సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న పత్రికలు ఓపక్క న్యూప్రింట్ ధరలు పెరిగిపోతుండడం, మరో పక్క రెవెన్యూ తగ్గిపోతుండడం వల్ల మనుగడ సాగించేందుకు కొత్త దారులు వెతుకుతున్నాయి. ఇప్పటికే డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టిన ఈ పత్రికలు డిజిటల్ మీడియా ద్వారా రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ‘హెరాల్డ్ సన్’ ట్యాబ్‌లైడ్‌ను ప్రచురిస్తున్న మెల్‌బోర్న్‌లోని ‘న్యూస్ కార్పోరేషన్ ఆస్ట్రేలియా’ తమ రిపోర్టర్లను ప్రోత్సహించడం ద్వారా ‘పేజ్ వ్యూస్’ను పెంచుకునే పథకానికి ఈ వారం శ్రీకారం చుట్టింది.
పేజ్‌వ్యూస్‌ను బట్టి రిపోర్టర్ల కథనాలకు ఒక్కో కథనానికి పది డాలర్ల నుంచి 50 డాలర్ల వరకు రోజువారి బోనస్‌ను ప్రకటించింది. వారానికి కొన్ని వందల డాలర్లను సంపాదించుకునే అవకాశం దొరికిందని ‘హెరాల్డ్ సన్’ రిపోర్టర్లు మురిసి పోతున్నారు. క్రైమ్, సెక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వార్తలకే ‘పేజ్ వ్యూస్’ ఎక్కువ వస్తాయికనుక, అలాంటి వార్తల కోసమే రిపోర్టర్లు పోటీ పడాల్సి వస్తుందని, పర్యవసనంగా రాజకీయ వార్తలకు ఆదరణ తగ్గిపోతుందని సీనియర్ రిపోర్టర్లు వాపోతున్నారు. ఆస్ట్రేలియా మొత్తంలో 150 వేర్వేరు పత్రికలు కలిగిన ఈ సంస్థకు ఈ ఏడాది ఏడు శాతం రెవెన్యూ తగ్గింది. అదే సమయంలో డిజిటల్ సబ్‌క్రైబర్స్ 20.5 శాతం పెరిగారు. అంటే వారు 4,09,000 నుంచి 4,93,200లకు పెరిగారు.
అయినప్పటికీ ముద్రణా మీడియాలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోలేకపోతోంది. అందుకని జర్నలిస్టులకు ఉద్వాసన పలుకుతోంది. ఈసారి మరో యాభై మంది జర్నలిస్టులకు ఉద్వాసన చెబుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. డిజిటల్ నైపుణ్యం లేనివారినే పంపిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మైఖేల్ మిల్లర్ ప్రకటించారు. ‘పేజ్ వ్యూస్’ పెరిగినంత మాత్రాన డిజిటల్ మీడియాకు యాడ్ రెవెన్యూ పెరగదని, డిజిటల్‌కు సంబంధించి యాడ్ వ్యవస్థ సంక్లిష్టమైనదని, నెంబర్లకన్నా ఉన్నత ప్రమాణాలుగల వార్తలు, ఉన్నత విలువలు కలిగిన రీడర్ల రద్దీ అవసరమని సర్చ్ ఇంజన్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ పాఠకులు తమ అభిప్రాయాలను వార్తా కథనం రాసిన రిపోర్టర్‌తో పంచుకునే అవకాశం ఉండాలని వారు అభిప్రాయ పడ్డారు. అన్నింటికన్నా ముఖ్యం స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం.
ఇలాంటి అభిప్రాయాల నేపథ్యంలో పాఠకులు, వార్తా సంస్థలకు మధ్య మరింత అనుబంధాన్ని పెంచేందుకు అవసరమైన టూల్స్‌ను తయారు చేయాల్సిందిగా ‘ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్’ను అభివృద్ధి చేసిన ‘మొజిల్లా’ డెవలపర్‌ను అమెరికాలోని ‘ది న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్’ పత్రికల యాజమాన్యాలు ఆశ్రయించాయి. దీన్ని ‘కోరల్ ప్రాజెక్ట్’గా అవి వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ దాత ‘నైట్ ఫౌండేషన్’ 40 లక్షల డాలర్లు చెల్లించారు. పాఠకులు వార్తలపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్ కింద ‘టాక్’ అనే ఫ్లాట్‌ఫారమ్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి లోకల్ జర్నలిజం (స్థానిక ప్రజలకు సంబంధించిన వార్తా కథనాలు) అంతంత మాత్రంగానే ఉందని, దాన్ని విస్తరించడం ద్వారా స్థానికంగా యాడ్స్‌ను ఆకర్షించవచ్చని, తద్వారా రెవెన్యూను పెంచుకునే అవకాశం ఉందని కూడా సర్చ్ ఇంజన్ విశ్లేషకులు సూచిస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పాఠకులకు దగ్గరవడమే కాకుండా, స్థానిక వార్తా కథనాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment