న్యూఢిల్లీ: ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ‘రుణమాఫీ’ ఆఫర్‌లకు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనల బారిన పడవద్దని రిజర్వ్ బ్యాంక్ ప్రజలను హెచ్చరించింది. రుణమాఫీని ఆఫర్ చేస్తూ రుణగ్రహీతలను ప్రలోభపెట్టే కొన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలను గమనించినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని సంస్థలు, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి పలు ప్రచారాలు చురుకుగా చేస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది.
అటువంటి సంస్థలు ఎలాంటి అధికారం లేకుండా ‘రుణ మాఫీ సర్టిఫికెట్లు’ జారీ చేయడానికి సేవా/చట్టపరమైన రుసుమును వసూలు చేస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. కొంతమంది వ్యక్తులు రుణ గ్రహీతలను తప్పుదారిపట్టించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. అలాంటి సంస్థలతో లావాదేవీలు జరిపితే ఆర్థిక నష్టాలు తప్పవని వినియోగదారులకు హెచ్చరించింది.
‘‘బ్యాంకులతోసహా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అటువంటి సంస్థలు లేదా వ్యక్తులు తప్పుగా సూచిస్తున్నారు. తద్వారా బ్యాంకింగ్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి‘ అని ఆర్‌బీఐ ప్రకటన వివరించింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి నష్టపోవద్దని, ఈ తరహా తప్పుడు ప్రచారం తమ దృష్టికి వస్తే, విచారణా సంస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment