ఆ ఆశా చెదిరింది | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

ఆ ఆశా చెదిరింది

Published Sun, Aug 10 2014 1:20 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

ఆ ఆశా చెదిరింది - Sakshi

ఆ ఆశా చెదిరింది

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లా రైతుల చిట్ట చివరి ఆశలు కూడా ఆవిరైపోయాయి. వర్షాభావ పరిస్థితులతో సాగు ఆలస్యమైంది. పెట్టుబడి పెట్టాలంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ హామీపై ఆశలు పెంచుకుని రుణాలు చెల్లించలేదు. సర్కార్ రుణమాఫీకి సవాలక్ష షరతులు పెడుతోంది. మాఫీ మాటెలా ఉన్నా కనీసం రుణాల రీ షెడ్యూలైనా అవుతుందనుకుని రైతులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జిల్లాలో కనీసం ఒక్క మండలానికి కూడా చోటు దక్కకపోవడంతో పంట రుణాల రీషెడ్యూల్‌కు అవకాశాలు అడుగంటాయి. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీపై గంపెడాశలు పెట్టుకుని రైతులు ఓటేసి బాబును  సీఎం చేశారు.
 
 అదే నమ్మకంతో     స్తోమత ఉన్న రైతులు కూడా రుణాలు చెల్లించలేదు. బాబు చెబుతున్నట్టు ప్రతి రైతు కుటుంబానికీ లక్షన్నర మేర రుణ మాఫీ అనేది ఇప్పట్లో అమలయ్యేలా లేదు. కనీసం రీ షెడ్యూల్ అయితే రుణాల చెల్లింపునకు నాలుగైదేళ్ల వ్యవధి లభిస్తుందని రైతులు ఆశించారు. ఇందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. గత ఏడాది నవంబరు, డిసెంబరుల్లో సంభవించిన భారీ వర్షాలు, తుపాన్లతో జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్టు అప్పట్లో జిల్లా యంత్రాంగమే లెక్క తేల్చింది. ఈ నష్టం జిల్లావ్యాప్తంగా 60 మండలాల్లో నమోదైందని రాష్ట్రప్రభుత్వానికి నివేదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 750 మండలాల్లో నష్టం సంభవించిందంటూ అప్పట్లో సర్కార్ ఇచ్చిన జాబితాలో మన జిల్లాలో 60 మండలాలున్నాయి.
 
 ఇదే విషయాన్ని రిజర్వుబ్యాంక్‌కు కూడా నివేదించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అప్పటి నివేదికలు అమలు చేయగలిగి ఉంటే జిల్లాలో రూ.1500 కోట్ల మేరకు రుణాలు రీషెడ్యూల్ అయ్యేవంటున్నారు. బాబు రుణమాఫీ హామీ అమలు కాకున్నా, రుణాల రీ షెడ్యూల్ జరిగి తీరుతుందని, దీని వల్ల కొంత వెసులుబాటు లభిస్తుందని ఖరీఫ్ రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఆర్‌బీఐ ప్రకటించిన 120 మండలాల జాబితాలో జిల్లాలో ఒక్క మండలానికీ చోటు దక్కకపోవడంతో వారు హతాశులయ్యారు. రీ షెడ్యూల్ అయితే పాతరుణాలు తక్షణం జమ చేయాల్సిన అవసరం లేకపోవడంతో పాటు ఎంత అప్పు ఉందో అంత మేరకు కొత్త రుణం పొందే అవకాశం ఉంటుందని నిరీక్షిస్తున్న రైతులను ఆర్‌బీఐ నిర్ణయం కుదేలు చేసింది.  
 
 10 శాతం కూడా జమ కాని బకాయిలు
 బాబు మాటలు నమ్మడంతో.. జిల్లా మొత్తమ్మీద రూ.6000 కోట్ల వ్యవసాయ రుణ బకాయిల్లో కనీసం 10 శాతం కూడా రైతులు జమ చేయలేదు. ఏదో క్షణాన మాఫీ అవుతుందని స్వల్పకాలిక, బంగారు రుణాలు తీసుకున్న సుమారు ఎనిమిది లక్షలమంది రైతులూ బ్యాంకుల వైపు కన్నెత్తి చూడలేదు. బాబు రుణమాఫీ ప్రకటన వెలువడ్డాక కొన్ని బ్యాంకులు నయానా, భయానో రూ.200 కోట్ల రుణాలు వసూలు చేయగలిగాయి. మిగిలిన వారు మాఫీపై నమ్మకంతో చెల్లించకుండా ఉండిపోయారు. తీరా ఇప్పుడు మాఫీపై గురి తప్పినా, రీ షెడ్యూల్ నమ్మకం వమ్మయినా రుణాలు జమ చేసే శక్తి వారికి ఎంత మాత్రం లేదు.
 
 పెట్టుబడికే చిల్లిగవ్వ లేక సతమతమవుతుంటే రుణాలు ఎలా చెల్లిస్తామంటున్న రైతులతో బ్యాంక్‌ల పరిస్థితీ సంకటంగానే ఉంది. అలాగని బకాయిలతో సంబంధం లేకుండా కొత్త రుణాలు ఇచ్చే ఆలోచనా కనిపించడం లేదు. ఇందుకు వారి కారణాలు వారికున్నాయి. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.5,514.42 కోట్లు. ఇందులో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు రూ.3,308.65 కోట్లు ఇవ్వాలని బ్యాంక్‌లు అనుకున్నాయి. రుణమాఫీ, రీషెడ్యూల్ హామీలతో వసూళ్లు నిలిచిపోయి జూలై నెలాఖరుకు రూ.515 కోట్లు మాత్రమే రుణాలు ఇచ్చాయి. ఇదే సమయానికి గత ఖరీఫ్ సీజన్‌లో రూ.2,232 కోట్ల రుణాలను రైతులకు ఇచ్చాయి
 
 .హామీలపై హామీలు గుప్పించి అధికారంలోకొచ్చిన బాబు ఇప్పుడు రుణమాఫీ, రీ షెడ్యూల్‌లలో ఏదీ నిర్దిష్టంగా అమలు చేయకుండా ద్రోహం చేశారని రైతులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకుంటే రుణాలు ఎప్పుడో చెల్లించేవారమని, ఎప్పటిలానే తిరిగి రుణపరపతి లభించేదని వాపోతున్నారు. రుణాలు అందకుండా చేసి, పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలోకి నెట్టారని ఆక్రోశిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement