print media
-
అలాంటి సంస్థలతో తస్మాత్ జాగ్రత్త: ఆర్బీఐ
న్యూఢిల్లీ: ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ‘రుణమాఫీ’ ఆఫర్లకు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనల బారిన పడవద్దని రిజర్వ్ బ్యాంక్ ప్రజలను హెచ్చరించింది. రుణమాఫీని ఆఫర్ చేస్తూ రుణగ్రహీతలను ప్రలోభపెట్టే కొన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలను గమనించినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని సంస్థలు, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి పలు ప్రచారాలు చురుకుగా చేస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అటువంటి సంస్థలు ఎలాంటి అధికారం లేకుండా ‘రుణ మాఫీ సర్టిఫికెట్లు’ జారీ చేయడానికి సేవా/చట్టపరమైన రుసుమును వసూలు చేస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కొంతమంది వ్యక్తులు రుణ గ్రహీతలను తప్పుదారిపట్టించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. అలాంటి సంస్థలతో లావాదేవీలు జరిపితే ఆర్థిక నష్టాలు తప్పవని వినియోగదారులకు హెచ్చరించింది. ‘‘బ్యాంకులతోసహా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అటువంటి సంస్థలు లేదా వ్యక్తులు తప్పుగా సూచిస్తున్నారు. తద్వారా బ్యాంకింగ్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి‘ అని ఆర్బీఐ ప్రకటన వివరించింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి నష్టపోవద్దని, ఈ తరహా తప్పుడు ప్రచారం తమ దృష్టికి వస్తే, విచారణా సంస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. -
ప్రింట్ మీడియాకు ఎన్నికల బూస్ట్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రింట్ మీడియా ఆదాయాలు 13–15 శాతం వృద్ధి చెంది రూ. 30,000 కోట్లకు చేరనున్నాయి. ఎన్నికలకు ముందు ప్రచారం కోసం ఇటు ప్రభుత్వాలు, అటు బ్రాండింగ్ కోసం కార్పొరేట్లు ప్రకటనలపై గణనీయంగా వెచ్చి ంచనుండటం ఇందుకు దోహదపడనుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. తాము రేటింగ్ ఇచ్చే కంపెనీలను విశ్లేíÙంచిన మీదట ఈ అంచనాలకు వచ్చి నట్లు క్రిసిల్ పేర్కొంది. ప్రింట్ మీడియా రంగం ఆదాయాల్లో ఈ సంస్థల వాటా 40 శాతం వరకూ ఉంటుందని వివరించింది. సాధారణంగా, ప్రింట్ మీడియా సంస్థల ఆదాయాల్లో 70 శాతం భాగం అడ్వర్టయిజింగ్ ద్వారా వస్తుండగా, మిగతా 30 శాతం సబ్ర్‌స్కిప్షన్ల ద్వారా వస్తోంది. ఆదాయాలు పెరగడం, న్యూస్‌ప్రింట్ ధరలు తగ్గుతుండటంతో ప్రింట్ మీడియా లాభదాయకత మెరుగుపడగలదని క్రిసిల్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం 10 పర్సంటేజీ పాయింట్లు పెరిగి 14.5 శాతానికి చేరొచ్చని వివరించింది. ‘కీలక రంగాల్లోని కార్పొరేట్లు ప్రకటనలపై మరింతగా వెచ్చి ంచనుండటం, అలాగే రాబోయే రాష్ట్రాల, సార్వత్రిక ఎన్నికల కోసం ప్రభుత్వాలు కూడా యాడ్లపై ఖర్చు చేయనుండటం దేశీ ప్రింట్ మీడియా రంగం ఆదాయాలకు ఊతమివ్వగలదు. ప్రకటనలపరమైన ఆదాయంలో ప్రభుత్వ యాడ్ల వాటా అయిదో వంతు ఉంటుంది. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వాలు మరింతగా వెచ్చి ంచడం వల్ల ప్రింట్ మీడియా ఆదాయం మరింత పెరగగలదు‘ అని క్రిసిల్ డైరెక్టర్ నవీన్ వైద్యనాథన్ చెప్పారు. కరోనా మహమ్మారి దెబ్బతో 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రింట్ మీడియా ఆదాయాలు 40 శాతం పడిపోయాయి. అయితే, ఆ తర్వాత రెండు సంవత్సరాల్లోనూ పుంజుకుని వరుసగా 25%, 15% మేర వృద్ధి నమోదు చేశాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. ♦ రిటైల్, ఎఫ్ఎంసీజీ, ఫ్యాషన్ ఆభరణాలు, కొత్త వాహనాల ఆవిష్కరణ, ఉన్నత విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యం, ఆన్లైన్ షాపింగ్, రియల్ ఎస్టేట్ మొదలైనవి ప్రింట్ మీడియా ప్రకటనల ఆదాయ వృద్ధికి దోహదపడనున్నాయి. ప్రింట్ మీడియా యాడ్ రెవెన్యూలో వీటి వాటా మూడింట రెండొంతులు ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ప్రింట్ ఆదాయాలు తిరిగి కరోనా పూర్వ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. ♦ ప్రింట్ మీడియా కంపెనీలు, ముఖ్యంగా ఇంగ్లీష్ పత్రికలు, తమ ప్రీమియం డిజిటల్ కంటెంట్‌కు వసూళ్లు చేస్తున్నాయి. ♦ కవర్ ధరలు పెరగడంతో సబ్ర్స్కిప్షన్ ఆదాయం 7 శాతం పెరగనుంది. భౌతిక న్యూస్‌పేపర్లకు ప్రాధాన్యమిచ్చే పాఠకుల సంఖ్య పెరుగుతుండటానికి ఇది నిదర్శనం. అయితే, సబ్ర్స్కిప్షన్ వృద్ధి వల్ల న్యూస్‌ప్రింట్ అవసరం కూడా పెరిగి ప్రింట్ మీడియా లాభాలపై ప్రభావం పడుతోంది. భారత్ తన న్యూస్‌ప్రింట్ అవసరాల్లో సగానికి పైగా భాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. ప్రధాన ఎగుమతిదారైన రష్యా.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో లాజిస్టిక్స్పరమైన సవాళ్లు తలెత్తుతున్నాయి. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో న్యూస్‌ప్రింట్ రేట్లు 8.5 పర్సంటేజీ పాయింట్లు పెరిగి ప్రింట్ మీడియా కంపెనీల నిర్వహణ మార్జిన్లు తగ్గాయి. అయితే, ఇటీవలి కాలంలో గరిష్ట స్థాయి నుంచి న్యూస్‌ప్రింట్ ధరలు 15–20 శాతం మేర తగ్గాయి. ప్రింట్ మీడియా కంపెనీల లాభాలు పెరిగేందుకు ఇది దోహదపడనుంది. ♦ మధ్యకాలికంగా మార్జిన్లు మెరుగ్గానే ఉండవచ్చు. అయితే, న్యూస్‌ప్రింట్ రేట్లు పెరగడం, ప్రింట్ రంగాన్ని ప్రభావితం చేసేలా స్థూలఆర్థిక పరిస్థితులు మారడం తదితర రిసు్కలు ఉండొచ్చు. -
ప్రింట్ మీడియాపై రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రింట్ మీడియా ఆదాయంలో 25 శాతం వరకు వృద్ది ఉండొచ్చని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ నివేదిక వెల్లడించింది. ప్రకటనలు అధికం కావడమే ఇందుకు కారణమని వివరించింది. ప్రకటనల ఆదాయం 25–30 శాతం, సర్క్యులేషన్ ఆదాయం 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా న్యూస్‌ప్రింట్ ఖర్చుల భారం అధికం అయింది. ఇది లాభదాయకతను తగ్గిస్తుంది. ప్రింట్ మీడియా సంస్థల నిర్వహణ లాభాల మార్జిన్లు 3 శాతం పాయింట్ల వరకు క్షీణిస్తాయి. 2020–21లో వినియోగించిన న్యూస్‌ప్రింట్‌లో 60 శాతం దిగుమతి చేసుకున్నదే. యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి న్యూస్ ప్రింట్ ధర 80 శాతం దాకా దూసుకెళ్లింది. దిగుమతులు తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో న్యూస్ ప్రింట్ మరింత ప్రియం అయ్యే అవకాశం ఉంది. సర్క్యులేషన్, ప్రకటనల పరిమాణం పునరుద్ధరణతో న్యూస్‌ప్రింట్ వినియోగంలో పెరుగుదలకు దారి తీస్తుంది’ అని వివరించింది. -
ప్రింట్ మీడియా ఆదాయంలో 35% వృద్ధి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రింట్ మీడియా ఆదాయం 35 శాతం వృద్ధి చెందుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. కరోనా ముందస్తు కాలంతో పోలిస్తే 2021–22లో పరిశ్రమ ఆదాయం 75 శాతమే ఉంటుందని వెల్లడించింది. ‘2019–20లో ప్రింట్ మీడియా ఆదాయం రూ.31,000 కోట్లు. ఇందులో ప్రకటనల ద్వారా 70%, మిగిలినది చందాల (సబ్స్క్రిప్షన్స్) ద్వారా సమకూరింది. మహమ్మారి కారణంగా పరిశ్రమ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 40% పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.24,000–25,000 కోట్లకు చేరవచ్చు. వ్యయ నియంత్రణ చర్యలు, కంటెంట్ డిజిటలైజేషన్‌తో లాభదాయకత 9–10 శాతానికి పునరుద్ధరించడానికి దారితీస్తుంది. ఆరు నెలలుగా న్యూస్‌ప్రింట్ ధరలు 20–30% అధికమైనప్పటికీ లాభం పెరుగుతుంది’ అని క్రిసిల్ తన నివేదిక ద్వారా తెలిపింది. ఆదాయాలు మెరుగుపడతాయి.. ఏప్రిల్–జూన్ కాలంలో ప్రకటన ఆదాయాలపై సెకండ్ వేవ్ ప్రభావం చూపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నందున ప్రస్తుత త్రైమాసికం నుండి ప్రకటన ఆదాయాలు మెరుగవుతాయి. ఆంగ్లేతర వార్తా పత్రికలు సెకండ్ వేవ్‌లో కూడా చందా ఆదాయాన్ని నిలబెట్టుకోగలిగాయి. బలమైన మూలాలు కలిగి ఉండడమే ఇందుకు కారణం. కోవిడ్–19 ముందస్తు కాలంతో పోలిస్తే 2021–22లో సబ్స్క్రిప్షన్స్ ఆదాయ నష్టం 12–15 శాతానికి పరిమితం అవుతుంది. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా తక్కువ ధర, నమ్మదగిన కంటెంట్‌ను అందించగల సామర్థ్యం, వార్తా పత్రికలను చదివే ప్రజల అలవాటు వంటి అంశాల కారణంగా భారత్‌లో ప్రింట్ మీడియా ప్రాచుర్యం పొందిందని క్రిసిల్ వెల్లడించింది. -
గూగుల్, ఫేస్‌బుక్‌లతో ఆదాయం పంచుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రింట్ మీడియా సమస్యల పరిష్కారానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పలు సూచనలు చేశారు. ఆన్లైన్ వార్తలు ఎక్కువవుతున్నకొద్దీ ప్రింట్ మీడియాకు తగినన్ని ఆదాయ వనరులు సమకూర్చుకోవడం కష్టంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ వార్తల ద్వారా సమకూరే ఆదాయంలో అధికభాగం గూగుల్, ఫేస్బుక్ వంటి టెక్నాలజీ సంస్థలకే దక్కుతోందన్నారు. శుక్రవారం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసిన ఎంవీ కామత్ ఎండోమెంట్ లెక్చర్‌లో ‘జర్నలిజం.. గతం, వర్తమానం, భవిష్యత్తు’అన్న అంశంపై ఉపరాష్ట్రపతి ఆన్లైన్లో మాట్లాడారు. వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్న గూగుల్, ఫేస్బుక్, స్థానిక మీడియా సంస్థలు కలిసి తమ ఆదాయాన్ని తగురీతిలో పంచుకునేలా జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని ఆకాంక్షించారు. స్థానిక మీడియా సంస్థల వార్తలకు గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలు కొంత రుసుము చెల్లించేలా ఒక చట్టం చేసేందుకు ఆ్రస్టేలియా ప్రభుత్వం సిద్ధం కావడాన్ని ప్రస్తావించారు. వార్తలకు వ్యాఖ్యలు జోడించకండి ఉపగ్రహాలు, ఇంటర్నెట్లు అందుబాటులోకి రావడంతో వార్తా ప్రపంచం తల్లకిందులైనట్లు అయిందని, అసలు, నకిలీ వార్తల మధ్య అంతరం తగ్గిపోయి ఆందోళన రేకెత్తిస్తోందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం, వార్తల రిపోర్టింగ్‌లో తగిన పద్ధతులు పాటించకపోవడం, సామాజిక బాధ్యతాలోపం వంటివి ఎక్కువయ్యాయని, ఎల్లో జర్నలిజమ్, లాభాపేక్ష, నకిలీ వార్తల వంటివి ఆందోళన కలిగించే అంశాలన్నారు. వార్తలకు వ్యాఖ్యలను జోడించవద్దని సూచించారు. -
న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్ సుంకాన్ని తొలగించండి
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రింట్ మీడియాను ఆదుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఓవైపు ప్రకటనల ఆదాయాలు కోల్పోయి, మరోవైపు ముడి వస్తువుల వ్యయాలు.. న్యూస్‌ప్రింట్ దిగుమతి సుంకాలు భారీగా పెరిగిపోయి పత్రికా రంగం కుదేలవుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. న్యూస్‌ప్రింట్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని, న్యూస్‌పేపర్ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని ఐఎన్ఎస్ కోరింది. అలాగే, బీవోసీ ప్రకటన రేటును 50 శాతం, ప్రింట్ మీడియాకు బడ్జెట్‌ను 100% పెంచాలని విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన బకాయిలన్నీ తక్షణమే సెటిల్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి రవి మిట్టల్‌కు ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ మేరకు లేఖ రాశారు. ‘ముద్రణ వ్యయాలు అధికంగా ఉండే పత్రికలకు ప్రకటనల ఆదాయాలే కీలకం. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో పలు వ్యాపారాలు మూతబడి, ప్రకటనలు లేకపోవడంతో ఆదాయవనరు కోల్పోయినట్లయింది’ అని గుప్తా వివరించారు. చాలా మటుకు చిన్న, మధ్య స్థాయి పత్రికలు ఇప్పటికే ప్రచురణ నిలిపివేశాయని, మిగతావి పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇవి కూడా కుప్పకూలిన పక్షంలో దేశీ న్యూస్‌ప్రింట్ తయారీ పరిశ్రమపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదన్నారు. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే వారితో పాటు డెలివరీ బాయ్స్ దాకా చాలా మంది ఉపాధి కోల్పోయే ముప్పు ఉందని గుప్తా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా కోలుకునేందుకు తక్షణ తోడ్పాటు చర్యలు తీసుకోవాలని కోరారు. -
మీడియాలో పాక్షికత వాంఛనీయమా?
ఇటీవలి గతం కేసి చూస్తే కొన్ని వార్తా పత్రికలు విధానం కంటే ఒక టార్గెట్‌ను ప్రధానంగా ఎంచుకుంటున్నాయని తెలుస్తుంది. వివాదాస్పద అంశాలపై రెండు కోణాలను సమర్పించడం ద్వారా పాఠకులకు సమాచారం ఇవ్వడం కంటే ముందే లక్ష్యంగా చేసుకున్న బాధితుడిని నాశనం చేయడమే తమ ప్రాథమిక బాధ్యతగా ఈ పత్రికలు చేపట్టాయి. నిర్నిరోధంగా ఇవి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిందలు వేయడంలో, బురద జల్లడంలో మునిగితేలుతున్నాయి. తమ వార్తా కథనాలు, వ్యాఖ్యల్లో నిర్దిష్టత, వాస్తవానికి చెందిన ప్రాథమిక విలువలను ఇవి వదిలేశాయి. ఫ్రీ ప్రెస్‌ను నమ్ముతున్న మనం నేడు ఎదుర్కొంటున్న ముఖ్య ప్రశ్న ఏదంటే, ఒకరి వృత్తిగతమైన గౌరవానికి భంగం కలిగించకపోవడం ద్వారా.. యాజమాన్యం వైఖరితో పనిలేకుండా జర్నలిజాన్ని స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రమైన, పాక్షిక రహితమైనదిగా ఎలా తీర్చిదిద్దాలన్నదే. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో ప్రచురించిన, ప్రసారం చేసిన నిరాధార వార్తలపై స్పష్టీకరణలు ఇవ్వడానికి, ఫిర్యాదులు చేయడానికి, అవసరమైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఇంతవరకు సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఉంటున్న అధికారాలను ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు కూడా కట్టబెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 30న ఒక జీవో జారీ చేసింది. ఇది మీడియా వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2007 ఫిబ్రవరిలో జారీ చేసి నిరసనల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన జీవోకు ప్రస్తుత జీవో సరిపోలి ఉంది. కానీ వైఎస్సార్ ప్రభుత్వం తీసుకురాదలిచిన అదే జీవోను గత విభజనానంతర ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ప్రభుత్వం కాస్త మెరుగుపరిచి అమలులోకి తీసుకువచ్చిన విషయం గమనించాలి. ఈ జీవోను ప్రత్యేకించి సాక్షి సంపాదకులు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం ఉపయోగించింది కూడా. నిరాధార వార్తలు సమంజసమేనా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు, నిరాధార వార్తలను దురుద్దేశ పూర్వకంగా వ్యాప్తి చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఒక సెక్షన్ మీడియా చేస్తున్న ఉద్దేశపూర్వకమైన ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చింది. నిజమైన, సరైన సమాచారాన్ని ప్రజలకు అందచేయడానికి ఈ జీవో అవసరమని ఏపీ ప్రభుత్వం భావించింది. తమతమ విభాగాలకు, వ్యవహారాలకు సంబంధించి పూర్తి జ్ఞానం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు ఈ జీవో ద్వారా ప్రభుత్వం అధికారం కట్టబెట్టింది. ఇటీవలి పరిణామాలను చూస్తే కొన్ని వార్తా పత్రికలు విధానం కంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడంలోనే శ్రద్ధ చూపుతున్నాయని అనిపిస్తోంది. వివాదాస్పద అంశాలలోని భిన్న కోణాలను అందించడం ద్వారా పాఠకులకు సమాచారం ఇవ్వడం కంటే ముందే లక్ష్యంగా చేసుకున్న బాధితుడిని నాశనం చేయడమే తమ ప్రాథమిక బాధ్యతగా ఈ పత్రికలు వ్యవహరిస్తున్నాయి. వీటి సామర్థ్యానికి సంబంధించిన ప్రమాణాలు ఒక తరహా దాడితో మొదలై ఇతర విచారణలన్నింటినీ దానికి లోబర్చి వేస్తుంటాయి. నిర్నిరోధంగా ఇవి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిందలు వేయడంలో, బురద జల్లడంలో మునిగితేలుతున్నాయి. తమ వార్తా కథనాలు, వ్యాఖ్యల్లో నిర్దిష్టత, వాస్తవానికి సంబంధించిన ప్రాథమిక విలువలను కూడా ఇవి వదిలేశాయి. అహంభావపూరితమైన యజ మానుల పాక్షిక ప్రయోజనాలను నెరవేర్చడానికి పనికి వస్తుందేమో కానీ సహజంగానే ఇది స్వేచ్ఛాయుత మీడియాగా ఉండవలసిన వాటి పాత్రను కుదించివేస్తోంది. క్రిస్టియన్ సైన్స్ మోనిటర్ సంపాదకురాలిగా పనిచేసిన కేథరీన్ ఫేనింగ్ ఫ్రీ ప్రెస్ గురించి వ్యాఖ్యానిస్తూ, ‘‘స్వేచ్ఛాయుతంగా ఉండే పత్రికే బాధ్యతాయుతంగా ఉండగలదు. కానీ ఆంక్షలతో కూడిన పత్రిక బాధ్యతతో వ్యవహరించదు. ఆంక్షలు పెట్టారంటేనే వాస్తవాలను అవి పూర్తిగా వెల్లడించవని అర్థం. వాస్తవాలను తెలుసుకుని అన్నిరకాలుగా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని వారు నిర్ణయించుకోవడానికి అనుగుణంగా అందించలేవు’’ అని వ్యాఖ్యానించారు. వార్తా పత్రిక అధికారంలో ఉన్నవారికి సలహాదారూ కాదు, సహకారీ కాదని ఆమె చెప్పారు. జర్నలిజంలో అతి ముఖ్యమైనది పత్రికకి సంబంధించిన ప్రేరణ మాత్రమే. అయితే ఆ ప్రేరణ పాఠకులకు సమాచారం ఇవ్వడం కోసమా లేక రాజకీయ ప్రయోజనం కోసమో, సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమో ఉద్దేశించిందా అనేదే కీలకమైన అంశం అని ఆమె వివరించారు. ఏదైనా అడిగే హక్కు ఉంది కానీ... న్యూయార్క్ టైమ్స్ సంపాదకుడు ఏఎమ్ రోసంథాల్ అభిప్రాయం ప్రకారం, అమెరికా రాజ్యాంగానికి తొలి సవరణ జరిగిన తర్వాత కూడా సంపూర్ణ స్వేచ్ఛకు అది హామీ ఇవ్వలేదు. కొత్తగా వృత్తిలో చేరిన రిపోర్టరుగా, అమెరికన్ రాజ్యాంగానికి తొలి సవరణపై తాను తొలి పాఠం నేర్చుకున్నానని రోసంథాల్ చెప్పారు. ఆ తొలి సవరణ ఏం చెబుతోందంటే ఎవరినైనా, ఏదైనా అడిగే హక్కు నాకుంది. అదేసమయంలో దానికి జవాబును బహిరంగంగా కాక జనాంతికంగా చెప్పాలని అడిగే హక్కు కూడా అతనికి ఉంటుంది. స్వేచ్ఛాయుత మీడియాపై నమ్మకం ఉన్నవారిగా మనం ఇవాళ ముఖ్యమైన ప్రశ్న ఎదుర్కొంటున్నాం. జర్నలిజాన్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిష్పాక్షికంగా మలచడం ఎలా? యాజమాన్యం ప్రమేయం లేకుండా, ఒకరి వృత్తి గౌరవానికి భంగం కలిగించకుండా ఉండటం ఎలా అన్నవే ఆ ప్రశ్నలు. సుప్రసిద్ధ న్యాయపండితుడు, స్వేచ్ఛాయుత మీడియా భావన పట్ల పరిపూర్ణ విశ్వాçÜం కల పాల్కీవాలా.. మీడియాలో వ్యాపారీకరణ పెరిగే కొద్దీ అది సమాజ ఆరోగ్యంపై, ప్రజాస్వామ్యంపై దుష్ప్రభావం కలిగిస్తున్నదని, అలాగే జర్నలిజం వృత్తికూడా వ్యాపారీకరణకు బలవుతోందని చెప్పారు. భారతదేశంలో పత్రికావ్యవస్థ అనేక కారణాల వల్ల సంపూర్ణ స్వేచ్చను కలిగిలేదని పాల్కీవాలా చెప్పారు. జర్నలిస్టులకు స్వయంగా చైతన్యవంతం కావడం, స్వయం క్రమశిక్షణతో ఉండటమే కాకుండా స్వీయ నియంత్రణ కూడా అవసరమని పాల్కీవాలా చెప్పారు. హిందూస్తాన్ టైమ్స్ ఎడిటర్‌గా, తర్వాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకుడిగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టు ఎస్ ముల్గావ్కర్.. స్వేచ్ఛకు, ఇష్టానుసారంగా వ్యవహరించడానికి మధ్య లక్ష్మణ రేఖను చెరిగిపోవడం చూసి బాధపడ్డారు. ఇలాంటి పరిస్థితి రావడానికి తనవంటివారు తీసుకున్న నిర్ణయాలు కూడా కారణం అని ఆయన తన తప్పులను అంగీకరించారు. మీడియాలో పెరుగుతున్న పెడధోరణిని చూడవలసి వస్తున్నందుకు బాధపడుతున్నానని చెప్పారు. విశ్వసనీయతే ప్రశ్నార్థకం వార్తల కవరేజీలో బాధ్యతారహిత ధోరణి, జర్నలిస్టులు చేసే వ్యాఖ్యలు ఏ స్థాయికి వెళ్లాయంటే ప్రజల దృష్టిలో మీడియా విశ్వసనీయత ప్రశ్నార్థకమయ్యే స్థాయిలో దిగజారిపోయాయి. సమాజానికి తెలియజేయాలని అనుకుంటూ తన లక్ష్యాలను సిద్ధింపజేసుకోవడమా లేదా వారిని ఏమార్చి తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడమా ఏది ముఖ్యం అనేది పత్రికలు నిర్ణయించుకోవాలి. జర్నలిస్టు వృత్తిని నమ్రతతో కొనసాగించడంలో అయిదు దశాబ్దాలపాటు గడిపిన వ్యక్తిగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసి విచారిస్తున్నాను. వార్తలు పవిత్రమైనవి, వ్యాఖ్యలు స్వేచ్ఛాయుతమైనవి అనే స్వీయ ప్రమాణాలను నేడు జర్నలిజం తనకుతానుగా తోసివేస్తున్నట్లుగా ఉంది. నా జర్నలిజం ప్రయాణంలో ఏ సమయంలోకూడా ఇలాంటి అతిశయించిన ధోరణిని నేను ఎన్నడూ చూడలేదు. విశ్వసనీయత అనేది జర్నలిజానికి అత్యంత ప్రాథమిక అంశంగా ఉండాలనే అంశంలో నేడు విఫలం కావడమే దీనికి కారణం. మీడియా విశ్వసనీయతకు చెందిన ఈ విషాద ముఖచిత్రం ప్రస్తుతం జర్నలిజం తీరుతెన్నులకు చిత్రిక పడుతోంది. ప్రజాస్వామ్యం ప్రధాన రక్షణ దుర్గాల్లో ఒకటైన మీడియాకు ముప్పు కలిగేలా అపవిత్రం చేస్తున్నారని చెబుతూ ముల్గావ్కర్ చెప్పిన ప్రెస్ అంటే దేవాలయం అనే భావనను కాపాడుకోవలసి ఉంది. ఇవ్వాళ అత్యంత తరచుగా నిందలకు గురవుతున్న ఒక వృత్తి పేరు చెప్పండి అని ఎవరినైనా అడిగితే సమాధానం జర్నలిజం అనే వస్తుందని నా అంచనా. జర్నలిజం వృత్తిని తిరిగి అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి ఆ వృత్తిలో ఉంటున్నవారే వృత్తిగతతత్వం, మేధోపరమైన స్వాతంత్య్రం అనే పతకాన్ని పైకెత్తవలసిన అవసరం ఉంది. దీనికి చేయవలసిందల్లా పత్రికా స్వాతంత్య్రం పట్ల తమ నిబద్ధతను చెరిపివేస్తూ.. పాక్షిక మీడియా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు చెప్పని మాటల్ని ప్రచారంలో పెట్టడం, కపటవైఖరి వంటి పెడధోరణులకు ఫుల్ స్టాప్ పెట్టడమే. సి.హెచ్. రాజేశ్వరరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
ఇక పాఠకుల వ్యాఖ్యలకు ప్రాధాన్యత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న పత్రికలు ఓపక్క న్యూప్రింట్ ధరలు పెరిగిపోతుండడం, మరో పక్క రెవెన్యూ తగ్గిపోతుండడం వల్ల మనుగడ సాగించేందుకు కొత్త దారులు వెతుకుతున్నాయి. ఇప్పటికే డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టిన ఈ పత్రికలు డిజిటల్ మీడియా ద్వారా రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ‘హెరాల్డ్ సన్’ ట్యాబ్‌లైడ్‌ను ప్రచురిస్తున్న మెల్బోర్న్లోని ‘న్యూస్ కార్పోరేషన్ ఆస్ట్రేలియా’ తమ రిపోర్టర్లను ప్రోత్సహించడం ద్వారా ‘పేజ్ వ్యూస్’ను పెంచుకునే పథకానికి ఈ వారం శ్రీకారం చుట్టింది. పేజ్‌వ్యూస్‌ను బట్టి రిపోర్టర్ల కథనాలకు ఒక్కో కథనానికి పది డాలర్ల నుంచి 50 డాలర్ల వరకు రోజువారి బోనస్‌ను ప్రకటించింది. వారానికి కొన్ని వందల డాలర్లను సంపాదించుకునే అవకాశం దొరికిందని ‘హెరాల్డ్ సన్’ రిపోర్టర్లు మురిసి పోతున్నారు. క్రైమ్, సెక్స్, ఎంటర్టైన్మెంట్ వార్తలకే ‘పేజ్ వ్యూస్’ ఎక్కువ వస్తాయికనుక, అలాంటి వార్తల కోసమే రిపోర్టర్లు పోటీ పడాల్సి వస్తుందని, పర్యవసనంగా రాజకీయ వార్తలకు ఆదరణ తగ్గిపోతుందని సీనియర్ రిపోర్టర్లు వాపోతున్నారు. ఆస్ట్రేలియా మొత్తంలో 150 వేర్వేరు పత్రికలు కలిగిన ఈ సంస్థకు ఈ ఏడాది ఏడు శాతం రెవెన్యూ తగ్గింది. అదే సమయంలో డిజిటల్ సబ్క్రైబర్స్ 20.5 శాతం పెరిగారు. అంటే వారు 4,09,000 నుంచి 4,93,200లకు పెరిగారు. అయినప్పటికీ ముద్రణా మీడియాలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోలేకపోతోంది. అందుకని జర్నలిస్టులకు ఉద్వాసన పలుకుతోంది. ఈసారి మరో యాభై మంది జర్నలిస్టులకు ఉద్వాసన చెబుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. డిజిటల్ నైపుణ్యం లేనివారినే పంపిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మైఖేల్ మిల్లర్ ప్రకటించారు. ‘పేజ్ వ్యూస్’ పెరిగినంత మాత్రాన డిజిటల్ మీడియాకు యాడ్ రెవెన్యూ పెరగదని, డిజిటల్‌కు సంబంధించి యాడ్ వ్యవస్థ సంక్లిష్టమైనదని, నెంబర్లకన్నా ఉన్నత ప్రమాణాలుగల వార్తలు, ఉన్నత విలువలు కలిగిన రీడర్ల రద్దీ అవసరమని సర్చ్ ఇంజన్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ పాఠకులు తమ అభిప్రాయాలను వార్తా కథనం రాసిన రిపోర్టర్‌తో పంచుకునే అవకాశం ఉండాలని వారు అభిప్రాయ పడ్డారు. అన్నింటికన్నా ముఖ్యం స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం. ఇలాంటి అభిప్రాయాల నేపథ్యంలో పాఠకులు, వార్తా సంస్థలకు మధ్య మరింత అనుబంధాన్ని పెంచేందుకు అవసరమైన టూల్స్‌ను తయారు చేయాల్సిందిగా ‘ఫైర్ఫాక్స్ బ్రౌజర్’ను అభివృద్ధి చేసిన ‘మొజిల్లా’ డెవలపర్‌ను అమెరికాలోని ‘ది న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్’ పత్రికల యాజమాన్యాలు ఆశ్రయించాయి. దీన్ని ‘కోరల్ ప్రాజెక్ట్’గా అవి వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ దాత ‘నైట్ ఫౌండేషన్’ 40 లక్షల డాలర్లు చెల్లించారు. పాఠకులు వార్తలపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్ కింద ‘టాక్’ అనే ఫ్లాట్ఫారమ్ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి లోకల్ జర్నలిజం (స్థానిక ప్రజలకు సంబంధించిన వార్తా కథనాలు) అంతంత మాత్రంగానే ఉందని, దాన్ని విస్తరించడం ద్వారా స్థానికంగా యాడ్స్‌ను ఆకర్షించవచ్చని, తద్వారా రెవెన్యూను పెంచుకునే అవకాశం ఉందని కూడా సర్చ్ ఇంజన్ విశ్లేషకులు సూచిస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పాఠకులకు దగ్గరవడమే కాకుండా, స్థానిక వార్తా కథనాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. -
‘సాక్షి’కి మిషన్ కాకతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకంపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి బుధవారం అవార్డులను ప్రకటించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల్లో ఇద్దరు ‘సాక్షి’ జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ప్రింట్ మీడియా విభాగంలో సంగారెడ్డి జిల్లా ప్రతినిధి కల్వల మల్లికార్జున్‌రెడ్డి రాసిన ‘పడావు భూముల్లో సిరుల పంట’అందోల్ పెద్ద చెరువు విజయగాథ కథనానికి రాష్ట్ర స్థాయిలో మూడో బహుమతి లభించింది. చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు నెలవుగా ఉన్న అందోల్ పెద్ద చెరువు 30 ఏళ్లుగా పడావులో ఉన్న వైనాన్ని వివరిస్తూ.. రెండేళ్లుగా పుట్ల కొద్దీ ధాన్యంతో రైతులు పులకిస్తున్న తీరుకు ఈ కథనం అద్దం పట్టింది. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ‘సాక్షి’టీవీ ప్రతినిధి కొత్తకాపు విక్రమ్‌రెడ్డి ‘జలకళ’ పేరిట మిషన్ కాకతీయ ఫలితాలతో సాగు విస్తీర్ణం పెరిగిన తీరుపై ఇచ్చిన ప్రత్యేక కథనానికి రాష్ట్ర స్థాయిలో మూడో బహుమతి లభించింది. అవార్డుకు ఎంపికైన సాక్షి పాత్రికేయులు అవార్డుతో పాటు రూ.50 వేల నగదును త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవంలో అందుకోనున్నారు. -
ప్రింట్, నిర్మాణం, రిటైల్ రంగంలో మరిన్ని ఎఫ్‌డీఐలు
న్యూడిల్లీ: ప్రింట్ మీడియా, నిర్మాణం, రిటైల్ రంగాల్లో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ అంశంపై బుధవారం ఆర్థిక మంత్రిత్వశాఖలో వివరణాత్మక చర్చలు జరిగాయి. ఈ ప్రతిపాదనలపై తుది ఆమోదం పొందేందుకు కేంద్ర, వాణిజ్య మంత్రిత్వశాఖ త్వరలో కేంద్ర కేబినెట్‌ను సంప్రదించనుంది. ప్రస్తుతం ఎఫ్‌డీఐ నిబంధనలను మరింత సరళతరం చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్ధిక వృద్ధికి ఉద్యోగాలను సృష్టించేందుకు పెట్టుబడిదారుల స్నేహపూర్వక వాతావరణంలో మరిన్ని ఎఫ్‌డిఐలను ఆకర్షించనుందని తెలిపాయి. 2017-18 సంవత్సర ఆర్థిక బడ్జెట్లో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన మేరకు ఈ కసరత్తు చేస్తోంది. విదేశీ పెట్టుబడులు కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులపై దృష్టిపెట్టింది. సింగిల్ బ్రాండు, బహుళ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్‌లో పాలసీని సులభతరం చేస్తుంది. ఒకే బ్రాండ్ రిటైల్ రంగంలో 100 శాతం ఎఫ్‌డిఐని కొన్ని పరిస్థితులతో ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం, 49 శాతం వరకు ఆటోమాటిక్ మార్గంలో అనుమతి ఉంది కానీ ఆ పరిమితి దాటితే ప్రభుత్వం ఆమోదం అవసరం. అంతేకాదు, విదేశీ కంపెనీలకు 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను అమ్మడం కోసం దుకాణాలు తెరిచేందుకు అనుమతినివ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని నిబంధనలు, పరిమితులతో, వార్తాపత్రికలు, శాస్త్రీయ మ్యాగజైన్ల ప్రచురణ లాంటి విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం అనుమతిస్తోంది. అలాగే వివిధ కండిషన్లతో నిర్మాణ రంగ ప్రాజెక్టులలో 100శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఈ విధానాన్ని కూడా మరింత సరళతరం చేసే ప్రతిపాదన సిద్ధం చేసింది. పూర్తికాని ప్లాట్లు, ఇతర ప్రాజెక్టులలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఒక భారతీయకంపెనీ అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది. ఇండియన్ ఇన్వస్టీ కంపెనీకి అభివృద్ధి చెందిన ప్లాట్లను విక్రయించటానికి అనుమతి ఉంది. రహదారులు, నీటి సరఫరా, వీధి దీపాలు, నీటి పారుదల , మురికినీరు తదితర మౌలిక సదుపాయాలు ఉన్న ప్లాట్ల విక్రయానికి మాత్రమే అనుమతి. కాగా విదేశీ పెట్టుబడులు దేశం చెల్లింపుల సమతుల్యతను మెరుగుపర్చడంతో పాటు, ఇతర ప్రపంచ కరెన్సీలకు, ప్రత్యేకంగా అమెరికా డాలర్ వ్యతిరేకంగా రూపాయి విలువను మరింత బలోపేతం చేస్తుందనేది అంచనా. ఈ నేపథ్యంలోనే గత ఏడాది రక్షణ, పౌర విమానయాన, నిర్మాణం, అభివృద్ధి, ప్రైవేటు భద్రతా సంస్థలు, రియల్ ఎస్టేట్, న్యూస్ ప్రసారాలు సహా దాదాపు 12 సెక్టార్లలో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది. -
దూసుకెళ్తున్న ప్రింట్ మీడియా
పదేళ్లలో 2.37 కోట్లు పెరిగిన ప్రతుల సంఖ్య: ఏబీసీ సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ప్రింట్ మీడియా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) వెల్లడించింది. అక్షరాస్యత పెరగడం, పత్రికా పఠనం దైనందిన జీవితంలో ఓ భాగంగా మారడం, పత్రికలు, వాటి ధరలు అందుబాటులో ఉండడంతో ప్రింట్ మీడియాకు ఆదరణ పెరుగుతోందని పేర్కొంది. పదేళ్లలో పత్రికల ప్రతుల సంఖ్యలో ఏకంగా 2.37 కోట్ల పెరుగుదల నమోదైందని, వార్షిక వృద్ధిరేటు 4.87 శాతంగా ఉందని తెలిపింది. 2006లో ప్రతుల సంఖ్య రోజుకు 3.91 కోట్లు ఉండగా.. 2016 నాటికి అది 6.28 కోట్లకు చేరిందని సోమవారం ఒక ప్రకటనలో వివరించింది. అలాగే ప్రచురణ కేంద్రాల సంఖ్య 251 మేర పెరిగినట్లు తెలిపింది. 2006లో 659 ప్రచురణ కేంద్రాలు ఉండగా.. 2016 నాటికి 910కి చేరినట్టు పేర్కొంది. -
పత్రికలకు మార్కులు
ప్రకటనల మంజూరుకు కేంద్రం కొత్త విధానం న్యూఢిల్లీ: ప్రింట్ మీడియాలో వార్తాపత్రికలకు ప్రభుత్వ ప్రకటనల జారీ కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మార్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రకటనల జారీలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం రూపొందించిన ఈ విధాన వివరాల్ని డైరక్టరేట్ ఆఫ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ) శుక్రవారం విడుదల చేసింది. వృత్తిపరంగా ఉత్తమ ప్రమాణాలు పాటిస్తూ, సర్క్యులేషన్‌ను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్(ఏబీసీ) లేదా రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్‌ఎన్‌ఎ)తో తనిఖీ చేయించుకునే పత్రికల్ని ప్రోత్సహించేందుకు తొలిసారి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మార్కుల పద్ధతిలో 6 అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఏబీసీ/ఆర్ఎన్ఏతో సర్క్యులేషన్ తనిఖీకి(25 మార్కులు), ఉద్యోగులకు ఈపీఎఫ్ చెల్లిస్తే(20 మార్కులు), పేజీల సంఖ్యకు(20 మార్కులు), పీటీఐ/యూఎన్ఐ/హిందుస్తాన్ సమాచార్ వార్తా సంస్థల్లో సభ్యత్వముంటే(15 మార్కులు), సొంత ప్రింటింగ్ ప్రెస్‌కు(10 మార్కులు), పీసీఐ వార్షికసభ్యత్వ చెల్లింపునకు(10 మార్కులు) కేటాయిస్తారు. సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా డీఏవీపీ ప్రకటనలు కేటాయిస్తుంది. సర్క్యులేషన్.. రోజుకు 45 వేలు మించితే ఆర్ఎన్ఐ లేదా ఏబీసీ ధ్రువీకరణ పొందాల్సి ఉండగా... 45 వేల లోపు అయితే చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ ధ్రువీకరించాలి. జారీ తేదీ నుంచి రెండేళ్ల వరకూ ఆర్ఎన్ఐ ధ్రువీకరణ చెల్లుబాటు అవుతుంది. ఏబీసీ ప్రకారమైతే ప్రస్తుత ధ్రువీకరణనే సర్క్యులేషన్ సర్టిఫికెట్‌గా వాడొచ్చు. ఆర్ఎన్ఐ లేదా దాని ప్రతినిధుల ద్వారా సర్క్యులేషన్‌ను తనిఖీ చేయించుకునే హక్కు డీఏవీపీ డైరక్టర్ జనరల్‌కు ఉంటుంది. ఈ విధానం ప్రకారం వార్తాపత్రికలు, జర్నల్స్‌ను చిన్న స్థాయి(రోజుకు 25 వేల కంటే తక్కువ కాపీలు), మధ్య స్థాయి(25,001-75,000), భారీస్థాయి (రోజుకు 75వేలకు పైగా) గా విభజించారు. ప్రాంతీయ భాషా పత్రికలు, చిన్న, మధ్య స్థాయితో పాటు లక్ష కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలు, ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ వంటి ప్రాంతాల పత్రికల్ని ప్రోత్సహించేందుకు పాలసీలో వెసులుబాట్లు కల్పించారు. -
ఏటా 5.08% పెరుగుతున్న ప్రింట్ మీడియా
పత్రికల ఆడిట్ సంస్థ ఏబీసీ వెల్లడి ముంబై: విదేశాల మాదిరి కాకుండా భారత్‌లో ప్రచురణ మాధ్యమం అంతకంతకూ పెరుగుతోంది. టెలివిజన్, రేడియో, డిజిటల్ మీడియా నుంచి తీవ్రపోటీని తట్టుకుంటూ కూడా దేశంలో ప్రింట్ మీడియా ఏటా 5.04 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నట్లు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) తెలియజేసింది. ఈ సంస్థ 68 ఏళ్లుగా పత్రికల సర్క్యులేషన్‌ను ప్రతి 6 నెలలకు ధ్రువీకరిస్తుంటుంది. 90 ఆడిటింగ్ సంస్థల ద్వారా ప్రాసెస్ చేసి గణాంకాలను ధ్రువపరుస్తున్నట్లు ఏబీసీ తెలియజేసింది. ప్రస్తుతం తమ పరిధిలో 669 వార్తా పత్రికలు, 50 మ్యాగజైన్లు నమోదై ఉన్నట్లు సంస్థ తెలిపింది. గడిచిన ఎనిమిదేళ్లుగా ఏటా 5.04 శాతం చొప్పున ప్రింట్ మీడియా పెరుగుతూనే వస్తోంది. ‘ప్రస్తుత పత్రికలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో పాటు కొత్త పత్రికలూ పుట్టుకొస్తున్నాయి. అందుకే ఈ వృద్ధి సాధ్యమైంది’ అని సంస్థ తెలిపింది. -
వార్త, వ్యాఖ్యానం మధ్య తేడా ఏదీ: జైట్లీ
న్యూఢిల్లీ: మీడియాలో వార్తలు, వ్యాఖ్యానాల మధ్య తేడా తగ్గుతూ ఉండటంతో వీక్షకులు, పాఠకులు వాస్తవాల కోసం వెదుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారమిక్కడ ‘ప్రెస్ ఇన్ ఇండియా 2014-15’ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. విస్తృతంగా టీవీ చానళ్లు వస్తున్నప్పటికీ, వాటిలో అనేక చర్చలు జరుగుతున్నప్పటికీ వాస్తవాలను తెలుసుకోవాలనే వీక్షకుల తృష్ణను అవి తీర్చలేకపోతున్నాయని అన్నారు. సమాచారం అనేది పవిత్రమైందని.. దానిని యథాతథంగా పాఠకులకు అందించాలని అన్నారు. పత్రికారంగంలో 5.8% వృద్ధి.. దేశంలో 2014-15లో ప్రింట్ మీడియా 5.8 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఈ కాలంలో 5,817 కొత్త పత్రికలు రిజిష్టర్ అయ్యాయి. దీంతో పత్రికల సంఖ్య 1,05,443కు చేరింది. దేశం మొత్తమ్మీద అత్యధిక వార్తాపత్రికలు, పీరియాడికల్స్ హిందీ భాషలో 42,493గా ఉండగా, రెండోస్థానంలో 13,661తో ఇంగ్లిష్ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఈమేరకు రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఇన్ ఇండియా(ఆర్ఎన్ఐ) రూపొందించిన ‘ప్రెస్ ఇన్ ఇండియా 2014-15’ నివేదికను జైట్లీ విడుదల చేశారు. 2014-15లో అన్ని పత్రికల సర్క్యులేషన్ రోజుకు 51,05,21,445 కాపీలు. హిందీ పత్రికలు 25,77,61,985 సర్క్యులేషన్‌తో మొదటిస్థానంలో కొనసాగుతుండగా, 6,26,62,670తో ఇంగ్లిష్ పత్రికలు రెండో స్థానంలో, 4,12,73,949 కాపీలతో ఉర్దూ పత్రికలు మూడో స్థానంలో ఉన్నాయి. -
ఫోర్త్ ఎస్టేట్ : మీడియాకు సర్కారు పాఠాలు