
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రింట్ మీడియా ఆదాయంలో 25 శాతం వరకు వృద్ది ఉండొచ్చని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ నివేదిక వెల్లడించింది. ప్రకటనలు అధికం కావడమే ఇందుకు కారణమని వివరించింది.
ప్రకటనల ఆదాయం 25–30 శాతం, సర్క్యులేషన్ ఆదాయం 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా న్యూస్‌ప్రింట్ ఖర్చుల భారం అధికం అయింది. ఇది లాభదాయకతను తగ్గిస్తుంది. ప్రింట్ మీడియా సంస్థల నిర్వహణ లాభాల మార్జిన్‌లు 3 శాతం పాయింట్ల వరకు క్షీణిస్తాయి. 2020–21లో వినియోగించిన న్యూస్‌ప్రింట్‌లో 60 శాతం దిగుమతి చేసుకున్నదే.
యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి న్యూస్ ప్రింట్ ధర 80 శాతం దాకా దూసుకెళ్లింది. దిగుమతులు తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో న్యూస్ ప్రింట్ మరింత ప్రియం అయ్యే అవకాశం ఉంది. సర్క్యులేషన్, ప్రకటనల పరిమాణం పునరుద్ధరణతో న్యూస్‌ప్రింట్ వినియోగంలో పెరుగుదలకు దారి తీస్తుంది’ అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment