్షుడిగా శైలేశ్ గుప్తా సేవలు అందించనున్నారు. బుధవారం బెంగళూరులో జరిగిన ఐఎన్ఎస్ 80వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. డెప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎల్.ఆదిమూలన్, వైస్ ప్రెసిడెంట్‌గా డీడీ పుర్కాయస్థ, గౌరవ కోశాధికారిగా నరేశ్ మోహన్, సెక్రటరీ జనరల్‌గా మేరీపాల్ ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సాక్షి (విశాఖపట్నం) తరఫున కె.రాజప్రసాద్ రెడ్డి(కేఆర్పీ రెడ్డి)సహా 41 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలోని కొందరు సభ్యులు: ఎస్.బాలసుబ్రమణ్యం ఆదిత్యన్ (డైలీ తంతి), గిరీశ్ అగర్వాల్ (దైనిక్ భాస్కర్, భోపాల్), సమహిత్ బల్ (ప్రగతివాది), గౌరవ్ చోప్రా (ఫిల్మీ దునియా), విజయ్ జవహర్లాల్ దర్దా (లోక్మత్, నాగ్‌పూర్), వివేక్ గోయంకా (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ముంబై), మహేంద్ర మోహన్ గుప్తా (దైనిక్ జాగరణ్), ప్రదీప్ గుప్తా (డాటాక్విస్ట్), సంజయ్ గుప్తా (దైనిక్ జాగరణ్, వారణాసి), మోహిత్ జైన్ (ఎకనమిక్ టైమ్స్), ఎంవీ శ్రేయామ్స్ కుమార్ (మాతృభూమి ఆరోగ్య మాసిక), విలాస్ ఎ. మరాఠి (దైనిక్ హిందుస్తాన్, అమరావతి), హర్ష మాథ్యూ (వనిత), అనంత్ నాథ్ (గృహశోభిక, మరాఠి), ప్రతాప్ జి.పవార్ (సకల్), ఆర్ఎంఆర్ రమేశ్ (దినకరణ్), కె. రాజ ప్రసాద్ రెడ్డి (సాక్షి, విశాఖపట్నం), అతిదేవ్ సర్కార్ (ది టెలిగ్రాఫ్), శరద్ సక్సేనా (హిందుస్తాన్ టైమ్స్, పట్నా), రాకేశ్ శర్మ (ఆజ్ సమాజ్), ప్రవీణ్ సోమేశ్వర్ (ది హిందుస్తాన్ టైమ్స్), కిరణ్‌ఠాకూర్ (తరుణ్ భారత్, బెల్గాం), బిజూ వర్గీస్ (మంగళం వీక్లీ), వివేక్ వర్మ (ది ట్రిబ్యూన్), ఐ.వెంకట్ (సితార), తిలక్ కుమార్ (దెక్కన్ హెరాల్డ్, ప్రజావాణి), అఖిల ఉరంకార్ (బిజినెస్ స్టాండర్డ్), జయంత్ మమెన్ మాథ్యూ (మళయాళ మనోరమ). -
‘నక్కీరన్’ గోపాల్‌పై కేసు వెనక్కి తీసుకోవాలి
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను అగౌరవపరిచారనే కారణంతో ‘నక్కీరన్’ వారపత్రిక వ్యవస్థాపక సంపాదకులు నక్కీరన్ గోపాల్‌ను అరెస్ట్ చేయడాన్ని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ఖండించింది. భారత రాష్ట్రపతి, గవర్నర్లను కించపరుస్తూ, వారి బాధ్యతలకు తీవ్ర ఆటంకం కలిగించే వారిని శిక్షించేందుకు వాడే ఐపీసీ సెక్షన్ 124ను నక్కీరన్ గోపాల్‌పై మోపడం అన్యాయమని ఐఎన్ఎస్ అధ్యక్షులు జయంత్ మమెన్ మాథ్యూ వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను గౌరవించాలని ఆయన కోరారు. ఈ విషయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. నక్కీరన్ గోపాల్‌పై, వారపత్రిక సిబ్బందిపై దాఖలైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సర్కారుకు విజ్ఞప్తిచేశారు. -
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా జయంత్ మమ్మెన్ మాథ్యూ
సాక్షి, బెంగళూరు: 2018–19 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా జయంత్ మమ్మెన్ మాథ్యూ (మలయాళ మనో రమ) ఎన్నికయ్యారు. శుక్రవారమిక్కడ జరిగిన సొసైటీ 79వ వార్షిక సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డిప్యూటీ ప్రెసిడెంట్‌గా శైలేష్ గుప్తా (మిడ్ డే), వైస్ ప్రెసిడెంట్‌గా ఎల్.ఆదిమూలం (హెల్త్ అండ్ ది యాం టిసెప్టిక్), కోశాధికారిగా శరద్ సక్సేనా (హిందుస్తాన్ టైమ్స్), సెక్రటరీ జనరల్‌గా లవ్ సక్సేనా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా సాక్షి డైరెక్టర్ కె.రాజప్రసాదరెడ్డి ఎన్నికయ్యారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా ఎస్.బాలసుబ్రమణ్యం ఆదిత్యన్ (డైలీ తంతి), గిరీష్ అగర్వాల్ (దైనిక్ భాస్కర్), సంహిత్ బల్ (ప్రగతివాది), వి.కె.చోప్రా (దైనిక్ అసాం), విజయ్ కుమార్ చోప్రా (పంజాబీ కేసరి), కరణ్ రాజేంద్ర దార్దా (లోక్మత్), విజయ్ జవహర్లాల్ దార్దా (లోక్మత్), జగ్జీత్సింగ్ దార్ది (చర్హదికళ డైలీ), వివేక్ గోయెంక (ఇండియన్ ఎక్స్‌ప్రెస్), మహేంద్ర మోహన్ గుప్తా (దైనిక్ జాగరణ్), ప్రదీప్ గుప్తా (డేటాక్వెస్ట్), సంజయ్ గుప్తా (దైనిక్ జాగరణ్), మోహిత్ జైన్ (ఎకనామిక్ టైమ్స్), సర్వీందర్ కౌర్ (అజిత్), సీహెచ్.కిరణ్ (విపుల, అన్నదాత), ఎంవీ శ్రేయమ్స్ కుమార్ (మాతృభూమి ఆరోగ్య మాసిక), ఆర్.లక్ష్మీపతి (దినమలర్), విలాస్ ఏ మరాఠే (దైనిక్ హిందుస్తాన్), హర్షా మాథ్యూ (వనిత), నరేష్ మోహన్ (సండే స్టేట్స్‌మన్), అనంత్ నాథ్ (గ్రిహ్శోభిక, మరాఠీ), సుమంత పాల్ (అమర్ ఉజాల), ప్రతాప్ జి పవార్ (సకల్), డీడీ పుర్కాయస్త (ఆనంద్ బజార్ పత్రిక), ఆర్ఎంఆర్ రమేశ్ (దినకరణ్), అతిదెబ్ సర్కార్ (ది టెలిగ్రాఫ్), రాకేశ్ శర్మ (ఆజ్ సమాజ్), కిరణ్ డి.ఠాకూర్ (తరుణ్ భరత్), బిజు వర్ఘీస్ (మంగళం వీక్లీ), రాజీవ్ వెర్మ (హిందుస్తాన్ టైమ్స్), వినయ్ వెర్మ (ది ట్రైబ్యూన్), బాహుబలి ఎస్ షా (గుజరాత్ సమాచార్), హోర్ముస్జీ ఎన్ కామా (బాంబే సమాచార్ వీక్లీ), కుందన్ ఆర్ వ్యాస్ (వ్యాపార్), కె.ఎన్.తిలక్ కుమార్ (డెక్కన్ హెరాల్డ్ అండ్ ప్రజావాణి), రవీంద్రకుమార్ (ది స్టేట్స్‌మన్), కిరణ్ బి వడోదారియా (సంభవ్ మెట్రో), పి.వి.చంద్రన్ (గృహలక్ష్మి), సోమేశ్ శర్మ (రాష్ట్రదూత్ సప్తాహిక్), అకిల ఉరంకార్ (బిజినెస్ స్టాండర్డ్) ఉన్నారు. -
పత్రికల సమస్యలు పరిష్కరించండి
న్యూఢిల్లీ: దేశంలో పత్రికలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతీఇరానీకి ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ (ఐఎన్ఎస్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐఎన్ఎస్ అధ్యక్షురాలు అఖిలా ఉరంకార్ నేతృత్వంలో పలు పెద్ద, చిన్న పత్రికలకు చెందిన ఎనిమిది మంది ప్రతినిధుల బృందం ఇటీవల కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రం అందజేసింది. న్యూస్‌ప్రింట్ ధరల పెరుగుదల, ప్రకటనలు తగ్గిపోవడం తదితర సమస్యల కారణంగా చిన్న పత్రికలు మూతపడే స్థితికి చేరుకున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని కోరింది. ఈ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ సానుకూలంగా స్పందించారని ఐఎన్ఎస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఐఎన్ఎస్ సెక్రటరీ జనరల్‌గా లవ్ సక్సేనా
న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) నూతన సెక్రటరీ జనరల్‌గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి లవ్ సక్సేనా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ అధ్యక్షురాలు అఖిల ఉరంకార్, ఐఎన్ఎస్ అధికారులు సక్సేనాకు శుభాకాంక్షలు తెలిపారు. -
రాజస్తాన్ ఆర్డినెన్స్‌పై ఐఎన్ఎస్ ధ్వజం
న్యూఢిల్లీ: ప్రస్తుత, మాజీ ప్రభుత్వ అధికారులు, జడ్జీలకు విచారణ, వారి అవినీతిపై మీడియా కవరేజీ నుంచి రక్షణ కల్పిస్తూ రాజస్తాన్ సర్కారు ఆర్డినెన్స్ తేవడాన్ని ‘ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) అధ్యక్షులు అఖిల ఉరంకార్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర సర్కారు నిర్ణయం మీడియా గొంతు నొక్కేయడమేనన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలపై దాడేనని విమర్శిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ఇలాంటి ఆర్డినెన్స్ తేవడం రాజ్యాంగవిరుద్ధమన్నారు. అధికారులు, మాజీ జడ్జీలను విధి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ముందస్తు అనుమతిలేకుండా విచారణ, అవినీతి వ్యవహారాలపై మీడియా కథనాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని ఆమె ఆక్షేపించారు. ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ సెలక్ట్ కమిటీకి పంపించిన సంగతి తెలిసిందే. -
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా సోమేశ్ శర్మ
బెంగళూరు: భారత వార్తాపత్రికల సంఘం(ఐఎన్ఎస్) ప్రెసిడెంట్‌గా సోమేశ్ శర్మ (రాష్ట్రదూత్ సప్తాహిక్) ఎన్నికయ్యారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన 77వ వార్షిక సమావేశంలో 2016–17కు గాను ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. డిప్యూటీ ప్రెసిండెంట్‌గా అల్కా ఉరంకార్(బిజినెస్ స్టాండర్డ్), వైస్ ప్రెసిడెంట్‌గా కె.బాలాజీ(ది హిందూ) ఎన్నికయ్యారు. గౌరవ కోశాధికారిగా శరద్ సక్సేనా ( హిందుస్ధాన్ టైమ్స్) ఎన్నికయ్యారు. సొసైటీ సెక్రటరీ జనరల్ గా వి. శంకరన్ వ్యవహరిస్తారు. కార్యవర్గ సభ్యుడిగా ‘సాక్షి’ తెలుగు దినపత్రిక కు చెందిన కె. రాజప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే సిహెచ్.కిరణ్ ( విపుల,అన్నదాత) కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. కాగా ఇప్పటివరకు పీవీ చంద్రన్ (గృహలక్ష్మి–మాతృభూమి గ్రూప్) ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. -
మీడియాను బెదిరించడం సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ: పత్రికలపై ఫిర్యాదులు ఏవైనా ఉంటే వాటికి న్యాయపరమైన పరిష్కారాలు ఉన్నాయని.. అంతేగాని వాటిని భయపెట్టడం, బెదిరించడం సబబు కాదని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) పేర్కొంది. ముఖ్యంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరికాదని పేర్కొంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమైనవిగా ఐఎన్ఎస్ గుర్తించిందని ఆ సంస్థ సెక్రెటరీ జనరల్ వి.శంకరన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సభ్య ప్రచురణ సంస్థలు భయానికి, వేధింపులకు గురైతే... అన్ని వనరులను వినియోగించుకుని ప్రతిఘటించడానికి సంస్థ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. -
బెంగాల్ ప్రభుత్వ ప్రకటనలపై జాగ్రత్త
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) తన సభ్యులకు సూచించింది. ఐఎన్ఎస్ కార్యవర్గ కమిటీ సోమవారమిక్కడ సమావేశమైంది. తన సభ్య పత్రికలకు కొన్నింటికి ప్రభుత్వం చాలా ఏళ్లుగా ప్రకటనల బిల్లులు చెల్లించకపోవడంపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా పరిశ్రమ ఇప్పటికే కష్టాల్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల డబ్బులు రాక ఈ పత్రికలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి వెంటనే బకాయిలు చెల్లించాలని కార్యవర్గం కోరినట్లు ఐఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి వి.శంకరన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
పత్రికా రంగానికి గడ్డుకాలం
ప్రస్తుతం పత్రికా రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇతర మీడియా సంస్థలు పత్రికలపై తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా పత్రికా రంగంలోకి చొరబడేవిధంగా అనుసరిస్తున్న విధానాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) ఆవిర్భవించి 75 ఏళ్లయింది. ఈ వేడుకలను ఘనంగా జరుపుకోడానికే పరిమితం కాకుండా సొసైటీ సేవలను కూడా ఒకసారి స్మరించుకోవాలి. ఒక సంస్థగా ఐఎన్ఎస్కు ఉన్న విస్తృత అనుభవం పత్రికారంగ సేవలను ఎలా తీర్చగలదో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో పత్రికారంగం ఎదుర్కొన్న అనేక సంక్షోభాలను ఐఎన్ఎస్ ఎంతో సంయమనంతో, నేర్పుతో చక్కదిద్దింది. ఒకపక్క ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సమయంలోనే పత్రికారం గం మరో సంక్షోభం ఏదుర్కొంటోంది. దాని పరిధిని, లోతుపాతులను అటు ప్రభుత్వం గానీ, ఇటు పత్రికాసిబ్బందిగానీ పూర్తిగా గుర్తించడం లేదు. 21వ శతాబ్దంలో పెద్దగా ప్రాధాన్యతలేని ఒక పత్రికారంగ చట్టాన్ని కోర్టులు కొట్టేస్తాయనుకుంటే దానికి భిన్నంగా ఆ చట్టాన్ని ఇటీవల సుప్రీంకోర్టు సమర్థించింది. 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ భవిష్యత్‌లో ఐఎన్ఎస్ వందేళ్ల పండుగ జరుపుకోగలుగుతుందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. సంతోషకర సమయంలో ఇలాంటి అశుభ ఆలోచనలు రావడం మంచిది కాదని నాకు తెలుసు. కాని పత్రికారంగాన్ని ప్రస్తుతం ముప్పిరిగొన్న సంక్షోభ పరిస్థితులు అంత తీవ్రంగా ఉన్నాయని చెప్పకతప్పదు. ప్రస్తుతం పత్రికా రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇతర మీడియా సంస్థలు పత్రికలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా పత్రికా రంగంలోకి చొరబడేవిధంగా అనుసరిస్తున్న విధానాలు ఇబ్బందిపెడుతున్నాయి. పత్రికలు ఉపయోగించే న్యూస్‌ప్రింట్‌లో గణనీయభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. డాలరుతో రూపాయి మారకం విలువ గణనీయంగా క్షీణించడంతో దిగుమతి చేసుకునే విదేశీ న్యూస్ ప్రింట్ వ్యయం భారంగా మారింది. ఫలితంగా పత్రిక ఉత్పత్తి వ్యయం బాగా పెరిగిపోయింది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అడ్వర్టైజ్మెంట్ల పాలసీలు కూడా పత్రికారంగాన్ని దెబ్బతీస్తున్నాయి. అదే సమయంలో ‘పెయిడ్ న్యూస్’కు సంబంధించి కొన్ని పత్రికలు అనుసరిస్తున్న పద్ధతుల వల్ల మీడియా స్వేచ్ఛకే భంగం వాటిల్లుతోందన్న విషయాన్ని అంగీకరించాలి. మీడియాలో తమ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి దాని ద్వారా ఒక అనారోగ్యకరమైన పోటీకి తెరతీయాలన్న ప్రయత్నం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతాలకే గొడ్డలిపెట్టు. పత్రికారంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ రంగమే స్వయంగా పరిష్కరించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం చట్టాలు చేసి పత్రికా రంగంపై రుద్దే ప్రయత్నం చేయడం ఆందోళన కలిగిస్తుంది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టానికి సవరణలు, ముఖ్యంగా లెసైన్సింగ్తో కంటెంట్‌ను జోడించేందుకు చేసే ప్రయత్నాలు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వేతనబోర్డులలో ఒకే జడ్జిని ఏళ్ల తరబడి కొనసాగించడం కూడా మరొకటి. ప్రభుత్వం జారీ చేసే అడ్వర్టైజ్మెంట్లకు అసంబద్ధమైన, అవాస్తవికమైన రేట్లను ఖరారు చేస్తున్నారు. ఈ ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా ఒక గ్రంథం రాశాను. ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పత్రికా స్వాతంత్య్రం గురించి చెప్పిన మాటలను కూడా ప్రత్యేకం గా ప్రస్తావించాను. పత్రికా స్వేచ్ఛను నెహ్రూ ఈ విధంగా నిర్వచించారు. ‘‘విస్తృత పరిధితో చూస్తే నా దృక్పథంలో పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం ఒక నినాదం కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అదొక ప్రధాన అంశం. మీడియా తీసుకునే స్వేచ్ఛతో ప్రభుత్వం ఒకవేళ ఇష్టపడకపోయినా, దానివల్ల ప్రమాదం ఉందని భావిం చినా పత్రికా స్వేచ్ఛ లో జోక్యం చేసుకోవడం కచ్చితంగా తప్పని నేను భావిస్తున్నాను. మీడియాపై ఆంక్షలు విధిం చడం వల్ల పాలకులు ఎలాంటి మార్పును సాధించలేరు. వారు కేవలం కొన్ని విషయాలను దాచిపెట్టి, ఏమార్చగలరు. కాబట్టి నియంత్రణలతో,సెన్సార్‌తో కూడిన మీడి యా కన్నా ప్రమాదాలు ఉన్నా సరే అన్నివిధాలా సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్న పత్రికా వ్యవస్థ ఉండడమే ఉత్తమం.’’ పత్రికా స్వేచ్ఛ గురించి నెహ్రూ చెప్పిన ఈ మాటలను ప్రతి పత్రికా కార్యాలయంలో జర్నలిస్టులు అక్షరాలా ఆచరించాల్సిందే. అంతేకాదు ప్రభుత్వ అధినేతలకూ శిరోధార్యం. సంస్కరణల పుణ్యమా నెహ్రూ చెప్పిన ఈ ఉదార విధానాలకు కాలదోషం పడుతోంది. పత్రికా స్వాతంత్య్రానికి సంబంధించిన ఈ మౌలిక సిద్ధాంతాలను, ఉదార విధానాలు ప్రస్తుత కాలానికి అన్వయించుకునేలా చేసుకునేందుకు అందరూ కృషి చేయాలి. (ఇటీవల ఐఎన్ఎస్ 75వ వార్షికోత్సవంలో చేసిన ప్రసంగపాఠంలో కొన్ని ముఖ్య భాగాలు) వ్యాసకర్త ఐఎన్ఎస్ అధ్యక్షుడు రవీంద్రకుమార్ -
ప్రింటింగ్ పరిశ్రమకు ఉజ్వల భవిత
న్యూఢిల్లీ: భారత ప్రింటింగ్ పరిశ్రమ 2015 నాటికి 2,100 కోట్ల డాలర్లకు చేరే అవకాశాలున్నాయని వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఈఎంఎస్. నాచియప్పన్ గురువారం తెలిపారు. ప్రింటింగ్ పరిశ్రమలో కొత్త టెక్నాలజీని వినియోగించడం, చౌక ధరలు, ప్రింటింగ్ పరిశ్రమ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వంటివి దీనికి ప్రధాన కారణాలని వివరించారు. ప్రస్తుతం 1,210 కోట్లు డాలర్లుగా ఉన్న భారత ప్రింటింగ్ పరిశ్రమ రెండేళ్లలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడాలోని పామెక్స్(పీఏఎంఈఎక్స్)2013 ప్రారంభోత్సవంలో ఈ వివరాలు వెల్లడించారు.