పత్రికారంగానికి ఉద్దీపన ప్యాకేజీనివ్వండి | INS Urges Govt To Provide Stimulus Package For Newspaper Industry | Sakshi
Sakshi News home page

పత్రికారంగానికి ఉద్దీపన ప్యాకేజీనివ్వండి

Published Sat, Dec 12 2020 2:21 AM | Last Updated on Sat, Dec 12 2020 3:40 AM

INS Urges Govt To Provide Stimulus Package For Newspaper Industry - Sakshi


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న న్యూస్‌పేపర్‌ పరిశ్రమను ఆదుకునేందుకు .. చాన్నాళ్లుగా కోరుతున్న ఉద్దీపన ప్యాకేజీని సత్వరం ప్రకటించాలని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో అనేక సంస్థలు మూతబడి, లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా దెబ్బతో అటు అడ్వర్టైజింగ్, ఇటు సర్క్యులేషన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావంతో ఆదాయాలు పడిపోయి న్యూస్‌పేపర్‌ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుందని ఐఎన్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ ఆదిమూలం పేర్కొన్నారు. దీనితో ఇప్పటికే పలు వార్తా సంస్థలు మూతబడటమో లేదా ఎడిషన్లను నిరవధికంగా మూసివేయడమో జరిగిందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్‌లో మరిన్ని సంస్థలు కూడా మూతబడే ప్రమాదముందన్నారు. గత 8 నెలలుగా పరిశ్రమ రూ. 12,500 కోట్ల మేర నష్టపోయిందని.. ఏడాది మొత్తం మీద  నష్టం దాదాపు రూ. 16,000 కోట్ల దాకా ఉంటుందని పేర్కొన్నారు.  

లక్షల మంది ఉపాధికి ముప్పు..: ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభం వంటి పత్రికా రంగం దెబ్బతింటే  జర్నలిస్టులు, ప్రింటర్లు మొదలుకుని డెలివరీ బాయ్స్‌ దాకా దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 30 లక్షల మంది ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆదిమూలం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సామాజికంగా, రాజకీయంగా తీవ్ర దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న పరిశ్రమకు.. ప్రభుత్వం కూడా తోడ్పాటు కల్పించాలని ఆదిమూలం కోరారు. న్యూస్‌ప్రింట్, జీఎన్‌పీ, ఎల్‌డబ్ల్యూసీ పేపర్‌పై ఇంకా విధిస్తున్న 5% కస్టమ్స్‌ సుంకాన్ని ఎత్తివేయాలని, 2 ఏళ్ల ట్యాక్స్‌ హాలిడే ప్రకటించాలని, ప్రభుత్వ ప్రకటనల రేట్లను 50% పెంచాలని, ప్రింట్‌ మీడియాపై ప్రభు త్వ వ్యయాలను 200% పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకటనలకు సంబంధించిన బకాయిల సత్వర విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement