
సాక్షి, హైదరాబాద్: ప్రింట్ మీడియా సమస్యల పరిష్కారానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్ వార్తలు ఎక్కువవుతున్నకొద్దీ ప్రింట్ మీడియాకు తగినన్ని ఆదాయ వనరులు సమకూర్చుకోవడం కష్టంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ వార్తల ద్వారా సమకూరే ఆదాయంలో అధికభాగం గూగుల్, ఫేస్‌బుక్ వంటి టెక్నాలజీ సంస్థలకే దక్కుతోందన్నారు. శుక్రవారం మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసిన ఎంవీ కామత్ ఎండోమెంట్ లెక్చర్‌లో ‘జర్నలిజం.. గతం, వర్తమానం, భవిష్యత్తు’అన్న అంశంపై ఉపరాష్ట్రపతి ఆన్‌లైన్‌లో మాట్లాడారు. వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్న గూగుల్, ఫేస్‌బుక్, స్థానిక మీడియా సంస్థలు కలిసి తమ ఆదాయాన్ని తగురీతిలో పంచుకునేలా జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని ఆకాంక్షించారు. స్థానిక మీడియా సంస్థల వార్తలకు గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు కొంత రుసుము చెల్లించేలా ఒక చట్టం చేసేందుకు ఆ్రస్టేలియా ప్రభుత్వం సిద్ధం కావడాన్ని ప్రస్తావించారు.
వార్తలకు వ్యాఖ్యలు జోడించకండి
ఉపగ్రహాలు, ఇంటర్నెట్‌లు అందుబాటులోకి రావడంతో వార్తా ప్రపంచం తల్లకిందులైనట్లు అయిందని, అసలు, నకిలీ వార్తల మధ్య అంతరం తగ్గిపోయి ఆందోళన రేకెత్తిస్తోందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం, వార్తల రిపోర్టింగ్‌లో తగిన పద్ధతులు పాటించకపోవడం, సామాజిక బాధ్యతాలోపం వంటివి ఎక్కువయ్యాయని, ఎల్లో జర్నలిజమ్, లాభాపేక్ష, నకిలీ వార్తల వంటివి ఆందోళన కలిగించే అంశాలన్నారు. వార్తలకు వ్యాఖ్యలను జోడించవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment