మీడియాలో పాక్షికత వాంఛనీయమా? | CH Rajeswara Rao Article On Media | Sakshi
Sakshi News home page

మీడియాలో పాక్షికత వాంఛనీయమా?

Published Thu, Nov 7 2019 1:14 AM | Last Updated on Thu, Nov 7 2019 1:14 AM

CH Rajeswara Rao Article On Media - Sakshi

ఇటీవలి గతం కేసి చూస్తే కొన్ని వార్తా పత్రికలు విధానం కంటే ఒక టార్గెట్‌ను ప్రధానంగా ఎంచుకుంటున్నాయని తెలుస్తుంది. వివాదాస్పద అంశాలపై రెండు కోణాలను సమర్పించడం ద్వారా పాఠకులకు సమాచారం ఇవ్వడం కంటే ముందే లక్ష్యంగా చేసుకున్న బాధితుడిని నాశనం చేయడమే తమ ప్రాథమిక బాధ్యతగా ఈ పత్రికలు చేపట్టాయి. నిర్నిరోధంగా ఇవి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిందలు వేయడంలో, బురద జల్లడంలో మునిగితేలుతున్నాయి. తమ వార్తా కథనాలు, వ్యాఖ్యల్లో నిర్దిష్టత, వాస్తవానికి చెందిన ప్రాథమిక విలువలను ఇవి వదిలేశాయి. ఫ్రీ ప్రెస్‌ను నమ్ముతున్న మనం నేడు ఎదుర్కొంటున్న ముఖ్య ప్రశ్న ఏదంటే, ఒకరి వృత్తిగతమైన గౌరవానికి భంగం కలిగించకపోవడం ద్వారా.. యాజమాన్యం వైఖరితో పనిలేకుండా జర్నలిజాన్ని స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రమైన, పాక్షిక రహితమైనదిగా ఎలా తీర్చిదిద్దాలన్నదే.

ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్‌ మీడియాలలో ప్రచురించిన, ప్రసారం చేసిన నిరాధార వార్తలపై స్పష్టీకరణలు ఇవ్వడానికి, ఫిర్యాదులు చేయడానికి, అవసరమైతే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఇంతవరకు సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఉంటున్న అధికారాలను ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు కూడా కట్టబెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్టోబర్‌ 30న ఒక జీవో జారీ చేసింది. ఇది మీడియా వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.
 
గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2007 ఫిబ్రవరిలో జారీ చేసి నిరసనల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన జీవోకు ప్రస్తుత జీవో సరిపోలి ఉంది. కానీ వైఎస్సార్‌ ప్రభుత్వం తీసుకురాదలిచిన అదే జీవోను గత విభజనానంతర ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ప్రభుత్వం కాస్త మెరుగుపరిచి అమలులోకి తీసుకువచ్చిన విషయం గమనించాలి. ఈ జీవోను ప్రత్యేకించి సాక్షి సంపాదకులు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం ఉపయోగించింది కూడా.

నిరాధార వార్తలు సమంజసమేనా?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు, నిరాధార వార్తలను దురుద్దేశ పూర్వకంగా వ్యాప్తి చేస్తూ  ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఒక సెక్షన్‌ మీడియా చేస్తున్న ఉద్దేశపూర్వకమైన ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చింది. నిజమైన, సరైన సమాచారాన్ని ప్రజలకు అందచేయడానికి ఈ జీవో అవసరమని ఏపీ ప్రభుత్వం భావించింది. తమతమ విభాగాలకు, వ్యవహారాలకు సంబంధించి పూర్తి జ్ఞానం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు ఈ జీవో ద్వారా ప్రభుత్వం అధికారం కట్టబెట్టింది.

ఇటీవలి పరిణామాలను చూస్తే కొన్ని వార్తా పత్రికలు విధానం కంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడంలోనే శ్రద్ధ చూపుతున్నాయని అనిపిస్తోంది. వివాదాస్పద అంశాలలోని భిన్న కోణాలను అందించడం ద్వారా పాఠకులకు సమాచారం ఇవ్వడం కంటే ముందే లక్ష్యంగా చేసుకున్న బాధితుడిని నాశనం చేయడమే తమ ప్రాథమిక బాధ్యతగా ఈ పత్రికలు వ్యవహరిస్తున్నాయి. వీటి సామర్థ్యానికి సంబంధించిన ప్రమాణాలు ఒక తరహా దాడితో మొదలై ఇతర విచారణలన్నింటినీ దానికి లోబర్చి వేస్తుంటాయి.

నిర్నిరోధంగా ఇవి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిందలు వేయడంలో, బురద జల్లడంలో మునిగితేలుతున్నాయి. తమ వార్తా కథనాలు, వ్యాఖ్యల్లో నిర్దిష్టత, వాస్తవానికి సంబంధించిన ప్రాథమిక విలువలను కూడా ఇవి వదిలేశాయి. అహంభావపూరితమైన యజ మానుల పాక్షిక ప్రయోజనాలను నెరవేర్చడానికి పనికి వస్తుందేమో కానీ సహజంగానే ఇది స్వేచ్ఛాయుత మీడియాగా ఉండవలసిన వాటి పాత్రను కుదించివేస్తోంది. 

క్రిస్టియన్‌ సైన్స్‌ మోనిటర్‌ సంపాదకురాలిగా పనిచేసిన కేథరీన్‌ ఫేనింగ్‌ ఫ్రీ ప్రెస్‌ గురించి వ్యాఖ్యానిస్తూ, ‘‘స్వేచ్ఛాయుతంగా ఉండే పత్రికే బాధ్యతాయుతంగా ఉండగలదు. కానీ ఆంక్షలతో కూడిన పత్రిక బాధ్యతతో వ్యవహరించదు. ఆంక్షలు పెట్టారంటేనే వాస్తవాలను అవి పూర్తిగా వెల్లడించవని అర్థం. వాస్తవాలను తెలుసుకుని అన్నిరకాలుగా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని వారు నిర్ణయించుకోవడానికి అనుగుణంగా అందించలేవు’’ అని వ్యాఖ్యానించారు. 

వార్తా పత్రిక అధికారంలో ఉన్నవారికి సలహాదారూ కాదు, సహకారీ కాదని ఆమె చెప్పారు. జర్నలిజంలో అతి ముఖ్యమైనది పత్రికకి సంబంధించిన ప్రేరణ మాత్రమే. అయితే ఆ ప్రేరణ పాఠకులకు సమాచారం ఇవ్వడం కోసమా లేక రాజకీయ ప్రయోజనం కోసమో, సర్క్యులేషన్‌ పెంచుకోవడం కోసమో ఉద్దేశించిందా అనేదే కీలకమైన అంశం అని ఆమె వివరించారు.

ఏదైనా అడిగే హక్కు ఉంది కానీ...
న్యూయార్క్‌ టైమ్స్‌ సంపాదకుడు ఏఎమ్‌ రోసంథాల్‌ అభిప్రాయం ప్రకారం, అమెరికా రాజ్యాంగానికి తొలి సవరణ జరిగిన తర్వాత కూడా సంపూర్ణ స్వేచ్ఛకు అది హామీ ఇవ్వలేదు. కొత్తగా వృత్తిలో చేరిన రిపోర్టరుగా, అమెరికన్‌ రాజ్యాంగానికి తొలి సవరణపై తాను తొలి పాఠం నేర్చుకున్నానని రోసంథాల్‌ చెప్పారు. ఆ తొలి సవరణ ఏం చెబుతోందంటే ఎవరినైనా, ఏదైనా అడిగే హక్కు నాకుంది. అదేసమయంలో దానికి జవాబును బహిరంగంగా కాక జనాంతికంగా చెప్పాలని అడిగే హక్కు కూడా అతనికి ఉంటుంది. 

స్వేచ్ఛాయుత మీడియాపై నమ్మకం ఉన్నవారిగా మనం ఇవాళ ముఖ్యమైన ప్రశ్న ఎదుర్కొంటున్నాం. జర్నలిజాన్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిష్పాక్షికంగా మలచడం ఎలా? యాజమాన్యం ప్రమేయం లేకుండా, ఒకరి వృత్తి గౌరవానికి భంగం కలిగించకుండా ఉండటం ఎలా అన్నవే ఆ ప్రశ్నలు.
సుప్రసిద్ధ న్యాయపండితుడు, స్వేచ్ఛాయుత మీడియా భావన పట్ల పరిపూర్ణ విశ్వాçÜం కల పాల్కీవాలా.. మీడియాలో వ్యాపారీకరణ పెరిగే కొద్దీ అది సమాజ ఆరోగ్యంపై, ప్రజాస్వామ్యంపై దుష్ప్రభావం కలిగిస్తున్నదని, అలాగే జర్నలిజం వృత్తికూడా వ్యాపారీకరణకు బలవుతోందని చెప్పారు.
భారతదేశంలో పత్రికావ్యవస్థ అనేక కారణాల వల్ల సంపూర్ణ స్వేచ్చను కలిగిలేదని పాల్కీవాలా చెప్పారు. జర్నలిస్టులకు స్వయంగా చైతన్యవంతం కావడం, స్వయం క్రమశిక్షణతో ఉండటమే కాకుండా స్వీయ నియంత్రణ కూడా అవసరమని పాల్కీవాలా చెప్పారు. 

హిందూస్తాన్‌ టైమ్స్‌ ఎడిటర్‌గా, తర్వాత ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదకుడిగా పనిచేసిన సీనియర్‌ జర్నలిస్టు ఎస్‌ ముల్గావ్‌కర్‌.. స్వేచ్ఛకు,  ఇష్టానుసారంగా వ్యవహరించడానికి మధ్య లక్ష్మణ రేఖను చెరిగిపోవడం చూసి బాధపడ్డారు. ఇలాంటి పరిస్థితి రావడానికి తనవంటివారు తీసుకున్న  నిర్ణయాలు కూడా కారణం అని ఆయన తన తప్పులను అంగీకరించారు. మీడియాలో పెరుగుతున్న పెడధోరణిని చూడవలసి వస్తున్నందుకు బాధపడుతున్నానని చెప్పారు. 
విశ్వసనీయతే ప్రశ్నార్థకం

వార్తల కవరేజీలో బాధ్యతారహిత ధోరణి, జర్నలిస్టులు చేసే వ్యాఖ్యలు ఏ స్థాయికి వెళ్లాయంటే ప్రజల దృష్టిలో మీడియా విశ్వసనీయత ప్రశ్నార్థకమయ్యే స్థాయిలో దిగజారిపోయాయి. సమాజానికి తెలియజేయాలని అనుకుంటూ తన లక్ష్యాలను సిద్ధింపజేసుకోవడమా లేదా వారిని ఏమార్చి తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడమా ఏది ముఖ్యం అనేది పత్రికలు నిర్ణయించుకోవాలి. 

జర్నలిస్టు వృత్తిని నమ్రతతో కొనసాగించడంలో అయిదు దశాబ్దాలపాటు గడిపిన వ్యక్తిగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసి విచారిస్తున్నాను. వార్తలు పవిత్రమైనవి, వ్యాఖ్యలు స్వేచ్ఛాయుతమైనవి అనే స్వీయ ప్రమాణాలను నేడు జర్నలిజం తనకుతానుగా తోసివేస్తున్నట్లుగా ఉంది. నా జర్నలిజం ప్రయాణంలో ఏ సమయంలోకూడా ఇలాంటి అతిశయించిన ధోరణిని నేను ఎన్నడూ చూడలేదు. విశ్వసనీయత అనేది జర్నలిజానికి అత్యంత ప్రాథమిక అంశంగా ఉండాలనే అంశంలో నేడు విఫలం కావడమే దీనికి కారణం.

మీడియా విశ్వసనీయతకు చెందిన ఈ విషాద ముఖచిత్రం ప్రస్తుతం జర్నలిజం తీరుతెన్నులకు చిత్రిక పడుతోంది. ప్రజాస్వామ్యం ప్రధాన రక్షణ దుర్గాల్లో ఒకటైన మీడియాకు ముప్పు కలిగేలా అపవిత్రం చేస్తున్నారని చెబుతూ ముల్గావ్‌కర్‌ చెప్పిన ప్రెస్‌ అంటే దేవాలయం అనే భావనను కాపాడుకోవలసి ఉంది. ఇవ్వాళ అత్యంత తరచుగా నిందలకు గురవుతున్న ఒక వృత్తి పేరు చెప్పండి అని ఎవరినైనా అడిగితే సమాధానం జర్నలిజం అనే వస్తుందని నా అంచనా.

జర్నలిజం వృత్తిని తిరిగి అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి ఆ వృత్తిలో ఉంటున్నవారే వృత్తిగతతత్వం, మేధోపరమైన స్వాతంత్య్రం అనే పతకాన్ని పైకెత్తవలసిన అవసరం ఉంది. దీనికి చేయవలసిందల్లా పత్రికా స్వాతంత్య్రం పట్ల తమ నిబద్ధతను చెరిపివేస్తూ.. పాక్షిక మీడియా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు చెప్పని మాటల్ని ప్రచారంలో పెట్టడం, కపటవైఖరి వంటి పెడధోరణులకు ఫుల్‌ స్టాప్‌ పెట్టడమే.
సి.హెచ్‌. రాజేశ్వరరావు 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement