
న్యూఢిల్లీ: దేశంలో పత్రికలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతీఇరానీకి ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ (ఐఎన్‌ఎస్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐఎన్‌ఎస్ అధ్యక్షురాలు అఖిలా ఉరంకార్ నేతృత్వంలో పలు పెద్ద, చిన్న పత్రికలకు చెందిన ఎనిమిది మంది ప్రతినిధుల బృందం ఇటీవల కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రం అందజేసింది.
న్యూస్‌ప్రింట్ ధరల పెరుగుదల, ప్రకటనలు తగ్గిపోవడం తదితర సమస్యల కారణంగా చిన్న పత్రికలు మూతపడే స్థితికి చేరుకున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని కోరింది. ఈ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ సానుకూలంగా స్పందించారని ఐఎన్‌ఎస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.