పత్రికా రంగానికి గడ్డుకాలం
ప్రస్తుతం పత్రికా రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇతర మీడియా సంస్థలు పత్రికలపై తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా పత్రికా రంగంలోకి చొరబడేవిధంగా అనుసరిస్తున్న విధానాలు ఇబ్బంది పెడుతున్నాయి.
ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) ఆవిర్భవించి 75 ఏళ్లయింది. ఈ వేడుకలను ఘనంగా జరుపుకోడానికే పరిమితం కాకుండా సొసైటీ సేవలను కూడా ఒకసారి స్మరించుకోవాలి. ఒక సంస్థగా ఐఎన్‌ఎస్‌కు ఉన్న విస్తృత అనుభవం పత్రికారంగ సేవలను ఎలా తీర్చగలదో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో పత్రికారంగం ఎదుర్కొన్న అనేక సంక్షోభాలను ఐఎన్‌ఎస్ ఎంతో సంయమనంతో, నేర్పుతో చక్కదిద్దింది. ఒకపక్క ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సమయంలోనే పత్రికారం గం మరో సంక్షోభం ఏదుర్కొంటోంది. దాని పరిధిని, లోతుపాతులను అటు ప్రభుత్వం గానీ, ఇటు పత్రికాసిబ్బందిగానీ పూర్తిగా గుర్తించడం లేదు. 21వ శతాబ్దంలో పెద్దగా ప్రాధాన్యతలేని ఒక పత్రికారంగ చట్టాన్ని కోర్టులు కొట్టేస్తాయనుకుంటే దానికి భిన్నంగా ఆ చట్టాన్ని ఇటీవల సుప్రీంకోర్టు సమర్థించింది.
75వ పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ భవిష్యత్‌లో ఐఎన్‌ఎస్ వందేళ్ల పండుగ జరుపుకోగలుగుతుందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. సంతోషకర సమయంలో ఇలాంటి అశుభ ఆలోచనలు రావడం మంచిది కాదని నాకు తెలుసు. కాని పత్రికారంగాన్ని ప్రస్తుతం ముప్పిరిగొన్న సంక్షోభ పరిస్థితులు అంత తీవ్రంగా ఉన్నాయని చెప్పకతప్పదు.
ప్రస్తుతం పత్రికా రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇతర మీడియా సంస్థలు పత్రికలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా పత్రికా రంగంలోకి చొరబడేవిధంగా అనుసరిస్తున్న విధానాలు ఇబ్బందిపెడుతున్నాయి.
పత్రికలు ఉపయోగించే న్యూస్‌ప్రింట్‌లో గణనీయభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. డాలరుతో రూపాయి మారకం విలువ గణనీయంగా క్షీణించడంతో దిగుమతి చేసుకునే విదేశీ న్యూస్ ప్రింట్ వ్యయం భారంగా మారింది. ఫలితంగా పత్రిక ఉత్పత్తి వ్యయం బాగా పెరిగిపోయింది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అడ్వర్‌టైజ్‌మెంట్ల పాలసీలు కూడా పత్రికారంగాన్ని దెబ్బతీస్తున్నాయి. అదే సమయంలో ‘పెయిడ్ న్యూస్’కు సంబంధించి కొన్ని పత్రికలు అనుసరిస్తున్న పద్ధతుల వల్ల మీడియా స్వేచ్ఛకే భంగం వాటిల్లుతోందన్న విషయాన్ని అంగీకరించాలి. మీడియాలో తమ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి దాని ద్వారా ఒక అనారోగ్యకరమైన పోటీకి తెరతీయాలన్న ప్రయత్నం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతాలకే గొడ్డలిపెట్టు.
పత్రికారంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ రంగమే స్వయంగా పరిష్కరించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం చట్టాలు చేసి పత్రికా రంగంపై రుద్దే ప్రయత్నం చేయడం ఆందోళన కలిగిస్తుంది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టానికి సవరణలు, ముఖ్యంగా లెసైన్సింగ్‌తో కంటెంట్‌ను జోడించేందుకు చేసే ప్రయత్నాలు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వేతనబోర్డులలో ఒకే జడ్జిని ఏళ్ల తరబడి కొనసాగించడం కూడా మరొకటి. ప్రభుత్వం జారీ చేసే అడ్వర్‌టైజ్‌మెంట్లకు అసంబద్ధమైన, అవాస్తవికమైన రేట్లను ఖరారు చేస్తున్నారు.
ఈ ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా ఒక గ్రంథం రాశాను. ప్రధమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పత్రికా స్వాతంత్య్రం గురించి చెప్పిన మాటలను కూడా ప్రత్యేకం గా ప్రస్తావించాను. పత్రికా స్వేచ్ఛను నెహ్రూ ఈ విధంగా నిర్వచించారు. ‘‘విస్తృత పరిధితో చూస్తే నా దృక్పథంలో పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం ఒక నినాదం కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అదొక ప్రధాన అంశం. మీడియా తీసుకునే స్వేచ్ఛతో ప్రభుత్వం ఒకవేళ ఇష్టపడకపోయినా, దానివల్ల ప్రమాదం ఉందని భావిం చినా పత్రికా స్వేచ్ఛ లో జోక్యం చేసుకోవడం కచ్చితంగా తప్పని నేను భావిస్తున్నాను. మీడియాపై ఆంక్షలు విధిం చడం వల్ల పాలకులు ఎలాంటి మార్పును సాధించలేరు. వారు కేవలం కొన్ని విషయాలను దాచిపెట్టి, ఏమార్చగలరు. కాబట్టి నియంత్రణలతో,సెన్సార్‌తో కూడిన మీడి యా కన్నా ప్రమాదాలు ఉన్నా సరే అన్నివిధాలా సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్న పత్రికా వ్యవస్థ ఉండడమే ఉత్తమం.’’
పత్రికా స్వేచ్ఛ గురించి నెహ్రూ చెప్పిన ఈ మాటలను ప్రతి పత్రికా కార్యాలయంలో జర్నలిస్టులు అక్షరాలా ఆచరించాల్సిందే. అంతేకాదు ప్రభుత్వ అధినేతలకూ శిరోధార్యం. సంస్కరణల పుణ్యమా నెహ్రూ చెప్పిన ఈ ఉదార విధానాలకు కాలదోషం పడుతోంది. పత్రికా స్వాతంత్య్రానికి సంబంధించిన ఈ మౌలిక సిద్ధాంతాలను, ఉదార విధానాలు ప్రస్తుత కాలానికి అన్వయించుకునేలా చేసుకునేందుకు అందరూ కృషి చేయాలి.
(ఇటీవల ఐఎన్‌ఎస్ 75వ వార్షికోత్సవంలో చేసిన ప్రసంగపాఠంలో కొన్ని ముఖ్య భాగాలు)
వ్యాసకర్త ఐఎన్‌ఎస్ అధ్యక్షుడు
రవీంద్రకుమార్